under graduate
-
యూజీ స్థాయిలో జీవన నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన జీవన నైపుణ్యాల (లైఫ్ స్కిల్స్)ను అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు చేపట్టింది. తద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) విద్యార్థుల్లో సామర్థ్యాలను వెలికితీయనుంది. వారిని మరింత ముందుకు తీసుకురావడానికి, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు 2019లోనే జీవన నైపుణ్యాల కోసం పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. వీటిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు, నాయకత్వ–నిర్వహణ నైపుణ్యాలు, ప్రపంచ మానవ విలువలు వంటి నాలుగు విభాగాలున్నాయి. వీటిని యూజీసీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, డిజిటల్ ఎథిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెర్బల్, నాన్–వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానవ హక్కులు వంటి కొత్త విభాగాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ తమకు సరిపోయే విధంగా ఈ కరిక్యులమ్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించింది. రోల్ ప్లేయింగ్, ఆడియో–వీడియో ఫిల్మ్, వ్యక్తిగత, సమూహ కార్యకలాపాలు, కేస్ స్టడీస్, ప్రదర్శన, పరిశీలన, ఈ–లెర్నింగ్ వంటి వాటిని కూడా యూజీసీ పొందుపరిచింది. ఉన్నత విద్యనభ్యసించేవారికి భావవ్యక్తీకరణ, నిర్వహణ, నాయకత్వ అంశాల్లో వృత్తిపరమైన, వ్యక్తిగత పురోభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. విద్యార్థి దశ నుంచే లైఫ్‌స్కిల్స్‌ను బోధిస్తే రోజువారీ జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా విద్యార్థులు అందుకోగలుగుతారని యూజీసీ భావిస్తోంది. మార్గదర్శకాలు విడుదల.. డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా పాఠ్యాంశాలు, మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. అలాగే అధ్యాపకులు సమర్థవంతమైన బోధనను అందించడానికి వీలుగా నాలుగు విభాగాలు (కోర్సులు)గా కంటెంట్‌ను రూపొందించింది. ఈ నాలుగు కోర్సులకూ క్రెడిట్లను కూడా యూజీసీ నిర్ణయించింది. ప్రతి కోర్సులో 2 క్రెడిట్లు విద్యార్థులకు అందిస్తారు. మొత్తం కోర్సులు 8 క్రెడిట్లను కలిగి ఉంటాయి. విద్యార్థులు సెమిస్టర్లలో 2 క్రెడిట్ కోర్సులు ఒకేసారి తీసుకున్నా కోర్సు వారీగా క్రెడిట్ సాధించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల క్రెడిట్ పరిమితి ఒకే సెమిస్టర్లో నాలుగుకి మించకూడదు. అంటే ఒకేసారి రెండు కోర్సులు మాత్రమే చేయడానికి వీలవుతుంది. ఈ కోర్సులు బోధించడానికి అవసరమైన అధ్యాపకులను కాలేజీలు నియమించుకోవాలి. కోర్సులను ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో కూడా అందించవచ్చు. క్రెడిట్ విధానం ఇలా.. యూజీసీ కరిక్యులమ్లోని యూజీ ప్రోగ్రామ్‌ల క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఒక్కో క్రెడిట్ కోర్సులో అభ్యసన పని వారానికి నిర్దేశిత కాలం ప్రకారం తప్పనిసరిగా ఉండాలి. సెమిస్టర్ కాలవ్యవధి 15 వారాలుగా ఉంటుంది. ఒక సెమిస్టర్లో ప్రాక్టికల్ లేదా ల్యాబ్ వర్క్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీసెస్ ఫీల్డ్ వర్క్‌లతో మరో క్రెడిట్ కోర్సు ఉంటుంది. దీనిలో వారానికి రెండు గంటల అభ్యసనం ఉండాలి. కోర్సుకు ప్రతిపాదిత క్రెడిట్ల సంఖ్యను ఉన్నత విద్యాసంస్థలు నిర్ణయించవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో ఆయా కోర్సుల విభాగాల్లో పనిగంటల సంఖ్యను నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. సాధ్యమైన చోట కమ్యూనిటీ సర్వీసు, లేదా అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌ల్లో పాల్గొనవచ్చు. -
ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా
సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, నిజాం కళాశాల విద్యార్థినులతో సమావేశమయ్యారు. నిజాం కళాశాల విద్యార్థినుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్గదర్శక నిబంధనలకు అనుగుణంగా వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులందరూ దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా నిజాం కళాశాలలో యుజీ విద్యార్థినులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థినులకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. చదవండి: (అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లపై తేల్చేసిన సీఎం కేసీఆర్) -
హైదరాబాద్ విద్యార్థికి వెల్స్‌స్లీ వర్సిటీ రూ. 2 కోట్ల స్కాలర్షిప్
మల్కాజిగిరి: లక్ష్య సాధనకు సంకల్ప బలం దండిగా ఉండాలి. విజయం దిశగా పయనించేందుకు అకుంఠిత శ్రమ తోడవ్వాలి. ఆ కోవకు చెందిన యువతియే మల్కాజిగిరి విష్ణుపురి కాలనీకి చెందిన లక్కప్రగడ నీలిమ కుమార్తె శ్రేయా సాయి. అమెరికా మసాచుసెట్స్‌లోని ప్రఖ్యాత వెల్స్లీ కాలేజీలో 2022– 26 వరకు అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోసం రూ.2.7 కోట్ల (ఇండియన్ కరెన్సీ) స్కాలర్షిప్ ప్యాకేజీని సదరు యూనివర్సిటీ నుంచి ఆమె పొందడం గమనార్హం. శ్రేయా సాయి సైనిక్‌పురిలోని భవన్స్‌లో పదో తరగతి, నల్లకుంటలోని డెల్టా కాలేజీలో ఇంటర్మీడియట్ చదివింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే లక్ష్యంతో వెల్స్‌స్లీ కాలేజీని ఎంపిక చేసుకొని ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకుంది. శ్రేయా సాయి ప్రతిభను గుర్తించిన మసాచుసెట్స్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్, సైకాలజీలో యూజీ చేయడానికి రూ.2.7 కోట్లు మంజూరు చేస్తూ మార్చి నెలలో సంబంధించిన పత్రాలను అందజేశారు. కాలేజీ ఫౌండర్ శ్రీకాంత్ మల్లప్ప, అకాడమీ డైరెక్టర్ భాస్కర్ గరిమెళ్లతో పాటు పాటా్నకు చెందిన గ్లోబల్ సంస్థ సీఈఓ శరత్ సహకారంతో వెల్స్లీ కళాశాలలో సీటు సాధించినట్లు శ్రేయా సాయి తెలిపింది. వచ్చే నెలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్తున్నట్లు పేర్కొంది. అమ్మ తోడ్పాటుతోనే.. s పాఠశాల స్థాయి నుంచే వివిధ పోటీల్లో పాల్గొనే దాన్ని. స్వచ్ఛ భారత్ నిర్వహణకు తోటి విద్యార్థులతో గ్రూపు ఏర్పాటు చేశాను. కేబినెట్ మెంబర్‌గా ఉండేదాన్ని. అమ్మ నీలిమతో పాటు అమ్మమ్మ జానకీదేవి సహకారం ఎంతో ఉంది. ప్రత్యేక కార్యాచరణతో ఆన్లైన్ అసైన్‌మెంట్స్‌తో పాటు, సెమినార్స్‌లో పాల్గొనేదాన్ని. నా పట్టుదలే లక్ష్యాన్ని దరిజేరేలా చేసింది. – శ్రేయాసాయి (చదవండి: బాత్రూంలోనే నివాసం) -
నీట్ యూజీ ఫలితాల విడుదలకు ఓకే!
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ యూజీ 2021 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 12న నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. అయితే, టెస్ట్ బుక్లెట్, ఓఎంఆర్ షీట్లు పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయంటూ మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అభ్యర్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వారిద్దరికీ పరీక్ష మళ్లీ నిర్వహించాకే నీట్ ఫలితాలను వెల్లడించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై ఎన్టీఏ సుప్రీం ను ఆశ్రయించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది పరీక్షా ఫలితాలు నిలిపివేయడం కుదరదంది. -
పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా పెండింగ్‌లో పడిన 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను కచ్చితంగా నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ సాన్యం భరద్వాజ్‌బుధవారం చెప్పారు. లాక్డౌన్ కంటే ముందు కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఆయా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశించడానికి వీలుగా అత్యంత ముఖ్యమైన 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. ఇంకా 40కిపైగా సబ్జెక్టులు పెండింగ్‌లో ఉండగా, 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్ పరీక్షలు ఎప్పటినుంచి జరుగుతాయన్న దానిపై విద్యార్థులకు 10 రోజుల ముందే నోటీసు ఇస్తామని భరద్వాజ్ తెలిపారు. -
అక్రమార్కులు!
యూనివర్సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో ఉద్యోగుల నిర్లక్షం ఫలితంగా వేల మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్క్స్‌కార్డుల జారీ ఇలా ప్రతి అంశంలోను నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి 62 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను గత నెల 18న విడుదల చేశారు. భారీగా మాస్‌కాఫీయింగ్: పరీక్షల నిర్వహణలో మాస్‌కాఫీయింగ్‌ను ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రోత్సహించాయి. ఒకే కళాశాలలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఒకేలా రాసేశారు.. కాదు రాయించారు. అనంతపురం మూల్యాంకన కేంద్రంలో అప్పటి వీసీ పర్యవేక్షణకు వెళ్లగా అధ్యాపకులంతా సార్ మాస్‌కాఫీయింగ్ జరిగిందని ఏకరువు పెట్టడం విశేషం. ప్రతి మండల కేంద్రంలోనూ డిగ్రీ కళాశాలలు విస్తరించిన అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కళాశాలల్లో ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. మాస్‌కాపీయింగ్ జరిగినట్లు మూల్యాంకనంలో బయటపడ్డా ఎవరినీ విత్‌హెల్డ్‌లో ఉంచకపోవడం కొసమెరుపు. పరీక్ష ఫీజు చెల్లించకపోయినా... 892 మంది విద్యార్థులకు సంబంధించి ఆయా డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజు చెల్లించకపోయినా పరీక్షలకు అనుమతి యిచ్చారు. పరీక్ష ఫీజు కట్టినా కూడా కొన్ని కళాశాల విద్యార్థుల పరీక్ష ఫీజు ఆయా కళాశాలల యాజమాన్యాలు చెల్లించలేదని విత్‌హెల్డ్‌లో ఉంచారు. దీంతో విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఫలితాలను నిలుపదల చేయకపోవడంలో మర్మమేమిటో: డిగ్రీ ఫలితాలను గత నెల 18న విడుదల చేశారు. పరీక్షకు గైర్హాజరు అయినా పాస్ అయినట్లు ధ్రువీకరించారు. ఇంటర్నల్ మార్క్స్‌ను కలపకుండా నిర్లక్ష్యం చేసి వేల మంది విద్యార్థులను ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. ఇవన్నీ బయటపడడంతో ఫలితాలను నిలుపదల చేసి, సవరణలు చేసిన తర్వాత ఫలితాలను ప్రకటించకపోవడంలో గల ఆంతర్యేమిటోనని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆవార్డు షీట్, చెక్‌లిస్ట్‌ల పరిశీలన తర్వాత ట్యాబులేషన్‌లో నమోదు చేయాలి. నిబంధనలకు విరుద్దంగా మార్క్స్‌కార్డులు జారీ చేయడంతో తప్పిదాలు బయటపడ్డాయి. అయితే ఈ తప్పిదాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో? విద్యార్థుల మార్కులు ఎందుకు మార్చారో? వంటి అంశాలపై స్పందించాల్సిన భాద్యత అందుకు భాద్యులైన ప్రతి ఒక్కరిపై ఉంటుందని విశ్లేషకుల భావన. విద్యార్థుల ఇక్కట్లు పట్టనట్లు : డీగ్రీ పూర్తీ అయిన తర్వాత పీజీలో అడ్మిషన్స్, వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు దక్కిన విద్యార్థులు మార్క్స్ కార్డుల అక్రమాలతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మారుమూల ప్రాంతాలలోని విద్యార్థులు పరీక్షలు బాగా రాసిన ఫెయిల్ అయినట్లు ఫలితాలు రావడంతో ఎవరిని సంప్రదించాలోనని సంశయంలో ఉన్నారు. బీఈడీ ప్రాక్టికల్‌కు హాల్‌టికేట్స్ ఇవ్వకపోవడంతో నిలుపదల: బీఈడీకి సంబంధించి 6నుంచి 10 వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26 నుంచి ఆగష్టు 2 వరకు పరీక్షలు జరపాలని షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కేవలం హాల్‌టికేట్స్ ఇవ్వడానికి ఉద్యోగులు నిరాకరించడంతో 25 బీఈడీ కళాశాలల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరపకుండా నిలుపదల చేశారు. హాల్‌టికేట్స్‌ను అందివ్వండని డీన్ లిఖిత పూర్వకంగా పేర్కొన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.