సొల్లుమోహనరంగా సంసారాల ‘చిల్లు’ ఫోన్
మాధవి, కిరణ్ భార్యాభర్తలు. పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. కిరణ్ ఓ ప్రైవేటు ట్రావెల్స్ నడిపేవాడు. అతనికి తరచూ ఫోన్లు వచ్చేవి. వీటన్నింటినీ మాధవే రిసీవ్ చేసుకునేది. కస్టమర్లతో ఆమె సరదాగా మాట్లాడుతుండేది. దీన్ని కిరణ్ భరించలేకపోయేవాడు. గంటల తరబడి ఫోన్లు మాట్లాడటమేంటని భార్యను నిలదీస్తుండేవాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తనను భర్త అవమానించి వేధిస్తున్నాడంటూ స్త్రీశిశు సంక్షేమ శాఖకు మాధవి ఫిర్యాదు చేసింది. గృహహింస నిరోధక చట్టం కింద కేసు నమోదయ్యింది. చివరకు వారు విడిపోయారు.
నందిని, రమేష్ దంపతులు. రమేష్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఉదయం 10 గంటలకు ఆయన ఉద్యోగానికి వెళ్లాక నందిని తన తల్లిదండ్రులు, స్నేహితులతో ఫోన్లో మాట్లాడేది. రమేష్ ఫోన్ చేస్తే నందిని సెల్ బిజీగా ఉండేది. ఇది రమేష్‌లో అనుమాన బీజాలు నాటింది. గంటలకొద్దీ ఎవరితో మాట్లాడుతున్నావంటూ రమేష్ ఆమెను నిలదీసేవాడు. తన తల్లిదండ్రులు, స్నేహితులతో అని చెప్పినా రమేష్ నమ్మేవాడు కాదు. చివరకు వారి కాపురం కూలిపోయింది. విడాకులు తీసుకున్నారు.
సాక్షి, విజయవాడ : సమాచార విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చితే.. మనుషులు, మనసుల మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టిస్తోందనడానికి ఈ రెండు ఘటనల్ని ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో ఉంటే ఎన్నో సౌకర్యాలు మనిషి ముంగిట్లో వాలినట్లే. వాట్స్ అప్, వైబర్ వంటి అప్లికేషన్ల ద్వారా ఉచిత మెసేజ్, ఫొటోలు పంపుకునే వీలు కలిగింది. స్కైప్, ట్యాంగో వంటి అప్స్ ద్వారా పరస్పరం చూసుకుంటూ మాట్లాడే వెసులుబాటు వచ్చింది. స్మార్ట్‌ఫోన్ వాడే వారిని వేలాది అప్లికేషన్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నాయి.
మనిషిలో రెండు పార్శ్వాన్ని కూడా ఇవి బయటకుతీసుకొస్తున్నాయి. ఫలితంగా అనుమానం పెనుభూతమై కాపురాలను కూల్చేస్తోంది. ఇక్కడ కూడా మహిళలే బాధితులవుతున్నారు. ఎట్నుంచి ఎటొచ్చినా ఫోన్ల ద్వారా అనేకమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు. జూదం, తాగుడు వంటి వ్యసనాలకు బానిసైన భర్త, వరకట్న సమస్య, ఆస్తి తగాదాలు, అనుమానాలకు తోడు ఈ సెల్‌చిచ్చు ఆడవారి జీవితాలతో చెలగాటమాడుతోంది. చదువు, చైతన్యం అందిపుచ్చుకుంటున్న మహిళలు ఈ బాధలను భరించలేక ఇప్పుడు గృహహింస నిరోధక చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో 60 శాతం వరకూ సెల్‌ఫోనే కీలక సమస్యగా ఉంటోందని కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లికి ముందుకు ఫ్రెండ్స్‌తో గడిపిన అమ్మాయిలు... ఆ తర్వాత కూడా వారితో ఫోన్లో మాట్లాడటాన్ని భర్తలు భరించలేకపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పును అర్థం చేసుకోలేకపోవడం, పురుషుడి ఆలోచన పాత చట్రం నుంచి బయటపడకపోవడంతో భార్యల సామాజిక ప్రవర్తనను సానుకూల దృక్పథంతో చూడలేకపోతున్నారు. తమ పురుషాహంకారాన్ని ప్రదర్శిస్తూ అర్ధాంగిని వేధింపులకు గురిచేస్తున్నారని స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే కౌన్సెలింగ్ సెంటర్ల నిర్వాహకులు, సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. గృహహింస చట్టం కింద ఫిర్యాదుచేస్తున్నవారిలో కేవలం భార్యాభర్తలే కాదు, తండ్రిపై కూతురు, కొడుకుపై తల్లి, అన్నపై చెల్లి ఉంటున్నారు.
3,400 గృహ హింస కేసులు...
స్త్రీశిశు సంక్షేమశాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి (పీవో) ఆధ్వర్యంలో గృహహింస నిరోధక చట్టం అమలవుతోంది. పీవోకు రక్షణాధికారిగా బాధ్యతలు ఇచ్చారు. పీవో కింద ఒక సామాజిక, న్యాయపరమైన కౌన్సెలర్లు ఉంటారు. వారే గృహహింస కేసుల పర్యవేక్షణ, కౌన్సెలింగ్ బాధ్యతలు చూస్తుంటారు. ఈ చట్టం అమలులోకి వచ్చాక 3,405 మంది ఫిర్యాదు చేశారు.
వాటిల్లో 781 కేసుల్లో రాజీచేశారు. 1230 కేసులను కోర్టులో ఫైల్ చేశారు. వాటిల్లో 341 కేసులు కోర్టుల్లో పరిష్కారం కాగా... 16 కేసుల్లో మధ్యంతర ఆదేశాలు జారీ అయ్యాయి. 32 కేసులు కౌన్సెలింగ్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 90 శాతం వరకట్నం, 60 శాతం అనుమానం, 60 శాతం తాగుడు కారణంగా మహిళలు బాధితులుగా ఉన్నారు. అనుమానపు కేసుల్లో ప్రధాన సూత్రధారి సెల్‌ఫోన్ కావడం విశేషం.
బాధితుల్లో మధ్య, దిగువ తరగతి కుటుంబాలే. కొత్తగా పెళ్లయిన జంటల్లో తలెత్తిన మనస్పర్థలు వారు విడిపోయేవరకు వెళ్లడానికి తల్లిదండ్రులు ప్రధాన కారణంగా మారుతున్నారని కౌన్సెలింగ్ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చ చెప్పే ధోరణి ప్రదర్శించకుండా రెండువైపులా తల్లిదండ్రులు మరింత ఆజ్యం పోస్తున్నారని, తమ వద్దకు వస్తున్న కేసుల్లో అవి అనేకం ఉంటున్నాయని విజయవాడలోని స్త్రీశిశు సంక్షేమశాఖ కౌన్సెలింగ్ సెంటర్ సామాజిక కౌన్సెలర్ సుధ పేర్కొన్నారు.