సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్, ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు జీవీ సూర్యకిరణ్, ముఖ్యనేతలు అంజిరెడ్డి, జగదీష్‌రావుతోపాటు మరో 63 మంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికీ రాహుల్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి ‘వెల్‌కం’అంటూ ఆహ్వానించారు. వేములవాడ దేవస్థానం నుంచి తెచ్చిన శాలువాను ఆదిశ్రీనివాస్ రాహుల్‌కు బహుకరించారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ఏ లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో అ దిశగా ప్రస్తుతం రాష్ట్రం ముందడుగు వేయడం లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. బంగారు తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
సోనియా రుణం తీర్చుకుంటాం...
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని నాగం జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారం కోసం, మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ప్రస్తుతం అది జరగడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర అడుగుతున్న రైతులను జైళ్లలో పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికం పెరిగిపోతోందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా టీఆర్‌ఎస్ న్యాయం చేయడం లేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రాజెక్టుల్లో దోపిడీయే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన టార్గెట్ అని, ఆయన్ను గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని నాగం ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టాక కాంగ్రెస్‌లోకి వరుస చేరికలను పెద్ద విజయంగా భావిస్తున్నట్లు కుంతియా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ నాయకత్వంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటామన్నారు.
నాగం జనార్దన్‌రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. రాహుల్ పిలుపునిచ్చిన సేవ్ కాన్‌స్టిట్యూషన్ నినాదం నచ్చి కాంగ్రెస్‌లో చేరినట్లు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ తెలిపారు. దేశ శ్రేయస్సు కోసం రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయమే తనను కాంగ్రెస్ వైపు నడిపిందన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తనకు తండ్రి ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని, ప్రజాసమస్యలను బీజేపీ గాలికొదిలేసిందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment