సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విలీనమైన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల చెల్లింపు, ఇతర సర్దుబాటు చర్యల కోసం ప్రభుత్వం ఆయా కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం జీవో 17 విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలో తమ సిబ్బందిని విలీనం చేసేందుకు 125 ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. వీరిలో 895 మంది బోధన సిబ్బంది, 1,120 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.
బోధన సిబ్బందిలో 864 మందిని వివిధ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న క్లియర్ వేకెన్సీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. మిగతా 31 మందిని కొత్తగా మంజూరుచేసిన కాలేజీల్లోకి పంపారు. అయితే అక్కడ ఇంకా మంజూరు కాని పోస్టుల్లో వారిని నియమించారు. అలాగే ప్రభుత్వంలో విలీనమైన 23 మంది ప్రిన్సిపాళ్లకు ఖాళీలు లేనందున ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. బోధనేతర సిబ్బందిలో 921 మందిని క్లియర్ వేకెన్సీల్లో సర్దుబాటు చేశారు. బోధనేతర సిబ్బందిలో మిగిలిన 199 మందితోపాటు 23 మంది ప్రిన్సిపాళ్లు, 31 మంది టీచింగ్ స్టాఫ్ కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు అవసరమని కాలేజీ విద్యా కమిషనర్ ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం ఆమేరకు పోస్టులు మంజూరు చేసింది.
డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులు
Published Thu, Apr 21 2022 3:01 AM | Last Updated on Thu, Apr 21 2022 3:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment