‘రిలయన్స్’ మూగబోయింది
అద్దంకి: రిలయన్స్.. ఈ పేరు వినగానే బ్రాండ్ ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఆ సంస్థకు చెందిన ఎలాంటి ఉత్పత్తులైనా నాణ్యంగా ఉంటాయని అందరి నమ్మకం. అయితే దీనికి రివర్స్‌గేర్ పడినట్లయింది. 15 రోజులుగా రిలయన్స్ మొబైల్, నెట్ కనెక్షన్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లు నిలిచిపోవడమే దీనికి కారణం. గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ప్రతినిధులు అద్దంకిలో విస్తృత ప్రచారం చేపట్టారు. రిలియన్స్ సిమ్ కార్డులు, నెట్ మోడెమ్‌లను ఏజెంట్ల సాయంతో.. కొన్ని చోట్ల సంస్థ తరఫునే నేరుగా విక్రయించారు.
సంస్థకు మంచిపేరు ఉండటంతో అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రీపెయిడ్ కార్డులు, మోడెమ్‌లు వేలాదిగా అమ్ముడుపోయాయి. కొంతమంది అయితే నెల, మూడు నెలలు, ఏడాది ప్యాకేజీలున్న మోడెమ్‌లకు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి తీసుకున్నారు. ఇలా నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో రిలయన్స్ నెట్‌వర్క్ విస్తరించింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఏడాది నుంచి సిగ్నల్ వ్యవస్థలో లోపాలు తలెత్తడం ప్రారంభమైంది. నెల రోజులు నెట్‌వర్క్ బాగుంటే.. ఆ తర్వాత నాలుగైదు రోజులు సమస్యరావడం, మళ్లీ సర్దుకోవడం జరుగుతోంది.
అప్పటి నుంచే వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సమాచారం ఫోన్‌లో చేరవేయాలన్నా.. నెట్ ఉపయోగించాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం మామూలైంది. సమస్య ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరు పరిష్కరిస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడైతే ఏకంగా 15 రోజుల నుంచి సిగ్నల్స్ లేక ఫోన్‌లు, మోడెమ్‌లు మూగబోయాయి. ఈ దెబ్బకు ఇతర నెట్‌వర్క్ సేవలు వినియోగించుకొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
టవర్స్ తొలగిస్తున్నారా?
పక్షం రోజులుగా రిలయన్స్‌తో విసిగిపోయిన ప్రజలు.. ఆ సంస్థకు చెందిన సిగ్నల్ టవర్లను ఎత్తివేస్తున్నారంటూ చర్చించుకుంటున్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఎవరికివారు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్యాకేజీలు తీసుకున్నవారు లబోదిబోమంటున్నారు. దీనిపై రిలయన్స్ సంస్థ ఒంగోలు బాధ్యుడు రమణను ఫోన్‌లో సంప్రదించగా.. టవర్స్ బాగానే పని చేస్తున్నాయన్నారు. ఆ తర్వాత తేరుకొని.. అద్దంకిలోనే కాకుండా, మొత్తంమీద 74 టవర్లు పని చేయడంలేదని తెలిపారు. అందుకే సిగ్నల్స్ సరిగా రావడంలేదని రెండు రోజల్లో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.