Chest Hospital
-
ఆక్సిజన్ పెట్టారా? లేదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనాతో బాధపడుతున్న రోగి రవికుమార్‌కు ఆక్సిజన్ పెట్టామని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెం డెంట్ చెబుతున్నారు. తనకు ఆక్సిజన్ మాస్కు తొలగించారని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మళ్లీ పెట్టాలని కోరినా పట్టించుకోలేదని రవికుమార్ వీడియో తీసి పంపారు. ఇందులో ఏది నిజం. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా?’’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్ మృతి చెందారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బొల్గం యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. రవికుమార్ గుండె సంబంధవ్యాధితో చనిపోయారని, వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలు సమర్పించారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు. కొంత సమయం ఇస్తే రికార్డులు సమర్పిస్తామని చెప్పగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని తామెలా భావించాలి? నిబంధనల మేరకు కరోనా రోగికి అందించాల్సిన అన్ని చికిత్సలు చేశామంటున్నారు. మరి వైద్యనివేదికలు మా పరిశీలనకు ఎందుకు ఇవ్వడం లేదు ?’’అని ధర్మాసనం ప్రశ్నించింది. అదే ఆస్పత్రిలో మరో రోగి కూడా వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయారని, అతడు కూడా చనిపోయే ముందు వీడియో తీసి పంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రియాంకా చౌదరి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం..రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశిస్తూ...విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
ఆస్పత్రిలో యువకుడి మృతిపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : చెస్ట్ ఆస్పత్రిలో యువకుడు రవికుమార్ మృతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ అందకే రవికుమార్ మృతిచెందాడని గురువారం పిటిషనర్ వాదనలు వినిపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రవికుమార్ చనిపోలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ హైకోర్టుకు స్పష్టం చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయాడన్నది అవాస్తవమని కోర్టుకు వివరించారు. (చదవండి : సురేష్‌పై ఎందుకంత ప్రేమ? : హైకోర్టు) యువకుడికి ఆక్సిజన్ అందకనే మృతిచెందాడన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. యువకుడి మృతిపై పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రవికుమార్ మృతి
సాక్షి, హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడు కరోనా వల్ల మరణించలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడి ప్రాణం పోయిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటిలేటర్ తీసేయడం వల్లే అతడు చనిపోయాడని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సకాలంలో వైద్యం అందకే రవికుమార్ మరణించారని, వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉందని పిటిషనర్ న్యాయవాది ప్రియాంక చౌదరి వాదించారు. ఇప్పటికే రవికుమార్ వీడియో వైరల్ అయ్యిందన్నారు. దీనిపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నివేదిక కప్పదాట్లతో ఉండకూడదని.. బాధ్యులు ఎంతటి సీనియర్ డాక్టర్లు అయినా చర్యలు ఉండాలని పేర్కొంది. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. -
ఆక్సిజన్ కావాలని ఆక్రందన.. అంతలోనే!
-
వీడియో కాల్: ఆక్సిజన్ కావాలని ఆక్రందన
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు. అయితే, తనకు ఊపిరి ఆడటం లేదని, వెంటిలేటర్ పెట్టమని బతిమలాడినా సిబ్బంది పట్టించుకోలేదని అతను చనిపోయేముందు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిసింది. నగరంలోని జవహర్ నగర్‌కు చెందిన యువకుడు కరోనా లక్షణాలతో చెస్ట్ ఆస్పత్రిలో చేరాడు. ఊపిరి ఆడటం లేదని, ప్రాణం పోయేలా ఉందని కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టిన వెంటిలేటర్‌ను తొలగించారని ఆరోపించాడు. మూడు గంటల నుంచి బతిమాలుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. చివరి క్షణంలో అందరికీ వీడ్కోలు చెప్తూ దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వీడియో రికార్డింగ్ బయటకు రావడంతో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, యువకుడి అంత్యక్రియల్లో 30 మంది బంధువులు పాల్గొన్నట్టు సమాచారం. అంత్యక్రియల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో స్థానికులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. (చదవండి: అవసరమైతే మళ్లీ లాక్డౌన్ : కేసీఆర్) -
రోగులను డబ్బులడిగితే క్రిమినల్ కేసులు
ఛాతీ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రోగులను డబ్బులు అడిగే ప్రభుత్వ ఆసుప త్రుల వైద్య సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న నిరుపేద రోగుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినా, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అలాంటి వారిపట్ల కఠినం గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. శనివారం మంత్రి ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ వార్డులను సందర్శించి... ఆసు పత్రిలో అందుతున్న వైద్యసేవలు, రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్ప త్రిలోని పడకలు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పరిశీలించారు. ఇటీవల ఐసీయూ లో ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో కొంతమంది రోగులు మృతిచెందిన అంశంపై ఆరా తీశారు. ఆసుపత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంపై వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం అడిగితే నాకు చెప్పండి...: ఎవరైనా లంచం అడిగితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా లక్ష్మారెడ్డి రోగులకు సూచించారు. విధి నిర్వహణలో సమయపాలన పాటించని వైద్య సిబ్బందిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఛాతీ ఆస్పత్రిలో త్వరలోనే అధునాతన ఐసీయూ సహా, సీటీ స్కాన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని ఆస్పత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాలను అభివృ ద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగానే గర్భవతులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందించి, అధునాతన పరీక్షలు చేయిస్తున్నామన్నారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయికుమార్, ఆర్ఎంఓ నరేందర్ మంత్రి వెంట ఉన్నారు. -
మా కాలనీ.. మా ఇష్టం!
కొత్త సచివాలయంపై తేలకముందే ఐఏఎస్‌ల నిర్ణయాలు ముందుగా తమ కాలనీ డిజైన్ గురించే చర్చ నేడు ఉన్నతాధికారుల కమిటీ మలి భేటీ రక్షణ మంత్రితో భేటీకి ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ హైదరాబాద్: కొత్త సచివాలయ సముదాయం ఎక్కడైతేనేం? అందులో తమ కాలనీ ఎలా ఉండాలో ఐఏఎస్ అధికారులు ముందుగానే డిజైన్ చేసుకుంటున్నారు. తమ క్వార్టర్ల డిజైన్, గదుల సంఖ్య, విస్తీర్ణం, రోడ్ల వెడల్పు తదితర అంశాలపై అధికారవర్గాలు తీవ్రంగా దృష్టిసారిస్తున్నాయి. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంగణంలో చేపట్టే నిర్మాణాల డిజైన్, సచివాలయం, సీఎం కార్యాలయం, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలకు సీనియర్ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. జీఏడీ(రాజకీయ) ముఖ్య కార్యదర్శిని కమిటీ చైర్మన్‌గా వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ గత నెలలో తొలిసారి భేటీ అయినప్పుడే అధికారుల క్వార్టర్లపై ప్రత్యేకంగా చర్చించింది. ఐఏఎస్ అధికారుల ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణంపైనే కమిటీ చర్చించింది. ఢిల్లీలోని న్యూ మోతీబాగ్‌లో ఉన్న సీపీడబ్ల్యూడీ క్వార్టర్ల నమూనాలో ఈ కాలనీని డిజైన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కాలనీగా ఐఏఎస్‌ల గృహ సముదాయం కొత్త ప్రాంగణంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నివాస గృహ సముదాయాన్ని ఒక కాలనీగా తీర్చిదిద్దుతారు. అందులో మొత్తం 100 ఇళ్లను నిర్మిస్తారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శులకు 1,200 చదరపు గజాల విస్తీర్ణంతో 16 ఇళ్లు నిర్మిస్తారు. 5 బెడ్రూంలతో ఒక్కో గృహ సముదాయంలో 2సర్వెంట్ క్వార్టర్లు, 2 కార్ల పార్కింగ్‌కు గ్యారేజీ ఉంటుంది. 600 చదరపు గజాల విస్తీర్ణంలో మరో 84 ఇళ్లు నిర్మిస్తారు. వీటిని కార్యదర్శులకు కేటాయిస్తారు. 4 బెడ్రూంలతో నిర్మించే ఈ యూని ట్లో 2 సర్వెంట్ క్వార్టర్లు, 2 కార్ల పార్కింగ్‌కు వీలుగా గ్యారేజీ ఉంటుంది. ఈ ఇళ్లన్నీ తూర్పునకు అభిముఖంగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ కాలనీలో 60 అడుగుల మెయిన్ రోడ్డు, 30 అడుగుల అంతర్గత రోడ్లు ఉంటాయి. ఇక సచివాలయం నిర్మాణం, సీఎం కార్యాలయ భవనం ఊసే లేదు. కాగా, ఈ నిర్మాణాలకు ఎర్రగడ్డ ఆసుపత్రికి బదులు సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్ను ఆనుకుని ఉన్న బైసన్ పోలో మైదాన ప్రాంతం అనువుగా ఉంటుందని పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. ఎర్రగడ్డ ఆసుపత్రి స్థలం కేవలం 40 ఎకరాలే ఉందని, బైసన్ పోలో మైదానం 170 ఎకరాల విస్తీర్ణం కావడంతో అక్కడ సువిశాలంగా సచివాలయం నిర్మించుకోవచ్చుననే చర్చ జరిగినట్లు సమాచారం. ఎర్రగడ్డ ప్రాంతం ఇప్పటికే కిక్కిరిసిపోయిందని, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దాంతో పోలిస్తే సికింద్రాబాద్ ప్రాంతం మేలుగా ఉంటుందని ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే బైసన్ పోలో మైదానం మిలిటరీ పరిధిలో ఉండటంతో అంతమేరకు మరోచోట స్థలం కేటాయించేలా రక్షణ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై రక్షణ మంత్రితో చర్చించేందుకు ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అసలు కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, అందుకే ప్రత్యామ్నాయాల పేరుతో కాలయాపన చేస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. -
ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు
ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఆసుపత్రిని తరలిచాలన్న నిర్ణయం ఎలా చట్ట విరుద్ధమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణ యం చట్ట విరుద్ధమని నిరూపించినప్పుడే తాము జోక్యం చేసుకోగలమని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛాతీ, టీబీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను సోమవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులో వాదనలు వినేందుకు నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. నాగం తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. వారసత్వ సంపదకు ఆధారాలు చూపండి.. ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించి, దాని స్థానంలో సచి వాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ఆసుపత్రుల ప్రాంగణంలో చారిత్రక భవనాలు ఉన్నాయని, అందువల్ల సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న తర్వాత ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలోని చారిత్రక భవనాలకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఉంటే చూపాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. -
ఛాతీ ఆస్పత్రి తరలింపు నిర్ణయంపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలు మావన హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాయి. సీపీఐ నగర శాఖ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో వామపక్షాలకు చెందిన పలువురు నేతలు సోమవారం హెచ్ఆర్సీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. -
20న ఛాతి ఆసుపత్రి ఎదుట లెఫ్ట్ ధర్నా
సాక్షి, హైదరాబాద్: వాస్తు పేరుతో ఛాతి ఆసుపత్రిని కూల్చి, అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 20న ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి వద్ద ధర్నా చేయాలని పది వామపక్షాలు నిర్ణయించాయి. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మార్చి 8-20 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ, వాడవాడలా సమావేశాలు పెట్టి పాలకుల నిర్ణయాలను ఎండగడతామని తెలిపాయి. సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కవులు,కళాకారులు చేపట్టిన చలో బైరాన్‌పల్లి అమరవీరుల నివాళి, కళాకారుల సమైక్యగానంలో వామపక్షాలు పాలుపంచుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి. -
‘రియల్’ దందా కోసమే సచివాలయం తరలింపు'
హైదరాబాద్ సిటీ : రియల్ ఎస్టేట్ దందా కోసమే ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపు యోచన చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపును వ్యతిరేకిస్తూ గురువారం ఓ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... పది కమ్యూనిస్టు పార్టీలు సీఎంను కలవాలని అనుమతి కోరితే ఇంత వరకు కనికరించలేదన్నారు. వాస్తు ప్రకారంగా పాలించడం రాజ్యాంగ విరుద్ధమని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రజలు సహించరని ఆయన చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా రోజుకో హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. నిజాం కాలంలో స్థాపించిన ఆస్పత్రిని తరలించడం సబబుకాదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాతిపదిక రాజ్యాంగంలో ఉన్న విలువలని అన్నారు. నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెట్టుబడులను తీసుకొస్తూ ధ్వంసం చేస్తున్నారని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజారెడ్డి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, ఎంసీపీఐయూ నాయకులు ఎం.డి.గౌస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, ఆర్ఎస్పీ నాయకులు జానకిరాము, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సురేందర్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, నాయకులు భూతం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
'చెస్ట్ ఆస్పత్రి తరలింపు ఏకపక్ష నిర్ణయం'
హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలంటూ కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలను సంప్రదించకపోవడం సరికాదని హితవు పలికారు. అఖిలపక్షం, అసెంబ్లీల్లో చర్చించాకే సచివాలయం, చెస్ట్ ఆస్పత్రిని తరలించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం రంగారెడ్డికి మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్ ఏర్పాటుచేయాలన్నారు. సచివాలయం తరలింపుపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. సచివాలయం తరలించవద్దని ప్రజలనుంచి ఈ-పిటిషన్లు సేకరించి గవర్నర్ కు సమర్పిస్తామన్నారు. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లి సంతకాల సేకరణ చేపడతామన్నారు. -
రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదు: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: ‘సచివాలయాన్ని ఛాతీ ఆసుపత్రికి తరలించి ఆకాశమెత్తు భవనాలు కడ్తడట. ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ పంపిస్తాడట. నీ ఇష్టమొచ్చినట్లు చేయడానికి తెలంగాణ నీ అయ్య జాగీరు కాదు’ అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించి, సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ టీడీపీ నేతలు సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఆసుపత్రిలో కలియతిరిగారు. వాస్తు దోషం పేరుతో వందల కోట్లు విలాసాలకు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌కు ప్రజల ఉసురు తగులుతుందని ఎల్.రమణ ధ్వజమెత్తారు. -
తరలించే సచివాలయానికి మెరుగులు..!
హైదరాబాద్: ‘ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తు బాగోలేదు.. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్ తరలించి.,, ఆ స్థలంలో కొత్త సచివాలయాలన్ని నిర్మిస్తాం’ అంటూ ఒకవైపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తుంటే... అధికారులు మాత్రం సచివాలయానికి మెరుగుల కోసమంటూ నిధులు విడుదల చేస్తున్నారు. సెక్రటేరియట్లో ప్రధాన రోడ్డు విస్తరణ కోసం రూ.9.80 లక్షలు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సెక్రటేరియట్లో మెయిన్ గేట్ నుంచి సీఎం కార్యాలయానికి వెళ్లే ప్రధాన దారి మలుపులు తిరిగి ఉంది. అందుకే సీ బ్లాక్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదురుగా ఉన్న నల్ల పోచమ్మ దేవాలయానికి.. డి బ్లాక్‌కు మధ్యలో ఉన్న లాన్‌ను పూర్తిగా తొల గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయ మార్గంలో మెయిన్‌గేట్, ఆర్చి నిర్మాణానికి కోటి రూపాయలు మం జూరు కాగా పనులు జరుగుతున్నాయి. తెలంగాణ సంసృ్కతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఆర్చీ నిర్మిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్ గేట్‌కు సమీపంలో రోడ్డుకు అడ్డుగా ఉందనే కారణంతో కిండర్ గార్టెన్ స్కూల్‌ను ఏ- బ్లాక్ సమీపంలోనికి తరలించారు. దీనికి రూ.15 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. సచివాలయ తరలింపు నేపథ్యంలో ఇవన్నీ వృథా మిగిలిపోనున్నాయి. -
ఆస్పత్రి తరలింపు ఆపాల్సిందే
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నిరుపేద వర్గాలకు చెందిన ఛాతీ, ఎయిడ్స్ రోగులకు వరప్రదాయినిగా ఉండటంతోపాటు నగరం నడిబొడ్డు నుంచే సేవలు అందిస్తున్న ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించాల్సిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆస్పత్రి తరలింపు జీవో 61ను వ్యతిరేకిస్తూ వైద్యులు, ఇతర సిబ్బంది చేస్తున్న ఆందోళనకు పూర్తిస్థాయిలో సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలసి సోమవారం ఛాతీ ఆస్పత్రిని ఆయన సందర్శించి ఆందోళన చేస్తున్న సిబ్బందికి సంఘీభావంగా ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు నేలపై కూర్చొని ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేసేలా సచివాలయాన్ని ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలోకి తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న సచివాలయం కేంద్రంగా ఎందరో ముఖ్యమంత్రులు దశాబ్దాల తరబడి రాష్ట్రాన్ని పాలించిన విషయాన్ని మరిచిపోయిన సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిమ్స్ ఆస్పత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిర్మించిన భవనాలు ఆయన మరణానంతరం దిక్కులేకుండా పడిఉన్నాయని, వాటిని నేటికీ పూర్తిచేయకుండా నిరుపయోగంగా మార్చిన అసమర్ధ పాలకుల నిర్వాకంతో ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తికాగానే సచివాలయం పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని, అలాంటప్పుడు కొత్త భవనాలు నిర్మించి ప్రజాధనం వృథా చేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఆస్పత్రి తరలింపునకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో 61ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నేత రెహ్మాన్ మాట్లాడుతూ వాస్తుపేరుతో సీఎం నాటకాలు ఆడుతున్నారని, దీనివెనక కుట్ర దాగుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ మహబూబ్‌ఖాన్ ఆస్పత్రి పనితీరును వివరించారు. 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆస్పత్రిలో నిత్యం దాదాపు 200 మంది ఛాతీ సమస్యలతో బాధపడే రోగులతోపాటు మరో 150 మంది ఎయి డ్స్ రోగులకు చికిత్స అందిస్తామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అందుబాటు లో ఉన్న ఆస్పత్రిని మార్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఆదం విజయకుమార్, శేషురెడ్డి, సురేష్‌రెడ్డి, సూర్యప్రకాశ్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, ముస్త ఫా, జార్జ్, మహిళా నేత మేరీ సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో అన్ని డివిజన్లలో పోటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 150 డివిజన్లలోనూ పోటీ చేస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కార్యాచరణపై జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా జీహెచ్ఎంసీని ఐదు జోన్లుగా విభజించి, వాటికి పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. తూర్పు జోన్‌కు కె.శిమకుమార్, పశ్చిమ జోన్‌కు కొండా రాఘవరెడ్డి, ఉత్తర జోన్‌కు నల్లా సూర్యప్రకాష్, దక్షిణ జోన్‌కు హెచ్.ఎ. రెహ్మాన్, సెంట్రల్ జోన్‌కు మథిన్‌లను అబ్జర్వర్లుగా నియమించామన్నారు. పరిశీలకులంతా ఒక్కో డివిజన్లో అధ్యక్షుడు, ఐదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడంలో భాగంగా దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమార్తె, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మి ల వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందించుకోవాలని కార్యాచరణ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త పి. సిద్ధార్థరెడ్డి, నాయకులు ఆదం విజయ్‌కుమార్, సురేష్‌రెడ్డి, కె.శివకుమార్, గున్నం నాగిరెడ్డి, బీష్వ రవీందర్, మథిన్‌భాయ్, నల్లా సూర్యప్రకాష్, ప్రఫుల్లారెడ్డి, అమృతసాగర్, ముస్తాఫా, హెచ్.ఎ. రెహ్మాన్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి
-
చెస్ట్ ఆస్పత్రిని తరలిస్తే ఉద్యమమే: పొంగులేటి
హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి పార్టీ నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన ధర్నా నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్ కు తరలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమిస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఛాతి ఆస్పత్రి తరలింపు ఆపాలి- పొన్నాల
హైదరాబాద్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి తరలింపు వివాదాస్పదం అవుతోంది. చెస్ట్ ఆస్పత్రి తరలింపునకు వ్యతిరేకంగా పలు పార్టీలు అందోళ చేపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి తరలింపు జోవోను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. చెస్ట్ ఆస్పత్రి కి తరలింపునకు వ్యతిరేకంగా ఎర్రగడ్డలో గురువారం కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు పాల్గొన్నారు -
'తుగ్లక్ పాలనలా కేసీఆర్ ఆలోచనలు'
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు వ్యవహారాన్ని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు పిచ్చి ఆలోచన అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. సచివాలయాన్ని తరలించి ఆకాశ హర్మ్యాలు కడితే పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ భ్రమపడుతున్నారని నాగం విమర్శించారు. ఛాతి ఆస్పత్రి తరలింపుపై అఖిలపక్ష భేటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆలోచనలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని నాగం ఎద్దేవా చేశారు. ఆయన నిర్ణయాల వల్ల మంత్రులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా పోయిందని ఆయన అన్నారు. అధికారుల బదిలీలు సీఎం కనుసన్నల్లో జరుగుతున్నాయని నాగం విమర్శించారు. కాగా రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
'కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా'
హైదరాబాద్ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే చెస్ట్ ఆసుపత్రిని మరో ప్రాంతానికి తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.... కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. చెస్ట్ ఆసుపత్రి తరలింపుపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళన వెంటనే విరమించాలని వారికి దేవీ ప్రసాద్ హితవు పలికారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం)ను తొలగించి.. ఆ స్థానంలో మానసిక రోగుల చికిత్సాలయం, చెస్ట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రంగంలోకి దిగి సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రుల స్థానంలో పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెస్ట్ ఆసుపత్రిని తొలగించడం భావ్యం కాదని ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. -
ఎర్రగడ్డలో 'ఛాతీ' వైద్యుల ధర్నా
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు. నగర శివార్లలోని అనంతగిరికి ఛాతీ ఆస్పత్రిని తరలించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలను నిరసిస్తూ సిబ్బంది ధర్నాకు దిగారు. ఆస్పత్రి తరలింపును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రసిద్ధ అనంతగిరి క్షయ నివారణ కేంద్రం (టీబీ శానిటోరియం)ను ఎత్తివేసి.. దాని స్థానంలో మానసిక రోగుల చికిత్సాలయం, చాతి వైద్యశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ఎర్రగడ్డలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల చికిత్సాలయం, ఛాతీ వైద్యశాలను అనంతగిరికి తరలించేందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలుకు ఒకట్రెండు రోజుల్లో మోక్షం కలుగుతుందని, వారంరోజుల్లో దీనిపై ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎర్రగడ్డలోని ఈ రెండు ఆస్పత్రులను పెరేడ్ గ్రౌండ్‌కు శాశ్వత వేదికగా ఉపయోగించుకోనున్నట్లు ఇటీవల ఆయా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వెల్లడించిన సంగతి తెలిసిందే.