Life skills
-
యూజీ స్థాయిలో జీవన నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన జీవన నైపుణ్యాల (లైఫ్ స్కిల్స్)ను అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు చేపట్టింది. తద్వారా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) విద్యార్థుల్లో సామర్థ్యాలను వెలికితీయనుంది. వారిని మరింత ముందుకు తీసుకురావడానికి, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు 2019లోనే జీవన నైపుణ్యాల కోసం పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. వీటిలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు, నాయకత్వ–నిర్వహణ నైపుణ్యాలు, ప్రపంచ మానవ విలువలు వంటి నాలుగు విభాగాలున్నాయి. వీటిని యూజీసీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డిజిటల్ లిటరసీ, సోషల్ మీడియా, డిజిటల్ ఎథిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెర్బల్, నాన్–వెర్బల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానవ హక్కులు వంటి కొత్త విభాగాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ తమకు సరిపోయే విధంగా ఈ కరిక్యులమ్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించింది. రోల్ ప్లేయింగ్, ఆడియో–వీడియో ఫిల్మ్, వ్యక్తిగత, సమూహ కార్యకలాపాలు, కేస్ స్టడీస్, ప్రదర్శన, పరిశీలన, ఈ–లెర్నింగ్ వంటి వాటిని కూడా యూజీసీ పొందుపరిచింది. ఉన్నత విద్యనభ్యసించేవారికి భావవ్యక్తీకరణ, నిర్వహణ, నాయకత్వ అంశాల్లో వృత్తిపరమైన, వ్యక్తిగత పురోభివృద్ధికి ఇవి దోహదపడనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. విద్యార్థి దశ నుంచే లైఫ్‌స్కిల్స్‌ను బోధిస్తే రోజువారీ జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా విద్యార్థులు అందుకోగలుగుతారని యూజీసీ భావిస్తోంది. మార్గదర్శకాలు విడుదల.. డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా పాఠ్యాంశాలు, మార్గదర్శకాలను యూజీసీ విడుదల చేసింది. అలాగే అధ్యాపకులు సమర్థవంతమైన బోధనను అందించడానికి వీలుగా నాలుగు విభాగాలు (కోర్సులు)గా కంటెంట్‌ను రూపొందించింది. ఈ నాలుగు కోర్సులకూ క్రెడిట్లను కూడా యూజీసీ నిర్ణయించింది. ప్రతి కోర్సులో 2 క్రెడిట్లు విద్యార్థులకు అందిస్తారు. మొత్తం కోర్సులు 8 క్రెడిట్లను కలిగి ఉంటాయి. విద్యార్థులు సెమిస్టర్లలో 2 క్రెడిట్ కోర్సులు ఒకేసారి తీసుకున్నా కోర్సు వారీగా క్రెడిట్ సాధించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల క్రెడిట్ పరిమితి ఒకే సెమిస్టర్లో నాలుగుకి మించకూడదు. అంటే ఒకేసారి రెండు కోర్సులు మాత్రమే చేయడానికి వీలవుతుంది. ఈ కోర్సులు బోధించడానికి అవసరమైన అధ్యాపకులను కాలేజీలు నియమించుకోవాలి. కోర్సులను ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో కూడా అందించవచ్చు. క్రెడిట్ విధానం ఇలా.. యూజీసీ కరిక్యులమ్లోని యూజీ ప్రోగ్రామ్‌ల క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఒక్కో క్రెడిట్ కోర్సులో అభ్యసన పని వారానికి నిర్దేశిత కాలం ప్రకారం తప్పనిసరిగా ఉండాలి. సెమిస్టర్ కాలవ్యవధి 15 వారాలుగా ఉంటుంది. ఒక సెమిస్టర్లో ప్రాక్టికల్ లేదా ల్యాబ్ వర్క్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సర్వీసెస్ ఫీల్డ్ వర్క్‌లతో మరో క్రెడిట్ కోర్సు ఉంటుంది. దీనిలో వారానికి రెండు గంటల అభ్యసనం ఉండాలి. కోర్సుకు ప్రతిపాదిత క్రెడిట్ల సంఖ్యను ఉన్నత విద్యాసంస్థలు నిర్ణయించవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో ఆయా కోర్సుల విభాగాల్లో పనిగంటల సంఖ్యను నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. సాధ్యమైన చోట కమ్యూనిటీ సర్వీసు, లేదా అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌ల్లో పాల్గొనవచ్చు. -
మీలోని శక్తి ఎంత?!
నలుగురితో కలిసి ఉన్నప్పుడు మనలోని బలం పెరిగినట్టు అనిపిస్తుంది. అదే, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొనే సమయంలో మానసికంగా మనంఎంతటి శక్తివంతులమో మనకే అర్ధమవుతుంది. ఈ సమయంలో భావోద్వేగాలలో మార్పులు తీవ్రంగా ఉంటే జీవన విధానంపై అవి చెడు ప్రభావం చూపుతాయి. ‘ఒంటరిగా ఉన్నా, నలుగురిలో కలివిడిగా ఉన్నా భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటూ మనల్ని మనం శక్తిమంతులుగాఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుంటేవచ్చే సమస్యల అలలను సులువుగా ఎదుర్కోవచ్చు’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ‘సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ అనేది సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అయితే, ఇటీవల చాలా మందిలో గమనిస్తున్న విషయమేంటంటే చిన్న విషయానికి కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు. నేను చెప్పిందే వినాలి’ అనే ధోరణి పెరగడం కూడా బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది’ అంటున్నారు లైఫ్‌స్కిల్ ట్రెయినర్ జ్యోతిరాజ. ఎరుక అవసరం కొందరు తమచుట్టూ ఎవరికీ కనపడని ఒక వలయాన్ని సృష్టించుకుంటారు. పరిమితులను నిర్దేశించుకుని వాటిని దాటి బయటకు రారు. ఏదైనా చిన్న సమస్య ఎదురైనా సృష్టించుకున్న వలయం ఎక్కడ ఛిన్నాభిన్నం అవుతుందో అని తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. ఫలితంగా భావోద్వేగాల అదుపు కోల్పోయి ఇతరులను నిందించడం, తమను తామే శిక్షించుకోవడం లేదా గాసిప్స్‌ని ఆశ్రయిస్తారు. ‘భావోద్వేగాల అదుపు కోల్పోతే ఏ బంధంలోనైనా బీటలు వస్తాయి. అందుకని వలయాలతో కాకుండా ఎరుకతో మెలిగితే మనలోని అంతర్గత శక్తి స్థాయిలు స్పష్టమవుతాయి’ అనేది నిపుణుల మాట. మౌనంగా ఉండటం మేలు అతిగా మాట్లాడటం, చేతల్లో మన పనిని చూపించకపోతే ఎదుటివారి ముందు మన శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా భావోద్వేగాల్లోనూ మార్పు వస్తుంది. ఇది బంధుమిత్రుల మధ్య పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, పని ప్రదేశాలలో ఈ ‘శక్తి’ని బాగా గుర్తించవచ్చు. ఇబ్బందిని కలిగించే సంభాషణల్లో పా ల్గొనడం కన్నా, తక్కువ మాట్లాడం వల్ల శక్తిని, భావోద్వేగాల సమతుల్యతను కాపా డుకోవచ్చు. ఆ శక్తిని ఇతర సృజనాత్మక పనులకు బదిలిచేయవచ్చు. అవగాహనతో సరైన శక్తి అంతర్గత దిక్సూచిని భావోద్వేగ మేధస్సు అని కూడా అంటారు. ఇది సున్నితం–తీవ్రం రెండింటినీ సమాన స్థాయిలో ఉంచుతుంది. అంటే, నలుగురిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఎలా దూకుడుగా ప్రవర్తించబోతున్నాడో ముందే పసిగట్టి, నివారించే శక్తి వీరికుంటుంది. సరైన సమయంలో ఎలా స్పందించాలో తెలిస్తే భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగల అంతర్గత శక్తి పెరుగుతుంది. పట్టు విడుపులు తెలుసుండాలి... ఏ అంశం వదిలేయాలి, దేనిని మన ఆధీనంలో ఉంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. అనవసరం అనిపించే సమస్య ఏదైనా వదిలేయడం కూడా తెలియాలి. పిల్లలైతే వారు చదువుల్లో ఆటపా టల్లో బిజీగా ఉంటారు. కాలేజీ స్థాయి యువతలో బిజీగా ఉంటారు. గృహిణుల్లో మాత్రం పిల్లలు పెద్దయ్యాక వారికి కొంత తీరిక సమయం ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ముందునుంచే తమను తాము మలుచుకుంటూ ఉండాలి. తమలో ఉండే ఇష్టాయిష్టాలు, కలల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా కలిగే సంతృప్తి వల్ల భావోద్వేగాల అదుపు, అంతర్గత శక్తి స్ఙాయిలు పెరుగుతాయి. ఈ ప్రా క్టీస్ ఇంట్లో పిల్లల చేత కూడా చేయిస్తే, వారిలోనూ కొత్త సమర్థతలు బయటకు వస్తాయి. భావోద్వేగాల అదుపుకు అంతర్గతశక్తిని మేల్కొల్పడమే సరైన ఆయుధం. – ఆచార్య జ్యోతిరాజ, లైఫ్ స్కిల్ ట్రెయినర్ తట్టుకునే శక్తిని పెంచుకోవాలి.. సాధారణఃగా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే కంగారు పడిపోతాం. భయం ఆవరించేస్తుంది. ఈ ఒత్తిడి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. బ్యాక్‌పెయిన్, నెక్ పెయిన్, స్ట్రెస్.. వంటివి సాధారణంగా ఉంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా ఆరోగ్యం, మానసిక స్థిరత్వానికి యోగ సాధన చేయడం ఒక భాగం చేసుకున్నాను. దీనితో పా టు ధ్యానం చేయడం వల్ల ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళన లేకుండా సమస్యలను తట్టుకుని, ముందడుగు వేసే శక్తినిచ్చే ఆయుధాలుగా వీటిని మలుచుకున్నాను. – కవిత ఎన్, సాఫ్ట్వేర్ ఉద్యోగిని -
విహారం.. ఓ విజ్ఞానం...
నాటి రోజుల్లో యువరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయాలంటే ... అక్కడున్న వనరులు, ప్రజల జీవనశైలి, చుట్టూ ఉన్న ప్రాంతాల వివరాలతో పాటు పొరుగు దేశాల గురించిన సమస్త సమాచారం తెలుసుకోవలసిందే! దీనిని ప్రధాన అర్హతగా భావించేవారు. అందుకే రాజుల కాలంలో వారి పుత్రులను చదువు పూర్తయ్యాక ప్రపంచ పర్యటన చేసి రావల్సిందేనని ఆదేశించేవారు. నాడే కాదు నేడూ ఆ అర్హత పిల్లలకు అందించాలంటే వారిలో పర్యటనల పట్ల ఆసక్తి పెంచాలి. ఎందుకంటే...ప్రకృతిని మించిన గురువు లేరు... బడిలో ఉపాధ్యాయులు ఎంత చెప్పినా బుర్రకెక్కని పాఠాలను ప్రకృతి సులువుగా నేర్పుతుంది. కాలు కందని బాల్యానికి కరకురాళ్ల గట్టితనాన్ని పరిచయం చేస్తుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగమని వృక్షరాజాలు, ఎటునుంచి సమస్య వచ్చినా పోరాడే నేర్పును మృగరాజులు, గంభీరంగా సాగమని నదులు, తుళ్లిపడమనే సెలయేళ్లను.. ఇలా ఎన్నింటినో ప్రకృతి పరిచయం చేస్తుంది. అనుబంధానికి రహదారి... వృత్తి, ఉద్యోగాలలో కొట్టుమిట్టాడే తల్లిదండ్రులకు, చదువుల చట్రంలో బిగుసుకుపోయిన పిల్లలకు కొత్త ఊపిరిని అందించేవి పర్యటనలే! జీవన నైపుణ్యాలు... కొత్త ప్రదేశాలలో కొత్తవారితో ఎలా మెలగాలో పిల్లలకు వాస్తవంగా తెలియజేయడంతో పాటు అమితమైన సహనాన్ని బోధిస్తుంది. తండ్రి చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూసే చిన్నారి కళ్లు పరిశోధనకు తొలిమెట్టు అవుతాయి. అమ్మ చీర కొంగు పట్టుకుని నడిచే చిన్నారి అడుగులు జ్ఞానానికి మార్గాలు చూపుతాయి. అవే మన ముందు తరాలకు మనమందించే అతి గొప్ప సంపద. - ఎన్.ఆర్