రేపటి నుంచి విద్యా రంగంపై ఓరియెంటేషన్‌ | Orientation on education department from 27th January | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి విద్యా రంగంపై ఓరియెంటేషన్‌

Published Wed, Jan 26 2022 4:07 AM | Last Updated on Wed, Jan 26 2022 4:07 AM

Orientation on education department from 27th January - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు–నేడు, జాతీయ విద్యా విధానం అమలు, స్కూళ్ల మ్యాపింగ్‌ వంటి అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజుకు కొన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఓరియెంటేషన్‌ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయం ఐదో బ్లాక్‌లో ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ఈ సమావేశంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలను అధికారులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఓరియెంటేషన్‌ కార్యక్రమానికి సంబంధిత హెచ్‌వోడీలు, ఇతర ఉన్నతాధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం–2020తోపాటు ఇతర సమాచారానికి సంబంధించి తెలుగు కాపీలు 200, ఇంగ్లిష్‌ కాపీలు 200 ప్రజాప్రతినిధులందరి కోసం సమకూర్చాలని కోరారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్యాశాఖ)కి లేఖ రాసింది.

తేదీలు, జిల్లాల వారీగా ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఇలా..
జనవరి 27: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి
జనవరి 28: పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం
జనవరి 29: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement