సాక్షి, హైదరాబాద్: వాస్తు పేరుతో ఛాతి ఆసుపత్రిని కూల్చి, అక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 20న ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి వద్ద ధర్నా చేయాలని పది వామపక్షాలు నిర్ణయించాయి. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించాయి.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మార్చి 8-20 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ, వాడవాడలా సమావేశాలు పెట్టి పాలకుల నిర్ణయాలను ఎండగడతామని తెలిపాయి. సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కవులు,కళాకారులు చేపట్టిన చలో బైరాన్‌పల్లి అమరవీరుల నివాళి, కళాకారుల సమైక్యగానంలో వామపక్షాలు పాలుపంచుకోవాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి.