సాక్షి, అమరావతి: జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన జీవన నైపుణ్యాల (లైఫ్ స్కిల్స్)ను అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు చేపట్టింది. తద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) విద్యార్థుల్లో సామర్థ్యాలను వెలికితీయనుంది. వారిని మరింత ముందుకు తీసుకురావడానికి, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు 2019లోనే జీవన నైపుణ్యాల కోసం పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. వీటిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు, నాయకత్వ–నిర్వహణ నైపుణ్యాలు, ప్రపంచ మానవ విలువలు వంటి నాలుగు విభాగాలున్నాయి.
వీటిని యూజీసీ తన వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, డిజిటల్ ఎథిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెర్బల్, నాన్–వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానవ హక్కులు వంటి కొత్త విభాగాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ తమకు సరిపోయే విధంగా ఈ కరిక్యులమ్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించింది. రోల్ ప్లేయింగ్, ఆడియో–వీడియో ఫిల్మ్, వ్యక్తిగత, సమూహ కార్యకలాపాలు, కేస్ స్టడీస్, ప్రదర్శన, పరిశీలన, ఈ–లెర్నింగ్ వంటి వాటిని కూడా యూజీసీ పొందుపరిచింది.
ఉన్నత విద్యనభ్యసించేవారికి భావవ్యక్తీకరణ, నిర్వహణ, నాయకత్వ అంశాల్లో వృత్తిపరమైన, వ్యక్తిగత పురోభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. విద్యార్థి దశ నుంచే లైఫ్‌స్కిల్స్‌ను బోధిస్తే రోజువారీ జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా విద్యార్థులు అందుకోగలుగుతారని యూజీసీ భావిస్తోంది.
మార్గదర్శకాలు విడుదల..
డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా పాఠ్యాంశాలు, మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. అలాగే అధ్యాపకులు సమర్థవంతమైన బోధనను అందించడానికి వీలుగా నాలుగు విభాగాలు (కోర్సులు)గా కంటెంట్‌ను రూపొందించింది. ఈ నాలుగు కోర్సులకూ క్రెడిట్లను కూడా యూజీసీ నిర్ణయించింది.
ప్రతి కోర్సులో 2 క్రెడిట్‌లు విద్యార్థులకు అందిస్తారు. మొత్తం కోర్సులు 8 క్రెడిట్‌లను కలిగి ఉంటాయి. విద్యార్థులు సెమిస్టర్‌లలో 2 క్రెడిట్ కోర్సులు ఒకేసారి తీసుకున్నా కోర్సు వారీగా క్రెడిట్ సాధించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల క్రెడిట్ పరిమితి ఒకే సెమిస్టర్‌లో నాలుగుకి మించకూడదు. అంటే ఒకేసారి రెండు కోర్సులు మాత్రమే చేయడానికి వీలవుతుంది. ఈ కోర్సులు బోధించడానికి అవసరమైన అధ్యాపకులను కాలేజీలు నియమించుకోవాలి. కోర్సులను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా అందించవచ్చు.
క్రెడిట్ విధానం ఇలా..
యూజీసీ కరిక్యులమ్‌లోని యూజీ ప్రోగ్రామ్‌ల క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఒక్కో క్రెడిట్ కోర్సులో అభ్యసన పని వారానికి నిర్దేశిత కాలం ప్రకారం తప్పనిసరిగా ఉండాలి. సెమిస్టర్ కాలవ్యవధి 15 వారాలుగా ఉంటుంది. ఒక సెమిస్టర్‌లో ప్రాక్టికల్ లేదా ల్యాబ్ వర్క్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ సర్వీసెస్ ఫీల్డ్ వర్క్‌లతో మరో క్రెడిట్ కోర్సు ఉంటుంది.
దీనిలో వారానికి రెండు గంటల అభ్యసనం ఉండాలి. కోర్సుకు ప్రతిపాదిత క్రెడిట్‌ల సంఖ్యను ఉన్నత విద్యాసంస్థలు నిర్ణయించవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో ఆయా కోర్సుల విభాగాల్లో పనిగంటల సంఖ్యను నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. సాధ్యమైన చోట కమ్యూనిటీ సర్వీసు, లేదా అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌ల్లో పాల్గొనవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment