internet connection
-
Digital Emergency: కనెక్షన్ కట్.. 2012 నుంచి 665 సార్లు.. టాప్ ప్లేస్‌లో భారత్!
డిజిటల్ ఎమర్జెన్సీ. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం. ఈ ధోరణి భారత్‌లో రానురాను బాగాపెరిగిపోతోంది. ఎక్కడ ఏ చిన్న ఆందోళన జరిగినా, ఉద్రిక్తత తలెత్తినా ప్రభుత్వాలు తీసుకునే తొలి చర్య నెట్ కనెక్షన్ కట్ చేయడమే. ఇది వివాదానికి కూడా దారి తీస్తోంది. ఇంటర్నెట్ షట్డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే టాప్ ప్లేస్‌లో ఉంది! అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా, ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్థాన్‌లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా... ప్రభుత్వం విధిగా తీసుకున్న తొలి చర్య ఇంటర్నెట్ షట్‌డౌనే. ఇంటర్నెట్ లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని కాలమిది. ఏ ఉద్యమమైనా సోషల్ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ సాంకేతిక బాసట లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపేస్తున్నాయి. శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్‌కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా దెబ్బ పడుతోంది. 6 నెలల్లో 59 సార్లు... భారత్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్స్‌పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా 665సార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గళమెత్తే గొంతుకల్ని అణిచివేయడానికి నెట్ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్‌ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పౌర హక్కులకు భంగమేనా? ఇలా చీటికీమాటికీ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది దాని వాదన. ప్రభుత్వాలేమంటున్నాయి... సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో తప్పుడు సమాచారం, వదంతులు వాటి ద్వారా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయన్నది ప్రభుత్వాల వాదన. ఉద్రిక్త పరిస్థితులకు ఇవి ఆజ్యం పోస్తాయి కాబట్టే నెట్ కట్ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ ప్లాట్ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగానూ ప్రభావమే... ఇంటర్నెట్ షట్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని, మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్‌కు చెందిన అనూరాధా భాసిన్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది కూడా. అంతేకాదు, ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారాలను నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగంలోని 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) ఆర్టికళ్లలో పేర్కొన్న మేరకు పరిరక్షించాల్సిందే’ అని ఆదేశించింది. అయినప్పటికీ తాత్కాలికం అన్న పేరు చెబుతూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నాయి. అలా పొడిగించుకుంటూ వెళుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. బిఎస్ఎన్ఎల్ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద 100జీబీ డేటా 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో అందిస్తున్నారు. డేటా పూర్తీ అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఆరు నెలలే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా అందిస్తారు. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబిపిఎస్ వేగంతో 500జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399 ప్లాన్లు తీసుకోవాలంటే రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు బీమా పాలసీదారులకు శుభవార్త! -
స్వప్నాలికి హరీష్ శంకర్ ప్రశంసలు..
పుణె : చదువుకోవాలన్న ఆసక్తిగల ఎంతో మంది ప్రతిభావంతులు వివిధ కారణాలతో తమ చదువుకు దూరమవుతున్నారు. అలా తమ చెల్లి భవిష్యత్తు కావొద్దని ఆలోచించిన సోదరులు తన విద్యను కొనసాగించడం కోసం ఓ వినూత్న ఆలోచన చేశారు. వివరాలు.. సింధుదుర్గ్ జిల్లా కంకవ్లి మండలంలోని డారిస్టే గ్రామానికి చెందిన స్వప్నాలి సుతార్ అనే యువతి ఇంటర్లో 98 శాతం మార్కులు సాధించింది. భవిష్యత్తులో వెటర్నరీ డాక్టర్ కావాలనుకున్న స్వప్నాలి ప్రస్తుతం ఎంబీబీఎస్‌కు సన్నద్దమవుతోంది. అయితే ఆమె నివసించే ప్రాంతం మారుమూల గ్రామం అయినందున ఇంటర్నెట్ సదుపాయం లేదు. దీంతో తనకు ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోతుంది. ఇది చూసి చలించి పోయిన యువతి సోదరులు ఇంటర్నెట్ సిగ్నల్స్ కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పైన ఒక షెడ్ నిర్మించారు. (డిజిటల్ అంతరాలు అధిగమించాలి) స్వప్నాలి తన కుటుంబం అండతో రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొండమీద ఉన్న షెడ్ వద్దకు వెళ్లి చదువుకుంటోంది. అలాగే ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. ఇక దీనిని స్థానిక మీడియా ప్రచురించడంతో ఆమెకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. ఓ వ్యక్తి ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేయగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీట్వీట్ చేశారు. అంతేగాక ఎమ్మెల్యే నితేష్ రాణే.. ఆమె హాస్టల్ ఫీజు రూ .50 వేలు చెల్లించాడు. దీనిపై స్పందించిన పలువురు ‘తన కలల వైపు ప్రయాణించేందుకు అడ్డంకులు ఆపలేవని స్వప్నాలి పట్టుదలతో నిరూపించింది. ఆమెను చూస్తుంటే..మరో రాజ్యాంగాన్ని రాస్తున్నట్లు కనిపిస్తుంది’ అంటూ యువతిని ప్రశంసిస్తున్నారు. (ఆన్లైన్ విద్య కష్టంగా ఉంది) 12 తరగతిలో 98% స్కోర్ చేసి సునీత ఇప్పుడు ఎంబిబిఎస్ కోసం సిద్ధమవుతోంది. కానీ ఆమె గ్రామానికి ఆన్లైన్ తరగతులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఫోన్ లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్ రాదు, కాబట్టి ఆమె సోదరులు ఆమె కోసం గ్రామానికి దగ్గరలో ఒక కొండపై ఒక షెడ్ నిర్మించారు 1/2 pic.twitter.com/4CtPQcUvJb — Naga Kishore (@nagakishore981) August 23, 2020 -
అసాంజేకు ఇంటర్నెట్ కట్
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈక్వెడార్ ప్రకటించింది. కాటాలోనియన్ వేర్పాటువాది అరెస్ట్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా అసాంజే తన అభిప్రాయాన్ని తెలుపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈక్వెడార్ రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. యూరప్ దేశాలతో తమ దేశ సంబంధాలను అసాంజే చర్యలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు రఫెల్ కొరియా అధికారంలో ఉన్నప్పుడు అసాంజేకు మద్ధతుగా నిలిచినప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్ మోరెనో రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోకూడదని ఆయనను హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిలరీ క్లింటన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సమయంలో కూడా అసాంజేకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని తొలగించారు. అసాంజేపై స్వీడన్లో అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. బయటకు వస్తే పోలీసులు అరెస్టుచేసి స్వీడన్‌కు, తర్వాత అమెరికాకు అప్పగిస్తారన్నది అసాంజే భయం. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా అకృత్యాల రహస్య సమాచారాన్ని ఆయన వికీలీక్స్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. -
అక్కడ ముందుగానే ఇంటర్నెట్!
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద 4 గ్రామాలకు ముందుగానే ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మహేశ్వరం, మన్సాన్పల్లి, తుమ్మలూరు, సిరిగిరిపురం గ్రామా లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు అక్కడ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సిస్కో, హెచ్‌పీ, టెరాసాఫ్ట్, ఇంటెక్స్, డి–లింక్ తదితర 10 ప్రముఖ కంపెనీలు ఈ పనుల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్ పనులు జరుగుతుండగా.. వచ్చే నెలలో ఈ గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌తోపాటు కేబుల్ టీవీ, టెలిఫోన్, టీ–సాట్ టీవీ సేవలతోపాటు మీ–సేవ, సీసీ టీవీ.. తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి తొలి వారంలో ఈ గ్రామాల్లోని 50 గృహాలతోపాటు స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు తొలుత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. 30 వేల కి.మీ.ల ఫైబర్ డక్ట్ రెడీ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టీ–ఫైబర్) ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్రాజెక్టులో అంతర్భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.25 లక్షల కి.మీల మేరకు ఫైబర్ డక్ట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 30 వేల కి.మీల మేర పని పూర్తయింది. మరోవైపు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం డిజిటల్ ఇండియా ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి నిధులను సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
ఆశకుపోయిన వృద్ధుడు.. నిలువునా మోసం
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ వృద్ధుడు నిలువునా మోసపోయాడు. అతి తక్కువ రేటుకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి అతడిని మోసపుచ్చాడు. ఆయన నుంచి ఓ బ్లాంక్ చెక్కు తీసుకొని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా రూ.60 వేలు కాజేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామచంద్ర ప్రజాపతి (74) అనే పెద్దాయన వద్దకు ఓ వ్యక్తి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పిస్తానంటూ వచ్చాడు. ప్రస్తుతం అక్కడ నెలకు రూ.2,500 కనెక్షన్ ఇస్తుండగా తాము మాత్రం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్ ద్వారా రూ.74కు అందిస్తున్నామంటూ నచ్చజెప్పాడు. అది కూడా చెక్ ద్వారా అందిస్తున్నామన్నారు. అతడిని చూసి మంచివాడే అని నమ్మిన ప్రజాపతి రూ.74కు చెక్ రాసిచ్చాడు. అదే సమయంలో మరో ఖాళీ చెక్కును సేల్స్ మెన్ గా వచ్చిన వ్యక్తి తీసుకున్నాడు. ఇది నవంబర్ 4న జరిగింది. ఇటీవల తన పాస్ బుక్ అప్ డేట్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు తన ఖాతాలో నుంచి రూ.60,000 చెక్ ద్వారా డ్రా అయినట్లు తెలిసి అవాక్కయ్యాడు. అనంతరం సేల్స్‌మెన్‌కు ఖాళీ చెక్కు ఇచ్చిన విషయం గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. -
నల్లాతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్
పైప్లైన్లు, ఫైబర్ కేబుళ్ల ఏర్పాటుపై స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌తో ఇంటింటికీ నల్లాతో పాటు ఇంటర్నెట్ కనె క్షన్ కూడా త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అందుబాట్లోకి రానుందని పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ అన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్లతో పాటుగా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేసే పనులపై శనివారం అన్ని జిల్లాల ఎస్ఈలతో స్పెషల్ సీఎస్ సమీక్షించారు. తొలిదశలో మంచి నీరందించే 9 నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ వదలకుండా నల్లా, ఇంటర్నెట్ కనెక్షన్లను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌తో పాటుగా కేబుల్స్ వేసే విషయమై ఐటీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించడంలో ఐటీశాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్లకు ఐటీశాఖ నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ సమావే శంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు సురేశ్‌కుమార్, జగన్మోహన్రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, ఐటీ శాఖ డెరైక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రవల్లిలో ఇంటింటా ఇంటర్నెట్
జగదేవ్‌పూర్(మెదక్): ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో శుక్రవారం డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీంచారు. అనంతరం గ్రామచావిడి వద్ద గ్రామసభలో పాల్గొని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు మంజూరైన 42 ట్రాక్టర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలు సంఘటిత శక్తి అని ఎర్రవల్లి, నర్సన్న పేట గ్రామస్తులు నిరూపించాలని తెలిపారు. బర్రెలు, ఆవులు, కోళ్లతో ప్రత్యామ్నయ వ్యవసాయ ఆదాయం పెంచుకోవాలన్నారు. ఎర్రవల్లిలో ఇంటింటా ఇంటర్ నెట్ సౌకర్యం అందిస్తామని కేసీఆర్ తెలిపారు. -
అట్లాంటిక్ మీదుగా ‘నెట్’ కనె క్షన్
వాషింగ్టన్: అమెరికా నుంచి యూరోప్‌కు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా కేబుల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వాలని మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఇంటర్నెట్ సదుపాయాన్ని వేగంగా, సులభతరం చేయడానికే ఈ పనిని చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు సంయుక్తంగా తెలిపాయి. ‘మరియా’ అనే కొత్త కేబుల్ (సెకన్‌కు 160 టెరాబైట్స్ బ్యాండ్‌విడ్త్ వేగంతో) సహాయంతో అత్యధిక వేగంతో ఆన్లైన్ సేవలు అందించనున్నామని పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దీని పనులు మొదలుపెట్టి 2017 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు వెల్లడించాయి. -
మా చానల్స్ చూడండి.. నెలకు మూడు వేలిస్తాం !
కోదాడ టౌన్: ‘మేమే కంప్యూటర్ ఇస్తాం.. ఇం టర్నెట్ కనెక్షన్ ఉంటే బిల్లు కూడా ఇస్తాం. అంతే కాదు.. నెలకు రూ.3,000 మీ అకౌంట్లో వేస్తాం. మేము ఇచ్చిన కంప్యూటర్ను రోజుకు ఎనిమిది గంటలు ఆన్‌చేసి ఉంచాలి. ఇందుకోసం ఇప్పుడు 10 వేలు చెల్లించాలి.’ ఇదీ కోదాడలో నెల రోజు లుగా ఒక సంస్థ చేస్తున్న ప్రచారం. దీంతో వేలం వెర్రిగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉద్యోగులు ఎగబడుతున్నారు. కానీ, ఇందులో ఏదో తిరకాసు దాగుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమ వెబ్సైట్ కోసం ప్రచారం అని చెబుతుండడం గమనార్హం. కోదాడ, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్షిత క్రియేషన్స్ పేరుతో వెబ్‌చానల్స్ నడుపుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. విద్యార్థులు, వ్యాపారులను మచ్చిక చేసుకుని రూ.10 వేలకు పాత కంప్యూటర్ అంటగడుతున్నారు. ప్రతినెలా నెట్ బిల్లు రూ.500 ఇస్తామని.. రోజు ఎనిమిది గంటలు కంప్యూటర్ను ఆన్ చేసి ఉంచితే ప్రతి నెలా రూ.3,000 అకౌంట్లో వేస్తామని ప్రచారం చేయడంతో ఒక్క కోదాడలోనే నెల రోజుల్లో 200 మంది రూ.10 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి పాత కంప్యూటర్లను తీసుకున్నారు. వాస్తవానికి ఒక్కో కంప్యూటర్ ఖరీదు రూ. 5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ఉంటుందని పాత కంప్యూటర్లను రెట్టింపు రేట్లతో అంటగడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అధినేతలకు అర్జీలు... ఒక్క క్లిక్‌తో..
కనీసం గ్రామ కార్యదర్శికి సమస్య విన్నవించాలంటేనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్న రోజులివి. వినతి పత్రం ఇవ్వడానికి పనులు మానుకొని, అనేక వ్యయప్రయాసలకోర్చి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి, అక్కడ అమాత్యులు, అధికారులు కనిపించకపోతే పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఇటువంటి కష్టాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పడనుంది. ముఖ్య నేతలకు ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి వారధిగా నిలుస్తోంది ఆన్లైన్. కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉండి.. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు ఒక్క క్లిక్‌తో తమ సమస్యపై విన్నపం పంపుకోవచ్చు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా గవర్నర్‌కు ఇలా పంపాలి... aprajbhavan@gmail.com మెయిల్‌కు ఫిర్యాదుదారుడు తమ పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా నేరుగా పంపవచ్చు. ⇒ఇంటర్నెట్ ఉంటే చాలు.. ⇒ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు ⇒సీఎం, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికీ చిటికెలో విన్నపం రాష్ట్రపతికి పంపాలంటే... రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే www.presidentofindia.nic.in వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే అడుగుభాగంలో కుడిపైపు హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్ ఏ రిక్వెస్ట్’మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అనే బాక్సులో 4000 పదాలకు మించకుండా సమస్య వివరించి పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన సమస్య పరిష్కారం అయిందో కాలేదో తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంఖ్య ఉపయోగపడుతుంది. ప్రధానికి ఫిర్యాదు చేయాలంటే.. దేశ ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.pmindia. gov.in వెబ్సైట్లోకి వెళ్లి సమస్యలను విన్నవించవచ్చు. పేజీ ఓపెన్ చేయగానే ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పీఎం’ వస్తుంది. క్లిక్ చేస్తే ‘టు రైట్ టు ది ప్రైమినిస్టర్ క్లిక్ హియర్’ అనివస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చిరునామాతోపాటు ఈ మెయిల్ ఐడీ లింక్ ఉంటుంది. ‘క్లిక్ హియర్’అన్న చోట క్లిక్ చేస్తే ‘కామెంట్స్’ అనే పేజీ తెరుచుకుంటుంది. ఫిర్యాదు దారుడి వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్‌ను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీలో 1000 అక్షరాలలోపు సమస్యను వివరించి దిగువ భాగాన ఉన్న కోడ్‌ను నమోదు చేయాలి. ముఖ్యమంత్రికి సమస్య విన్నవించాలంటే .. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగంలో సిటిజన్ ఇంటర్ ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీని నమోదుచేసి సంబంధిత విషయాన్ని క్లుప్తంగా వివరించాలి. -
‘ఒకేషనల్’.. సమస్యలు ఫుల్
తొగుట :మండలంలోని రాంపూర్ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ ఒకేషనల్, జూనియల్ కళాశాల (ఒకేషనల్) కళాశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఈ కళాశాలల్లో 285 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 58 మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్సీ), స్పెక్టరు క్వైరీ ల్యాంగ్వేజీ (ఎస్‌క్యూఎల్) కోర్సులను చదువుతున్నారు. వీరు పరీక్షల్లో పాస్ కావాలంటే 100 మార్కులకు గాను 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు, మరో 50 మార్కులు థియరీకి కేటాయించారు. ఈ రెండు కోర్సులను చేసిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొక్కపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా స్థిరపడవచ్చు. ఈ రెండు కోర్సుల్లో విద్యార్థులకు రోజుకు సుమారు గంట పాటు కంప్యూటర్లో ప్రాక్టికల్స్‌ను చేయాల్సి ఉంటుంది. కానీ ఒకేషనల్ కోర్సుల్లో సీఎస్సీ, ఎస్‌క్యూఎల్ చదివే విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో గతేడాది (అప్పటి ఎమ్మెల్యే) ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఎలాగోలా విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానానికి దూరం కావద్దని భావించి దాతల సాయంతో 8 కంప్యూటర్లు సమకూర్చారు. కానీ అవి పాతమోడల్ కావడంతో మాటిమాటికి మరమ్మతులకు గురి అవుతుండడంతో చాలా కంప్యూటర్లు మూలనపడ్డాయి. ఈక్రమంలో ఒకే కంప్యూటర్‌పై ఒకానొక సందర్భాల్లో 5 నుంచి 10 మంది విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను చేయించాల్సి పరిస్థితులు నెలకొంది. ముఖ్యంగా కళాశాలకు నెట్ కనెక్షన్ సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ కాకుండా ఫ్యాకెల్టీలు పడరాని పాట్లు పడుతున్నారు. కాగా కంప్యూటర్లు పాతవి కావడంతో విద్యార్థులచే ప్రాక్టికల్స్‌ను పూర్తి స్థాయిలో చేయించలేపోతున్నామని కళాశాల ప్రిన్సిపాల్ సలీం పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కళాశాలకు నూతన కంప్యూటర్లు, నెట్ కనెక్షన్ సదుపాయాలను కల్పించాలని లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
హైదరాబాద్ ఇంటర్నెట్ యూజర్స్ 22,00,000
హైదరాబాద్: మహానగరంలో ఇంటర్నెట్ వినియోగం అధికంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించేవారిలో మార్పు వచ్చింది. తమ ఇంటికే నేరుగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిల్టెల్ తదితర పెరొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. నెట్ కనెక్షన్‌దారుల సంఖ్య సుమారు 22 లక్షల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు సుమారు 10 లక్షల వరకు మొబైల్ కనెక్షన్ దారులు ఇంటర్నెట్ యూజర్లుగా మారారు. -
ఇక.. గ్రామపాలన పారదర్శకం
నల్లగొండ : మారుమూల గ్రామాలలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలను ప్రంపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 2440 గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటుచేయడంలో భాగంగా జిల్లాలో 171 పంచాయతీలను ఎంపికచేశారు. అం దుకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి. పంచాయతీలకు కంప్యూటర్లు సరఫరా చేయడానికి, బీఎస్ఎన్ల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్‌లోనే ఈ-పంచాయతీల పాల నను మొదటి దఫాలో అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 171 క్లస్టర్ పంచాయతీలలో నల్లగొండ డివిజన్లో 65, భువనగిరి డివిజన్లో 53, మిర్యాలగూడ డివిజన్లో 53 పంచాయతీలు ఉన్నాయి. 237 కంప్యూటర్ల పంపిణీ.. ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 237 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటినిు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు ఒక్కొక్కటి చొప్పున 59, జిల్లా పరిషత్‌కు రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో రెండు కంప్యూటర్లు, మూడు డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు కంప్యూటర్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేయనున్నారు. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇవ్వనున్నారు. గతంలో 18 పంచాయతీలలో ఈ-పాలన గతంలో కూడా గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 24 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. కానీ ఈ-పంచాయతీలుగా ఉన్న హుజూర్నగర్, దేవరకొండ పట్టణాలు నగర పంచాయతీలు కావడంతోపాటు మరో నాలుగు పంచాయతీలలో అమలు చేయలేకపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ పంచాయతీలతో కలిపి జిల్లాలో ఈ-పంచాయతీల సంఖ్య 189కి చేరనుంది. ఇక.. అన్నీ పారదర్శకమే - ఈ - పంచాయతీలలో అన్ని సేవలు కూడా పారదర్శకంగా అందించనున్నారు. - పంచాయతీలకు వచ్చే ఆదాయం వివరాలతో పాటు ఖర్చుల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతారు. - అంతే కాకుండా గ్రామంలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్లైన్లో ఉంచనున్నారు. -
పీసీతో ఇలా... చకచకా!
ఇంట్లో ఓ పీసీ, దానికో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం చేయలేని పనంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈమెయిళ్లు, చాటింగ్‌లు, ఆఫీసు పనులను పక్కనబెడితే... ఏ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా ఎన్నో సరదా, సీరియస్ పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లతో మాత్రమే ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు... ఏయే పనులు చేయవచ్చో మచ్చుకు చూద్దామా.... జీమెయిల్ కోసం రెండు ఆప్స్... జీమెయిల్లో మెసేజ్ టైప్ చేసి... మెయిల్ ఫలానా టైమ్‌కు, ఫలానా వారికి పంపితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే బూమరాంగ్ మీకోసమే. www.boomeranggmail.com/వెబ్సైట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. మీ మెయిళ్లను మీరు అనుకున్న సమయానికి పంపేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ కాకపోవడం గుర్తుంచుకోవాలి. బేసిక్ అకౌంట్ ద్వారా నెలకు 10 మెయిళ్లను ఉచితంగా షెడ్యూల్ చేసి పంపవచ్చు. అంతకంటే ఎక్కువ మెయిళ్లను పంపాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం సర్వీసులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీకు ఒకటికంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే... వాటిని ఒకేచోట చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్. క్రోమ్ వెబ్‌స్టోర్ ద్వారా లభించే ఈ ఎక్స్టెన్షన్లో ఒక డ్రాప్‌డౌన్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లలో చదవని మెయిళ్లు, వాటి ప్రివ్యూలు కనిపిస్తూంటాయి. ఫొటోలకు రంగులు అద్దండి... స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీయడం బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఫొటోలకు సరదాగా రంగులద్దాలనుకుంటే? లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించాలను కుంటే సైకోపెయింట్ అవకాశం కల్పిస్తుంది. రకరకాల పెయింట్ శైలుల నుంచి ఆన్లైన్లోనే మీ ఫోటోలకు రంగులు అద్దవచ్చు. లేదంటే సిద్ధంగా ఉన్న కొన్ని టూల్స్‌ను వాడుకోవచ్చు కూడా. మీకు పెయింటింగ్‌తో పరిచయముంటే కొత్తకొత్త డిజిటల్ కళాఖండాలను తయారు చేసేందుకు ఈ వెబ్సైట్లో బోలెడు రకాల బ్రష్‌లు, పెయింట్ ఎఫెక్ట్లు ఇచ్చే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం psykopaint.comవెబ్సైట్ చూడండి. ఐఫోన్ అప్లికేషన్గానూ సైకోపెయింట్ లభిస్తోంది. ఫోటోల ఎడిటింగ్... ఫోటోలకు పెయింట్ లక్షణాలను చేర్చేందుకు సైకోపెయింట్ ఉపయోగపడితే... సైజును సరిచేయడం, రంగులు నియంత్రించడం, వెలుతురును అడ్జస్ట్ చేయడం వంటి పనులకు పిక్స్‌లర్ దారి చూపుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్ కోసం పిక్స్‌లర్ ఎడిటర్, ఎఫెక్ట్‌లను చేర్చేందుకు పిక్స్‌లర్ ఓ మాటిక్, వేగంగా కొన్ని అంశాలను మాత్రమే సరిచేయాలనుకుంటే పిక్స్‌లర్ ఎక్స్‌ప్రెస్.. ఇలా మూడు లేయర్లలో ఈ వెబ్సైట్ సేవలు పనిచేస్తాయి. ఒక్కో లేయర్లో ఫొటోల నాణ్యతను పెంచేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారు. ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక మీ ఫోటోలను మళ్లీ కంప్యూటర్‌పై సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్: Pixlr.com ఈసెల్.ఎల్వై... వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పవచ్చు. అలాంటి ఫోటోలకు అంకెలు, గ్రాఫ్‌లు కూడా కలిశాయనుకోండి... విషయాన్ని సూటిగా, వివరించవచ్చు. అచ్చంగా ఈ పనులన్నింటికీ ఉపయోగపడే వెబ్సైట్ ఈసెల్.ఎల్వై. దాదాపు 300కుపైగా ఉన్న లేఔట్లను ఉచితంగా వాడుకునే అవకాశముంది. ఆ లేఔట్లపై రకరకాల ఫొటోలు, చిత్రాలను చేర్చుకునే సౌలభ్యం ఉంది దీంట్లో. పూర్తయిన తరువాత ఇన్ఫోగ్రాఫిక్ను జెపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ : www.easel.ly డెస్క్టాప్పై నోటీస్‌బోర్డు... ఏరోజుకు ఆరోజు మీరు చేయాల్సిన పనులను గుర్తు పెట్టుకునేందుకు ప్యాడ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. www.padlet.comవెబ్సైట్లో ఒకసారి ఫ్రీఅకౌంట్ను క్రియేట్ చేసుకుంటే చాలు. డెస్క్టాప్పై ఒక బ్లాంక్ నోటీస్‌బోర్డు ప్రత్యక్షమవుతుంది. మౌస్తో డబుల్‌ట్యాప్ చేయడం ద్వారా మీరు అందులో నోట్లు ఉంచుకోవచ్చు. టెక్ట్స్‌తోపాటు వెబ్‌లింక్‌లు, ఫైళ్లు, వెబ్‌క్యామ్‌తో తీసిన ఫొటోలను కూడా ఉంచుకోవచ్చు. ఇతరులతో షేర్ చేసుకునేందుకు అవకాశముంది. బ్లాంక్‌గా ఉండటం బోరు కొట్టిస్తూంటే అందమైన వాల్పేపర్లతో అలంకరించుకోవచ్చు. రకరకాల లేఔట్లతో తీర్చిదిద్దుకోవచ్చు కూడా. -
‘రిలయన్స్’ మూగబోయింది
అద్దంకి: రిలయన్స్.. ఈ పేరు వినగానే బ్రాండ్ ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఆ సంస్థకు చెందిన ఎలాంటి ఉత్పత్తులైనా నాణ్యంగా ఉంటాయని అందరి నమ్మకం. అయితే దీనికి రివర్స్‌గేర్ పడినట్లయింది. 15 రోజులుగా రిలయన్స్ మొబైల్, నెట్ కనెక్షన్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లు నిలిచిపోవడమే దీనికి కారణం. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ప్రతినిధులు అద్దంకిలో విస్తృత ప్రచారం చేపట్టారు. రిలియన్స్ సిమ్ కార్డులు, నెట్ మోడెమ్‌లను ఏజెంట్ల సాయంతో.. కొన్ని చోట్ల సంస్థ తరఫునే నేరుగా విక్రయించారు. సంస్థకు మంచిపేరు ఉండటంతో అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రీపెయిడ్ కార్డులు, మోడెమ్‌లు వేలాదిగా అమ్ముడుపోయాయి. కొంతమంది అయితే నెల, మూడు నెలలు, ఏడాది ప్యాకేజీలున్న మోడెమ్‌లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి తీసుకున్నారు. ఇలా నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో రిలయన్స్ నెట్వర్క్ విస్తరించింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఏడాది నుంచి సిగ్నల్ వ్యవస్థలో లోపాలు తలెత్తడం ప్రారంభమైంది. నెల రోజులు నెట్వర్క్ బాగుంటే.. ఆ తర్వాత నాలుగైదు రోజులు సమస్యరావడం, మళ్లీ సర్దుకోవడం జరుగుతోంది. అప్పటి నుంచే వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సమాచారం ఫోన్లో చేరవేయాలన్నా.. నెట్ ఉపయోగించాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం మామూలైంది. సమస్య ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడైతే ఏకంగా 15 రోజుల నుంచి సిగ్నల్స్ లేక ఫోన్లు, మోడెమ్‌లు మూగబోయాయి. ఈ దెబ్బకు ఇతర నెట్వర్క్ సేవలు వినియోగించుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. టవర్స్ తొలగిస్తున్నారా? పక్షం రోజులుగా రిలయన్స్‌తో విసిగిపోయిన ప్రజలు.. ఆ సంస్థకు చెందిన సిగ్నల్ టవర్లను ఎత్తివేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఎవరికివారు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్యాకేజీలు తీసుకున్నవారు లబోదిబోమంటున్నారు. దీనిపై రిలయన్స్ సంస్థ ఒంగోలు బాధ్యుడు రమణను ఫోన్లో సంప్రదించగా.. టవర్స్ బాగానే పని చేస్తున్నాయన్నారు. ఆ తర్వాత తేరుకొని.. అద్దంకిలోనే కాకుండా, మొత్తంమీద 74 టవర్లు పని చేయడంలేదని తెలిపారు. అందుకే సిగ్నల్స్ సరిగా రావడంలేదని రెండు రోజల్లో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. -
అరచేతిలో పోలింగ్ సెంటర్
కమాన్‌చౌరస్తా, న్యూస్‌లైన్ : మనచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు... దేశంలోని పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయే క్షణంలో తెలుసుకోవచ్చు. పోలింగ్ సెంటర్లు ఎక్కడున్నాయి.. వాటిని చేరుకునేందుకు దారి.. ఇలాంటి విషయాలు ఇట్టే తెలుసుకోవచ్చు. నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలను సైతం సూచిస్తుంది. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్ మ్యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాలను చూసుకునే అవకాశం కల్పించింది. దీనికోసం మీ మొబైల్ ఫోన్లో ఏదైనా బ్రోజర్‌ను తెరిచి అనే వెబ్సైట్లో పోలింగ్ కేంద్రాల వివరాలను అందుబాటులో ఉంచారు. వెబ్సైట్ వివరాలు టైప్‌చేయగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ తెరుచుకుంటుంది. కుడివైపున పోలింగ్‌స్టేషన్ మ్యాప్‌పై క్లిక్ చేయగానే పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఆన్ గూగుల్ మ్యాప్ అనే పేజీ తెరుచుకుంటుంది. అందులో ఉండే అప్షన్లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్స్టేషన్లను ఎంపిక చేసుకోవాలి. పక్కనే ఉన్న క్లిక్హియర్ అనే బటన్‌ను నొక్కగానే పోలింగ్ కేంద్రం ఎక్కడుందో క్షణంలో చూపిస్తుంది. ఇది రెండు రూపాల్లో అందుబాటులో ఉంటుంది. ఒకటి మ్యాప్, రెండోది శాటిలైట్ వ్యూ రూపంలో ఉంటుంది. మనకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవాలి. మనకు కావాల్సిన విధంగా మన స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. పోలింగ్ కేంద్రాలకు ఎలా వెళ్లాలో కూడా తెలుసుకోవచ్చు. చదువు, ఉద్యోగ నిమిత్తం బయట ప్రాంతాల్లో ఉండేవారు, స్థానిక వివరాలు సరిగా తెలియనివారు సులభంగా పోలింగ్ కేంద్రాల గురించి తె లుసుకోవచ్చు. దీంతోపాటు ఎన్నికల సిబ్బంది మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సి వచ్చినప్పుడు వారికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. దీంతో వారు అక్కడికి ఎలా వెళ్లాలి.. చుట్టుపక్కల గల ప్రాంతాలు ఉన్నాయనే విషయం పోలింగ్ స్టేషన్ లోకెషన్ గ్యూగుల్ మ్యాప్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. -
సొల్లుమోహనరంగా సంసారాల ‘చిల్లు’ ఫోన్
మాధవి, కిరణ్ భార్యాభర్తలు. పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. కిరణ్ ఓ ప్రైవేటు ట్రావెల్స్ నడిపేవాడు. అతనికి తరచూ ఫోన్లు వచ్చేవి. వీటన్నింటినీ మాధవే రిసీవ్ చేసుకునేది. కస్టమర్లతో ఆమె సరదాగా మాట్లాడుతుండేది. దీన్ని కిరణ్ భరించలేకపోయేవాడు. గంటల తరబడి ఫోన్లు మాట్లాడటమేంటని భార్యను నిలదీస్తుండేవాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తనను భర్త అవమానించి వేధిస్తున్నాడంటూ స్త్రీశిశు సంక్షేమ శాఖకు మాధవి ఫిర్యాదు చేసింది. గృహహింస నిరోధక చట్టం కింద కేసు నమోదయ్యింది. చివరకు వారు విడిపోయారు. నందిని, రమేష్ దంపతులు. రమేష్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఉదయం 10 గంటలకు ఆయన ఉద్యోగానికి వెళ్లాక నందిని తన తల్లిదండ్రులు, స్నేహితులతో ఫోన్లో మాట్లాడేది. రమేష్ ఫోన్ చేస్తే నందిని సెల్ బిజీగా ఉండేది. ఇది రమేష్‌లో అనుమాన బీజాలు నాటింది. గంటలకొద్దీ ఎవరితో మాట్లాడుతున్నావంటూ రమేష్ ఆమెను నిలదీసేవాడు. తన తల్లిదండ్రులు, స్నేహితులతో అని చెప్పినా రమేష్ నమ్మేవాడు కాదు. చివరకు వారి కాపురం కూలిపోయింది. విడాకులు తీసుకున్నారు. సాక్షి, విజయవాడ : సమాచార విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చితే.. మనుషులు, మనసుల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టిస్తోందనడానికి ఈ రెండు ఘటనల్ని ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉంటే ఎన్నో సౌకర్యాలు మనిషి ముంగిట్లో వాలినట్లే. వాట్స్ అప్, వైబర్ వంటి అప్లికేషన్ల ద్వారా ఉచిత మెసేజ్, ఫొటోలు పంపుకునే వీలు కలిగింది. స్కైప్, ట్యాంగో వంటి అప్స్ ద్వారా పరస్పరం చూసుకుంటూ మాట్లాడే వెసులుబాటు వచ్చింది. స్మార్ట్‌ఫోన్ వాడే వారిని వేలాది అప్లికేషన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నాయి. మనిషిలో రెండు పార్శ్వాన్ని కూడా ఇవి బయటకుతీసుకొస్తున్నాయి. ఫలితంగా అనుమానం పెనుభూతమై కాపురాలను కూల్చేస్తోంది. ఇక్కడ కూడా మహిళలే బాధితులవుతున్నారు. ఎట్నుంచి ఎటొచ్చినా ఫోన్ల ద్వారా అనేకమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు. జూదం, తాగుడు వంటి వ్యసనాలకు బానిసైన భర్త, వరకట్న సమస్య, ఆస్తి తగాదాలు, అనుమానాలకు తోడు ఈ సెల్చిచ్చు ఆడవారి జీవితాలతో చెలగాటమాడుతోంది. చదువు, చైతన్యం అందిపుచ్చుకుంటున్న మహిళలు ఈ బాధలను భరించలేక ఇప్పుడు గృహహింస నిరోధక చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో 60 శాతం వరకూ సెల్‌ఫోనే కీలక సమస్యగా ఉంటోందని కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లికి ముందుకు ఫ్రెండ్స్‌తో గడిపిన అమ్మాయిలు... ఆ తర్వాత కూడా వారితో ఫోన్లో మాట్లాడటాన్ని భర్తలు భరించలేకపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పును అర్థం చేసుకోలేకపోవడం, పురుషుడి ఆలోచన పాత చట్రం నుంచి బయటపడకపోవడంతో భార్యల సామాజిక ప్రవర్తనను సానుకూల దృక్పథంతో చూడలేకపోతున్నారు. తమ పురుషాహంకారాన్ని ప్రదర్శిస్తూ అర్ధాంగిని వేధింపులకు గురిచేస్తున్నారని స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే కౌన్సెలింగ్ సెంటర్ల నిర్వాహకులు, సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. గృహహింస చట్టం కింద ఫిర్యాదుచేస్తున్నవారిలో కేవలం భార్యాభర్తలే కాదు, తండ్రిపై కూతురు, కొడుకుపై తల్లి, అన్నపై చెల్లి ఉంటున్నారు. 3,400 గృహ హింస కేసులు... స్త్రీశిశు సంక్షేమశాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి (పీవో) ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలవుతోంది. పీవోకు రక్షణాధికారిగా బాధ్యతలు ఇచ్చారు. పీవో కింద ఒక సామాజిక, న్యాయపరమైన కౌన్సెలర్లు ఉంటారు. వారే గృహహింస కేసుల పర్యవేక్షణ, కౌన్సెలింగ్ బాధ్యతలు చూస్తుంటారు. ఈ చట్టం అమలులోకి వచ్చాక 3,405 మంది ఫిర్యాదు చేశారు. వాటిల్లో 781 కేసుల్లో రాజీచేశారు. 1230 కేసులను కోర్టులో ఫైల్ చేశారు. వాటిల్లో 341 కేసులు కోర్టుల్లో పరిష్కారం కాగా... 16 కేసుల్లో మధ్యంతర ఆదేశాలు జారీ అయ్యాయి. 32 కేసులు కౌన్సెలింగ్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 90 శాతం వరకట్నం, 60 శాతం అనుమానం, 60 శాతం తాగుడు కారణంగా మహిళలు బాధితులుగా ఉన్నారు. అనుమానపు కేసుల్లో ప్రధాన సూత్రధారి సెల్‌ఫోన్ కావడం విశేషం. బాధితుల్లో మధ్య, దిగువ తరగతి కుటుంబాలే. కొత్తగా పెళ్లయిన జంటల్లో తలెత్తిన మనస్పర్థలు వారు విడిపోయేవరకు వెళ్లడానికి తల్లిదండ్రులు ప్రధాన కారణంగా మారుతున్నారని కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చ చెప్పే ధోరణి ప్రదర్శించకుండా రెండువైపులా తల్లిదండ్రులు మరింత ఆజ్యం పోస్తున్నారని, తమ వద్దకు వస్తున్న కేసుల్లో అవి అనేకం ఉంటున్నాయని విజయవాడలోని స్త్రీశిశు సంక్షేమశాఖ కౌన్సెలింగ్ సెంటర్ సామాజిక కౌన్సెలర్ సుధ పేర్కొన్నారు.