ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల! | Huge Seats Left In Telangana Government Degree Colleges | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల!

Published Sun, Feb 7 2021 2:01 AM | Last Updated on Sun, Feb 7 2021 9:03 AM

Huge Seats Left In Telangana Government Degree Colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలతోపాటు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్‌ తరువాత 114 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24,178 సీట్లను విద్యార్థులెవరూ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ అటానమస్‌ కాలేజీల్లో 1,268 సీట్లు, ప్రముఖ ఎయిడెడ్, ఎయిడెడ్‌ అటానమస్‌ కాలేజీల్లోనూ 5,655 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ అటానమస్‌ కాలేజీల్లోనూ 396 సీట్లు మిగిలిపోగా ప్రైవేటు, ప్రైవేటు అటానమస్‌ కాలేజీల్లో ఏకంగా 1,61,469 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఆన్‌లైన్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) సీట్లను కేటాయించింది. అయితే అనేక మంది విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోకపోవడంతో వారికి సీట్లు లభించలేదు. పలు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అదే జరిగింది. దీంతో ప్రైవేటు కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి.

స్పందించని ప్రభుత్వం..
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కళాశాల విద్యా శాఖ స్పందించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో కౌన్సెలింగ్‌ తరువాత మిగిలిపోయే సీట్లలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయే సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో పేద విద్యార్థులు తాము కోరుకున్న డిగ్రీ కాలేజీల్లో, కోర్సుల్లో సీట్లు లభించక ఇష్టం లేకపోయినా ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొంటోంది. 

వృత్తి, సాంకేతిక విద్యలో ఎక్కువ పోటీ...
రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్‌ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది తప్ప ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ ఎంతో డిమాండ్‌ కలిగిన 300 వరకు సీట్లు మిగిలిపోయాయి.

విమర్శలొస్తాయనే  ‘స్పాట్‌’ నిర్వహించట్లేదు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ మెరిట్‌ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నందున స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తే మెరిట్‌ లేని వారు వచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థుల మధ్య సమస్యగా మారొచ్చు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్‌కు అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
– దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి

చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్‌!)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement