'తుగ్లక్ పాలనలా కేసీఆర్ ఆలోచనలు'
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు వ్యవహారాన్ని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సచివాలయం, ఛాతి ఆస్పత్రి తరలింపు పిచ్చి ఆలోచన అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. సచివాలయాన్ని తరలించి ఆకాశ హర్మ్యాలు కడితే పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ భ్రమపడుతున్నారని నాగం విమర్శించారు. ఛాతి ఆస్పత్రి తరలింపుపై అఖిలపక్ష భేటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఆలోచనలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని నాగం ఎద్దేవా చేశారు. ఆయన నిర్ణయాల వల్ల మంత్రులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా పోయిందని ఆయన అన్నారు. అధికారుల బదిలీలు సీఎం కనుసన్నల్లో జరుగుతున్నాయని నాగం విమర్శించారు. కాగా రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.