మా కాలనీ.. మా ఇష్టం!
కొత్త సచివాలయంపై తేలకముందే ఐఏఎస్‌ల నిర్ణయాలు
ముందుగా తమ కాలనీ డిజైన్ గురించే చర్చ
నేడు ఉన్నతాధికారుల కమిటీ మలి భేటీ
రక్షణ మంత్రితో భేటీకి ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్
హైదరాబాద్: కొత్త సచివాలయ సముదాయం ఎక్కడైతేనేం? అందులో తమ కాలనీ ఎలా ఉండాలో ఐఏఎస్ అధికారులు ముందుగానే డిజైన్ చేసుకుంటున్నారు. తమ క్వార్టర్ల డిజైన్, గదుల సంఖ్య, విస్తీర్ణం, రోడ్ల వెడల్పు తదితర అంశాలపై అధికారవర్గాలు తీవ్రంగా దృష్టిసారిస్తున్నాయి. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంగణంలో చేపట్టే నిర్మాణాల డిజైన్, సచివాలయం, సీఎం కార్యాలయం, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలకు సీనియర్ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. జీఏడీ(రాజకీయ) ముఖ్య కార్యదర్శిని కమిటీ చైర్మన్‌గా వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ గత నెలలో తొలిసారి భేటీ అయినప్పుడే అధికారుల క్వార్టర్లపై ప్రత్యేకంగా చర్చించింది. ఐఏఎస్ అధికారుల ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణంపైనే కమిటీ చర్చించింది. ఢిల్లీలోని న్యూ మోతీబాగ్‌లో ఉన్న సీపీడబ్ల్యూడీ క్వార్టర్ల నమూనాలో ఈ కాలనీని డిజైన్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
కాలనీగా ఐఏఎస్‌ల గృహ సముదాయం
కొత్త ప్రాంగణంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల నివాస గృహ సముదాయాన్ని ఒక కాలనీగా తీర్చిదిద్దుతారు. అందులో మొత్తం 100 ఇళ్లను నిర్మిస్తారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శులకు 1,200 చదరపు గజాల విస్తీర్ణంతో 16 ఇళ్లు నిర్మిస్తారు. 5 బెడ్‌రూంలతో ఒక్కో గృహ సముదాయంలో 2సర్వెంట్ క్వార్టర్లు, 2 కార్ల పార్కింగ్‌కు గ్యారేజీ ఉంటుంది. 600 చదరపు గజాల విస్తీర్ణంలో మరో 84 ఇళ్లు నిర్మిస్తారు. వీటిని కార్యదర్శులకు కేటాయిస్తారు. 4 బెడ్‌రూంలతో నిర్మించే ఈ యూని ట్‌లో 2 సర్వెంట్ క్వార్టర్లు, 2 కార్ల పార్కింగ్‌కు వీలుగా గ్యారేజీ ఉంటుంది. ఈ ఇళ్లన్నీ తూర్పునకు అభిముఖంగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ కాలనీలో 60 అడుగుల మెయిన్ రోడ్డు, 30 అడుగుల అంతర్గత రోడ్లు ఉంటాయి. ఇక సచివాలయం నిర్మాణం, సీఎం కార్యాలయ భవనం ఊసే లేదు. కాగా, ఈ నిర్మాణాలకు ఎర్రగడ్డ ఆసుపత్రికి బదులు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌ను ఆనుకుని ఉన్న బైసన్ పోలో మైదాన ప్రాంతం అనువుగా ఉంటుందని పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది.
ఎర్రగడ్డ ఆసుపత్రి స్థలం కేవలం 40 ఎకరాలే ఉందని, బైసన్ పోలో మైదానం 170 ఎకరాల విస్తీర్ణం కావడంతో అక్కడ సువిశాలంగా సచివాలయం నిర్మించుకోవచ్చుననే చర్చ జరిగినట్లు సమాచారం. ఎర్రగడ్డ ప్రాంతం ఇప్పటికే కిక్కిరిసిపోయిందని, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, దాంతో పోలిస్తే సికింద్రాబాద్ ప్రాంతం మేలుగా ఉంటుందని ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడినట్లు తెలిసింది. అయితే బైసన్ పోలో మైదానం మిలిటరీ పరిధిలో ఉండటంతో అంతమేరకు మరోచోట స్థలం కేటాయించేలా రక్షణ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. దీనిపై రక్షణ మంత్రితో చర్చించేందుకు ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అసలు కొత్త సచివాలయం నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, అందుకే ప్రత్యామ్నాయాల పేరుతో కాలయాపన చేస్తోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.