తగ్గిన చేరికలు..వెలవెలబోతున్న డిగ్రీ విభాగాలు | Number of enrollments in degree colleges are declining | Sakshi
Sakshi News home page

తగ్గిన చేరికలు..వెలవెలబోతున్న డిగ్రీ విభాగాలు

Published Mon, Mar 22 2021 3:43 AM | Last Updated on Mon, Mar 22 2021 3:45 AM

Number of enrollments in degree colleges are declining - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాల్సిన కాలేజీల యాజమాన్యాల నిర్లిప్తతతో చేరికల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బోధనా సిబ్బంది, సదుపాయాల కల్పన విషయంలో యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీని పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే ‘ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌ (ఓఏఎండీసీ) ద్వారా పారదర్శకంగా నిర్వహించింది. విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో నచ్చిన సీటు పొందేలా అవకాశం కల్పించింది. ఈ అడ్మిషన్ల ప్రక్రియను మూడు విడతల్లో ఉన్నత విద్యామండలి నిర్వహించింది. 152 ప్రభుత్వ కాలేజీలు, 120 ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కాలేజీలు, 1,062 ప్రైవేట్‌ కాలేజీల్లో డిగ్రీ సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేశారు. ఈ కాలేజీల్లో 4,96,055 సీట్లు ఉండగా 2,61,383 సీట్లను ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు కేటాయించారు. పలు కాలేజీల్లో సీట్లు సగానికి పైగా ఖాళీగా మిగిలాయి. సరైన ప్రమాణాలను పాటించకపోవడం, సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు విముఖత చూపారు. 

పలు కోర్సుల్లో సీట్లు ఖాళీ... 
మూడు విడతల కౌన్సెలింగ్‌ అనంతరం చేరికలను పరిశీలిస్తే పలు కాలేజీల్లో కొన్ని కోర్సుల్లో ఒకరిద్దరు మాత్రమే చేరగా మరికొన్ని చోట్ల 10 నుంచి 20 మంది లోపే ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని 48 విభాగాల్లో, ఎయిడెడ్‌ కాలేజీల్లోని 194 విభాగాల్లో, ప్రయివేటు కాలేజీల్లోని 1,309 విభాగాల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీల్లో కోర్సుల కొనసాగింపు సమస్యగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తక్కువ చేరికలున్న కోర్సుల విద్యార్థులను ఇతర కాలేజీలలోని అదే కోర్సులకు లేదా అక్కడే ఇతర కోర్సులలోకి మార్పు చేసే ప్రక్రియ చేపట్టారు. దాదాపు 1,600 మంది విద్యార్థులను ఇలా తరలిస్తున్నారు. ప్రైవేట్‌ కాలేజీల్లో మాత్రం తక్కువ చేరికలున్న కోర్సుల నుంచి మార్పులు చేసుకొనేందుకు ఇదివరకే అడ్మిషన్ల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అవకాశం కల్పించింది.

చేరికలు తక్కువగా ఉన్న కాలేజీలపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కన్నా ముందుగానే నోటీసులు జారీచేసింది. 72 కాలేజీలు గత కొన్నేళ్లుగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ లేకుండానే కొనసాగుతున్నాయి. 25 శాతం కన్నా తక్కువ చేరికలున్న 174 కాలేజీలు, ఒక్కరు కూడా లేకుండా కేవలం కాగితాలపై నడుస్తున్న కాలేజీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. లోపాలను సవరించుకోకుండా కొనసాగుతున్న కాలేజీలపై 2020–21 ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు ముందుగానే ఉన్నత విద్యామండలి కొరడా ఝళిపించింది. 48 కాలేజీలు స్పందించకపోవడంతో అనుమతులను రద్దుచేసింది. మరో 61 కాలేజీల్లో కోర్సులను ఉపసంహరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement