‘ఒకేషనల్’.. సమస్యలు ఫుల్
తొగుట :మండలంలోని రాంపూర్ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ ఒకేషనల్, జూనియల్ కళాశాల (ఒకేషనల్) కళాశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ కళాశాలల్లో 285 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 58 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్సీ), స్పెక్టరు క్వైరీ ల్యాంగ్వేజీ (ఎస్‌క్యూఎల్) కోర్సులను చదువుతున్నారు. వీరు పరీక్షల్లో పాస్ కావాలంటే 100 మార్కులకు గాను 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు, మరో 50 మార్కులు థియరీకి కేటాయించారు.
ఈ రెండు కోర్సులను చేసిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొక్కపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా స్థిరపడవచ్చు. ఈ రెండు కోర్సుల్లో విద్యార్థులకు రోజుకు సుమారు గంట పాటు కంప్యూటర్‌లో ప్రాక్టికల్స్‌ను చేయాల్సి ఉంటుంది. కానీ ఒకేషనల్ కోర్సుల్లో సీఎస్సీ, ఎస్‌క్యూఎల్ చదివే విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో గతేడాది (అప్పటి ఎమ్మెల్యే) ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఎలాగోలా విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానానికి దూరం కావద్దని భావించి దాతల సాయంతో 8 కంప్యూటర్లు సమకూర్చారు. కానీ అవి పాతమోడల్ కావడంతో మాటిమాటికి మరమ్మతులకు గురి అవుతుండడంతో చాలా కంప్యూటర్లు మూలనపడ్డాయి.
ఈక్రమంలో ఒకే కంప్యూటర్‌పై ఒకానొక సందర్భాల్లో 5 నుంచి 10 మంది విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను చేయించాల్సి పరిస్థితులు నెలకొంది. ముఖ్యంగా కళాశాలకు నెట్ కనెక్షన్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ కాకుండా ఫ్యాకెల్టీలు పడరాని పాట్లు పడుతున్నారు. కాగా కంప్యూటర్లు పాతవి కావడంతో విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను పూర్తి స్థాయిలో చేయించలేపోతున్నామని కళాశాల ప్రిన్సిపాల్ సలీం పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కళాశాలకు నూతన కంప్యూటర్లు, నెట్ కనెక్షన్ సదుపాయాలను కల్పించాలని లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.