ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్‌ మోసం బయటపడింది  | Union Minister Kishan Reddy comments on state budget | Sakshi
Sakshi News home page

ఈ బడ్జెట్‌తో కాంగ్రెస్‌ మోసం బయటపడింది 

Published Sun, Feb 11 2024 4:01 AM | Last Updated on Sun, Feb 11 2024 4:01 AM

Union Minister Kishan Reddy comments on state budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన మోసం బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్‌ది అంకెలతో పాటు మాటల గారడీ సర్కార్‌ అని విమర్శించారు. ‘‘మొత్తంగా ఈ బడ్జెట్‌.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోంది.

ఇది తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన దారుణ మోసం’’అని మండిపడ్డారు. బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలను చూస్తే.. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఇచ్చి న గ్యారంటీ.. ఇక అమలు కానట్టేనన్నారు. ‘ౖసాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు (రూ. 28 వేల కోట్లు) ఏమాత్రం సరిపోవు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా ఈ నిధులు సరిపోవు’అని వ్యాఖ్యానించారు. 

అసలు ‘రాజీవ్‌ ఆరోగ్య శ్రీ’అమలవుతుందా? 
బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.11వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్‌ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమ లు చేస్తుందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారు? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

మైనారిటీలకు (15 శాతం జనాభాకి) రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందని విమర్శించారు.వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించారని, మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితి ఏమిటని నిలదీశారు. 

ఇక ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు లేనట్టేనా? 
కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో... మొదటి సమావేశంలోనే బీసీ సబ్‌ ప్లాన్‌ చట్టబద్ధం చేస్తామన్నారనీ కానీ ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌ 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అంబేడ్కర్‌ మాటలను ఉటంకించారు. కానీ అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

‘కాంగ్రెస్‌ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల గురించి గొప్పగా చెప్పుకున్నరు. బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు. మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. ఇచ్చింది రూ.7,700 కోట్లు మాత్రమే’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement