స్కూళ్లు 9 నుంచి 4.30 గంటల వరకే | state Schools will be open from 9am to 4pm : High court | Sakshi
Sakshi News home page

స్కూళ్లు 9 నుంచి 4.30 గంటల వరకే

Published Thu, Sep 26 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

స్కూళ్లు 9 నుంచి 4.30 గంటల వరకే

స్కూళ్లు 9 నుంచి 4.30 గంటల వరకే

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల పని వేళల విషయంలో విద్యార్థులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును హైకోర్టు వెలువరించింది. అన్ని పాఠశాలలు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మాత్రమే పనిచేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల పనివేళల విషయంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చేసిన ప్రతిపాదనలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు కచ్చితంగా వర్తింపజేయాల్సిందేనని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.
 
 పాఠశాలలు ఇష్టారాజ్యంగా పనివేళలను నిర్దేశిస్తున్నాయని, దీనివల్ల విద్యార్థులకు తమ తల్లిదండ్రులతో గడిపేందుకు సైతం సమయం దొరకడం లేదంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన రామ్‌గోపాల్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. పనివేళల విషయంలో నియంత్రణ లేకపోవడం విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, దీని వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని కోర్టుకు నివేదించారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు, దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది.
 
 ఈ ఆదేశాలకు అనుగుణంగా కౌంటర్ దాఖలు చేసిన విద్యాశాఖ, పాఠశాలల పనివేళల విషయంలో ఎస్‌సీఈఆర్‌టీ స్పష్టమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిందని, దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతీ పాఠశాల కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మాత్రమే పనిచేయాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్నం 12.15 నుంచి 1.15 గంటల వరకు భోజన విరామంగా ప్రతిపాదించారని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 12.15 నుంచి ఒంటి గంట వరకు, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 1.45 వరకు భోజన విరామ సమయాన్ని నిర్ణయించారని అధికారులు కోర్టుకు నివేదించారు. ఈ ప్రతిపాదనలను అన్ని పాఠశాలలూ తప్పనిసరిగా పాటించాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, జిల్లాల కలెక్టర్లను, జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement