
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను అత్యున్నత స్థాయి బోధన ద్వారా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చి దిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు 30,230 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)ను ఏర్పాటు చేస్తున్నారు.
1 నుంచి 5 వ తరగతి స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నాడు–నేడు రెండో దశ స్కూళ్లలో కూడా ఐఎఫ్‌పీ, స్మార్ట్ టీవీల ఏర్పాటుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ స్కూళ్లలో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవోలు), అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ల (ఏపీవో)కు శుక్రవారం ఆదేశాలిచ్చారు.
రెండో దశలో పనులు పూర్తి చేసుకున్న అన్ని స్కూళ్లకు ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలను బోధనా తరగతి గదుల్లో మాత్రమే అమర్చాలన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేపట్టి ఆగస్టు నెలాఖరుకి పూర్తి చేయాలని డీఈవోలు, ఏపీవోలను ఆదేశించారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలకు అవసరమైన కేబులింగ్, ఇతర ఏర్పాట్లకు అంచనాలు రూపొందించాలని, రెండో దశలో అందుబాటులో ఉన్న నిధులతో వాటిని అమర్చాలన్నారు. ఏఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలకు సమీపంలో రెండు సాకెట్లు, స్విచ్‌లతో కూడిన రెండు సాకెట్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రాడ్ బ్యాండ్ సిగ్నల్ పాయింట్ అన్ని తరగతి గదుల మధ్యలో ఉంచాలని తెలిపారు.