vocational
-
ప్రభుత్వ డిగ్రీ సీట్లూ వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలతోపాటు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఈసారి భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశాల కౌన్సెలింగ్ తరువాత 114 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 24,178 సీట్లను విద్యార్థులెవరూ తీసుకోలేదు. అలాగే ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో 1,268 సీట్లు, ప్రముఖ ఎయిడెడ్, ఎయిడెడ్ అటానమస్ కాలేజీల్లోనూ 5,655 సీట్లు మిగిలిపోయాయి. మరోవైపు యూనివర్సిటీ, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోనూ 396 సీట్లు మిగిలిపోగా ప్రైవేటు, ప్రైవేటు అటానమస్ కాలేజీల్లో ఏకంగా 1,61,469 సీట్లు మిగిలిపోయాయి. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) సీట్లను కేటాయించింది. అయితే అనేక మంది విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోకపోవడంతో వారికి సీట్లు లభించలేదు. పలు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనూ అదే జరిగింది. దీంతో ప్రైవేటు కాలేజీలే కాదు ప్రభుత్వ కాలేజీల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. స్పందించని ప్రభుత్వం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నా కళాశాల విద్యా శాఖ స్పందించడం లేదు. ప్రైవేటు కాలేజీల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయే సీట్లలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం... ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయే సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో పేద విద్యార్థులు తాము కోరుకున్న డిగ్రీ కాలేజీల్లో, కోర్సుల్లో సీట్లు లభించక ఇష్టం లేకపోయినా ఏదో ఒక డిగ్రీ కాలేజీలో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని విద్యార్థులకు ఇవ్వలేని దుస్థితి నెలకొంటోంది. వృత్తి, సాంకేతిక విద్యలో ఎక్కువ పోటీ... రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మేనేజ్మెంట్ కోటా సీట్లను లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ ప్రైవేటు కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది తప్ప ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అనుమతించడం లేదు. దీంతో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ ఎంతో డిమాండ్ కలిగిన 300 వరకు సీట్లు మిగిలిపోయాయి. విమర్శలొస్తాయనే ‘స్పాట్’ నిర్వహించట్లేదు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతోపాటు వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లోనూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేస్తున్నందున స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తే మెరిట్ లేని వారు వచ్చే అవకాశం ఉంది. అది విద్యార్థుల మధ్య సమస్యగా మారొచ్చు. అందుకే ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్‌కు అనుమతించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. – దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!) -
రేపు జాబ్‌మేళా
– డీవీఈవో సుబ్రమ్మణేశ్వరరావు వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) టి.వి.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. ఇదే అంశంపై శనివారం స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కె.గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 2014 నాటికి ఇంటర్ ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్‌మేళాకు అర్హులన్నారు. వివిధ కంపెనీలు పాల్గొంటున్నందున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్‌కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తెచ్చుకోవాలని కోరారు. ఇంజనీరింగ్, పారా మెడికల్, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశమన్నారు. బీక్యాంప్‌లోని ప్రభుత్వ ఒకేషనల్ వృత్తి విద్య కళాశాలలో ఉదయం 10.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిప్యూటీ డీవీఈఓ కె.వెంకట్రావ్, వృత్తి విద్య కోర్సుల ప్లేస్మెంట్ అధికారి బి.వి.మాధవరావు కూడా హాజరయ్యారు. -
8న జాబ్ మేళా
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో చదివి 2014లోపు పాస్ అయిన విద్యార్థు«లకు ఈ నెల 8వ తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా వృత్తి విద్యాధికారి టి.వి సుబ్రమణ్యేశ్వరరావు సోమవానం ప్రకటనలో తెలిపారు. స్థానిక బిక్యాంపులోని ఒకేషనల్ కాలేజీలో నిర్వహించే ఈ జాబ్ మేళాను ఒకేషనల్ కోర్సులు చేసిన నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
‘ఒకేషనల్’.. సమస్యలు ఫుల్
తొగుట :మండలంలోని రాంపూర్ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ ఒకేషనల్, జూనియల్ కళాశాల (ఒకేషనల్) కళాశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ కళాశాలల్లో 285 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 58 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్సీ), స్పెక్టరు క్వైరీ ల్యాంగ్వేజీ (ఎస్‌క్యూఎల్) కోర్సులను చదువుతున్నారు. వీరు పరీక్షల్లో పాస్ కావాలంటే 100 మార్కులకు గాను 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు, మరో 50 మార్కులు థియరీకి కేటాయించారు. ఈ రెండు కోర్సులను చేసిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొక్కపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా స్థిరపడవచ్చు. ఈ రెండు కోర్సుల్లో విద్యార్థులకు రోజుకు సుమారు గంట పాటు కంప్యూటర్లో ప్రాక్టికల్స్‌ను చేయాల్సి ఉంటుంది. కానీ ఒకేషనల్ కోర్సుల్లో సీఎస్సీ, ఎస్‌క్యూఎల్ చదివే విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో గతేడాది (అప్పటి ఎమ్మెల్యే) ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఎలాగోలా విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానానికి దూరం కావద్దని భావించి దాతల సాయంతో 8 కంప్యూటర్లు సమకూర్చారు. కానీ అవి పాతమోడల్ కావడంతో మాటిమాటికి మరమ్మతులకు గురి అవుతుండడంతో చాలా కంప్యూటర్లు మూలనపడ్డాయి. ఈక్రమంలో ఒకే కంప్యూటర్‌పై ఒకానొక సందర్భాల్లో 5 నుంచి 10 మంది విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను చేయించాల్సి పరిస్థితులు నెలకొంది. ముఖ్యంగా కళాశాలకు నెట్ కనెక్షన్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ కాకుండా ఫ్యాకెల్టీలు పడరాని పాట్లు పడుతున్నారు. కాగా కంప్యూటర్లు పాతవి కావడంతో విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను పూర్తి స్థాయిలో చేయించలేపోతున్నామని కళాశాల ప్రిన్సిపాల్ సలీం పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కళాశాలకు నూతన కంప్యూటర్లు, నెట్ కనెక్షన్ సదుపాయాలను కల్పించాలని లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.