విహారం.. ఓ విజ్ఞానం...
నాటి రోజుల్లో యువరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయాలంటే ... అక్కడున్న వనరులు, ప్రజల జీవనశైలి, చుట్టూ ఉన్న ప్రాంతాల వివరాలతో పాటు పొరుగు దేశాల గురించిన సమస్త సమాచారం తెలుసుకోవలసిందే! దీనిని ప్రధాన అర్హతగా భావించేవారు. అందుకే రాజుల కాలంలో వారి పుత్రులను చదువు పూర్తయ్యాక ప్రపంచ పర్యటన చేసి రావల్సిందేనని ఆదేశించేవారు. నాడే కాదు నేడూ ఆ అర్హత పిల్లలకు అందించాలంటే వారిలో పర్యటనల పట్ల ఆసక్తి పెంచాలి.
ఎందుకంటే...ప్రకృతిని మించిన గురువు లేరు... బడిలో ఉపాధ్యాయులు ఎంత చెప్పినా బుర్రకెక్కని పాఠాలను ప్రకృతి సులువుగా నేర్పుతుంది. కాలు కందని బాల్యానికి కరకురాళ్ల గట్టితనాన్ని పరిచయం చేస్తుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగమని వృక్షరాజాలు, ఎటునుంచి సమస్య వచ్చినా పోరాడే నేర్పును మృగరాజులు, గంభీరంగా సాగమని నదులు, తుళ్లిపడమనే సెలయేళ్లను.. ఇలా ఎన్నింటినో ప్రకృతి పరిచయం చేస్తుంది.
అనుబంధానికి రహదారి... వృత్తి, ఉద్యోగాలలో కొట్టుమిట్టాడే తల్లిదండ్రులకు, చదువుల చట్రంలో బిగుసుకుపోయిన పిల్లలకు కొత్త ఊపిరిని అందించేవి పర్యటనలే!
జీవన నైపుణ్యాలు... కొత్త ప్రదేశాలలో కొత్తవారితో ఎలా మెలగాలో పిల్లలకు వాస్తవంగా తెలియజేయడంతో పాటు అమితమైన సహనాన్ని బోధిస్తుంది.
తండ్రి చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూసే చిన్నారి కళ్లు పరిశోధనకు తొలిమెట్టు అవుతాయి. అమ్మ చీర కొంగు పట్టుకుని నడిచే చిన్నారి అడుగులు జ్ఞానానికి మార్గాలు చూపుతాయి. అవే మన ముందు తరాలకు మనమందించే అతి గొప్ప సంపద.
- ఎన్.ఆర్