
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్‌పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు.
— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025
అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్‌లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్‌లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు.
అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్‌పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు.
ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్‌లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్‌లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు.
రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్‌ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు.
దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్‌ను కవ్వించాడని మ్యాచ్‌ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది.
ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు.
లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment