కాలేజీలపై కక్ష సాధింపునకు సర్కారు రెడీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతపై విశాఖపట్నంలో ఈనెల 22వ తేదీన జరిగిన యువభేరి ప్రభుత్వంలో మంటలు రేపుతోంది. యువభేరికి హాజరైన విద్యాసంస్థలపై ప్రభుత్వం ఆరాతీస్తోంది. విద్యాసంస్థలపై కక్ష సాధింపు చర్యలు తీసుకోడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 22న జరిగిన వైఎస్ఆర్సీపీ యువభేరిలో పలువురు మేధావులు కూడా పాల్గొన్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుందని వైఎస్ఆర్సీపీ ముందుగానే ప్రకటించింది. ఆంక్షలు విధించినా కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని ముఖాముఖిలో తమ అభిప్రాయాలను నేరుగా వెల్లడించారు.
వాళ్లు వేసుకున్న యూనిఫారాలను బట్టి వాళ్లు ఏయే కాలేజీల నుంచి వచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు విద్యాసంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచే ప్రభుత్వం ఈ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మేధావులు కూడా ఈ విషయాన్ని తప్పుబడుతున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్లను నేరుగా సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. యూజీసీకి సిఫార్సు మాత్రమే చేయగలరు. అయినా ఈ తరహా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ప్రొఫెసర్లకు మాత్రం ఇలాంటి ఆదేశాలు ఇంతవరకు అందలేదని తెలుస్తోంది.