ఆశకుపోయిన వృద్ధుడు.. నిలువునా మోసం
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ వృద్ధుడు నిలువునా మోసపోయాడు. అతి తక్కువ రేటుకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తానని చెప్పి ఓ వ్యక్తి అతడిని మోసపుచ్చాడు. ఆయన నుంచి ఓ బ్లాంక్ చెక్కు తీసుకొని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా రూ.60 వేలు కాజేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామచంద్ర ప్రజాపతి (74) అనే పెద్దాయన వద్దకు ఓ వ్యక్తి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పిస్తానంటూ వచ్చాడు.
ప్రస్తుతం అక్కడ నెలకు రూ.2,500 కనెక్షన్ ఇస్తుండగా తాము మాత్రం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్ ద్వారా రూ.74కు అందిస్తున్నామంటూ నచ్చజెప్పాడు. అది కూడా చెక్ ద్వారా అందిస్తున్నామన్నారు. అతడిని చూసి మంచివాడే అని నమ్మిన ప్రజాపతి రూ.74కు చెక్ రాసిచ్చాడు. అదే సమయంలో మరో ఖాళీ చెక్కును సేల్స్ మెన్ గా వచ్చిన వ్యక్తి తీసుకున్నాడు. ఇది నవంబర్ 4న జరిగింది. ఇటీవల తన పాస్ బుక్ అప్ డేట్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు తన ఖాతాలో నుంచి రూ.60,000 చెక్ ద్వారా డ్రా అయినట్లు తెలిసి అవాక్కయ్యాడు. అనంతరం సేల్స్‌మెన్‌కు ఖాళీ చెక్కు ఇచ్చిన విషయం గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.