మా చానల్స్ చూడండి.. నెలకు మూడు వేలిస్తాం !
కోదాడ టౌన్: ‘మేమే కంప్యూటర్ ఇస్తాం.. ఇం టర్నెట్ కనెక్షన్ ఉంటే బిల్లు కూడా ఇస్తాం. అంతే కాదు.. నెలకు రూ.3,000 మీ అకౌంట్‌లో వేస్తాం. మేము ఇచ్చిన కంప్యూటర్‌ను రోజుకు ఎనిమిది గంటలు ఆన్‌చేసి ఉంచాలి. ఇందుకోసం ఇప్పుడు 10 వేలు చెల్లించాలి.’ ఇదీ కోదాడలో నెల రోజు లుగా ఒక సంస్థ చేస్తున్న ప్రచారం. దీంతో వేలం వెర్రిగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉద్యోగులు ఎగబడుతున్నారు. కానీ, ఇందులో ఏదో తిరకాసు దాగుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమ వెబ్‌సైట్ కోసం ప్రచారం అని చెబుతుండడం గమనార్హం.
కోదాడ, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్షిత క్రియేషన్స్ పేరుతో వెబ్‌చానల్స్ నడుపుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. విద్యార్థులు, వ్యాపారులను మచ్చిక చేసుకుని రూ.10 వేలకు పాత కంప్యూటర్ అంటగడుతున్నారు. ప్రతినెలా నెట్ బిల్లు రూ.500 ఇస్తామని.. రోజు ఎనిమిది గంటలు కంప్యూటర్‌ను ఆన్ చేసి ఉంచితే ప్రతి నెలా రూ.3,000 అకౌంట్‌లో వేస్తామని ప్రచారం చేయడంతో ఒక్క కోదాడలోనే నెల రోజుల్లో 200 మంది రూ.10 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి పాత కంప్యూటర్లను తీసుకున్నారు. వాస్తవానికి ఒక్కో కంప్యూటర్ ఖరీదు రూ. 5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ఉంటుందని పాత కంప్యూటర్లను రెట్టింపు రేట్లతో అంటగడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.