Software Freedom Law Center (SFLC) 665 Internet Services Shutdowns In India Since 2012 - Sakshi
Sakshi News home page

Digital Emergency: కనెక్షన్‌ కట్‌.. 2012 నుంచి 665 సార్లు.. టాప్‌ ప్లేస్‌లో భారత్‌! 

Published Wed, Jul 6 2022 1:27 AM | Last Updated on Wed, Jul 6 2022 11:45 AM

Software Freedom Law Center Studies 665 Internet service Shutdown Since 2012 - Sakshi

డిజిటల్‌ ఎమర్జెన్సీ. ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేయడం. ఈ ధోరణి భారత్‌లో రానురాను బాగాపెరిగిపోతోంది. ఎక్కడ ఏ చిన్న ఆందోళన జరిగినా, ఉద్రిక్తత తలెత్తినా ప్రభుత్వాలు తీసుకునే తొలి చర్య నెట్‌ కనెక్షన్‌ కట్‌ చేయడమే. ఇది వివాదానికి కూడా దారి తీస్తోంది. ఇంటర్నెట్‌ షట్‌డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే టాప్‌ ప్లేస్‌లో ఉంది! 

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్గి రాజుకున్నా, ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా రాజస్థాన్‌లో జరిగిన హత్యపై ఉద్రిక్తతలు తలెత్తినా, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా... ప్రభుత్వం విధిగా తీసుకున్న తొలి చర్య ఇంటర్నెట్‌ షట్‌డౌనే. ఇంటర్నెట్‌ లేకుండా అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యలేని కాలమిది. ఏ ఉద్యమమైనా సోషల్‌ మీడియా వేదికలను వినియోగించుకునే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ సాంకేతిక బాసట లేకుండా చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే ఇంటర్నెట్‌ సర్వీసుల్ని నిలిపేస్తున్నాయి.

శాంతిభద్రతల కారణంతో ఒకప్పుడు కశ్మీర్‌కే పరిమితమైన ఈ ధోరణి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్నిచోట్లకూ విస్తరించడం వివాదాస్పదమవుతోంది. కరోనా అనంతరం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఆన్‌లైన్‌ క్లాసులు, డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్‌ లేకుండా పూట గడవని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్‌ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంతోమంది జీవనోపాధిపైనా దెబ్బ పడుతోంది. 

6 నెలల్లో 59 సార్లు... 
భారత్‌లో ఇంటర్నెట్‌ షట్‌డౌన్స్‌పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడమ్‌ లా సెంటర్‌ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా 665సార్లు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. గళమెత్తే గొంతుకల్ని అణిచివేయడానికి నెట్‌ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్‌ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్‌ కనెక్షన్‌ కట్‌ అయింది! జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్‌ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్‌ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్‌ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్‌ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. 


పౌర హక్కులకు భంగమేనా? 
ఇలా చీటికీమాటికీ ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్‌ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందన్నది దాని వాదన. 

ప్రభుత్వాలేమంటున్నాయి... 
సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో తప్పుడు సమాచారం, వదంతులు వాటి ద్వారా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయన్నది ప్రభుత్వాల వాదన. ఉద్రిక్త పరిస్థితులకు ఇవి ఆజ్యం పోస్తాయి కాబట్టే నెట్‌ కట్‌ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్‌ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్‌ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్‌ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్‌ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్‌ వంటి సోషల్‌ ప్లాట్‌ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.  

ఆర్థికంగానూ ప్రభావమే... 
ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్‌ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఇంటర్నెట్‌ లేక తాను పత్రికను ప్రింట్‌ చేసుకోలేకపోతున్నానని, మరెందరో జీవనోపాధి కోల్పోతున్నారని కశ్మీర్‌కు చెందిన అనూరాధా భాసిన్‌ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టుకెక్కారు. నిరవధికంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని ఆమె పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది కూడా. అంతేకాదు, ‘వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారాలను నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగంలోని 19(1)(ఎ), ఆర్టికల్‌ 19(1)(జి) ఆర్టికళ్లలో పేర్కొన్న మేరకు పరిరక్షించాల్సిందే’ అని ఆదేశించింది. అయినప్పటికీ తాత్కాలికం అన్న పేరు చెబుతూ ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నాయి. అలా పొడిగించుకుంటూ వెళుతున్నాయి.                
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement