మోదీ ప్రమాణోత్సవం సందర్భంగా కళకళలాడిన రాష్ట్రపతి భవన్
రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ తారల సందడి
వేడుకలో పాల్గొన్న 8,000 మందికి పైగా వీఐపీలు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. దేశాధినేతల నుంచి రాజకీయ దిగ్గజాల దాకా వేడుకలో పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రముఖులు మొదలుకుని సినీ తారల దాకా తళుక్కుమన్నారు. 8,000 మందికిపైగా వీవీఐపీలు, వీఐపీలతో రాష్ట్రపతి భవన్ ఆవరణ కళకళలాడింది.
వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తుండగా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు, హర్షధ్వానాలతో మారుమోగింది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్ కోవింద్ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్ ఖాన్ నుంచి రజనీకాంత్ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. భిన్న మతాలకు చెందిన పెద్దలు పాల్గొనడం అందరినీ ఆకర్షించింది.
బీజేపీ నుంచి తొలిసారి ఎంపీగా నెగ్గిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానాకర్షణగా నిలిచారు. కేరళలోని త్రిసూర్ ఎంపీ, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి ఇదే తొలి విజయమన్నది తెలిసిందే. మోదీకి పలు రంగాల ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షల సందేశాలతో ఎక్స్ తదితర సోషల్ సైట్లు హోరెత్తిపోయాయి.
ఏడుగురు దేశాధినేతలు: మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కు మార్ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్ర ధానమంత్రి త్సెరింగ్ టాగ్‌బే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్ తదితరులు కార్యక్ర మంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మ« ద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్ రావడం ఇదే తొలిసారి.
తెలుపు కుర్తా–చుడీదార్, నీలి రంగు జాకెట్‌లో... మెరిసిపోయిన మోదీ
విశేష సందర్భాల్లో తన వస్త్రధారణతో ఆకట్టుకునే మోదీ ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుపు కుర్తా, చుడీదార్, దానిపై నీలి రంగు జాకెట్ ఎంచుకున్నారు. 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ చేసిన సందర్భంగా ఆయన క్రీం కలర్ కుర్తా, తెల్ల పైజామా, బంగారు రంగు జాకెట్ ధరించారు. 2019లో రెండోసారి ప్రధాని అయినప్పుడు తెలుపు రంగు కుర్తా, పైజామా, వాటిపై బంగారు రంగు జాకెట్ ధరించి ప్రమాణస్వీకారం చేశారు. పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు మోదీ రంగురంగుల తలపాగాలు ధరించి అలరిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment