అధినేతలకు అర్జీలు... ఒక్క క్లిక్‌తో..
కనీసం గ్రామ కార్యదర్శికి సమస్య విన్నవించాలంటేనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్న రోజులివి. వినతి పత్రం ఇవ్వడానికి పనులు మానుకొని, అనేక వ్యయప్రయాసలకోర్చి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి, అక్కడ అమాత్యులు, అధికారులు కనిపించకపోతే పడిగాపులు కాయాల్సిన దుస్థితి.
ఇటువంటి కష్టాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పడనుంది. ముఖ్య నేతలకు ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి వారధిగా నిలుస్తోంది ఆన్‌లైన్. కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉండి.. ఒక కంప్యూటర్, ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు ఒక్క క్లిక్‌తో తమ సమస్యపై విన్నపం పంపుకోవచ్చు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
గవర్నర్‌కు ఇలా పంపాలి...
aprajbhavan@gmail.com మెయిల్‌కు ఫిర్యాదుదారుడు తమ పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా నేరుగా పంపవచ్చు.
⇒ఇంటర్నెట్ ఉంటే చాలు..
⇒ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు
⇒సీఎం, గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతికీ చిటికెలో విన్నపం
రాష్ట్రపతికి పంపాలంటే...
రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే www.presidentofindia.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే అడుగుభాగంలో కుడిపైపు హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్ ఏ రిక్వెస్ట్’మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అనే బాక్సులో 4000 పదాలకు మించకుండా సమస్య వివరించి పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన సమస్య పరిష్కారం అయిందో కాలేదో తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంఖ్య ఉపయోగపడుతుంది.
ప్రధానికి ఫిర్యాదు చేయాలంటే..
దేశ ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.pmindia. gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి సమస్యలను విన్నవించవచ్చు. పేజీ ఓపెన్ చేయగానే ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పీఎం’ వస్తుంది. క్లిక్ చేస్తే ‘టు రైట్ టు ది ప్రైమినిస్టర్ క్లిక్ హియర్’ అనివస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చిరునామాతోపాటు ఈ మెయిల్ ఐడీ లింక్ ఉంటుంది. ‘క్లిక్ హియర్’అన్న చోట క్లిక్ చేస్తే ‘కామెంట్స్’ అనే పేజీ తెరుచుకుంటుంది. ఫిర్యాదు దారుడి వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్‌ను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీలో 1000 అక్షరాలలోపు సమస్యను వివరించి దిగువ భాగాన ఉన్న కోడ్‌ను నమోదు చేయాలి.
ముఖ్యమంత్రికి సమస్య విన్నవించాలంటే ..
ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగంలో సిటిజన్ ఇంటర్ ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీని నమోదుచేసి సంబంధిత విషయాన్ని క్లుప్తంగా వివరించాలి.