బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి | National Commission for Protection of Child Rights Draft Guidelines | Sakshi
Sakshi News home page

బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి

Published Sat, Jan 7 2023 3:01 PM | Last Updated on Sat, Jan 7 2023 3:01 PM

National Commission for Protection of Child Rights Draft Guidelines - Sakshi

18 ఏళ్ల వయస్సు నిండని నేరం ఆరోపింపబడ్డ ప్రతి బాలుడు, బాలిక 2015 నాటి ‘బాల నేరస్థుల పరిరక్షణ చట్టం’ ప్రకారం జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు (జేజే బోర్డు) ముందు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. నేరం చేసిన తేదీ నాటి వయస్సు ప్రామాణికం అవుతుంది. అధికారిక జనన ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేనట్లయితే మెడికల్‌ బోర్డుచే ధ్రువీకరీంపబడ్డ వయస్సు ఆధారంగా కోర్టు విచారణ పరిధి నిర్ణయమవుతుంది. అరెస్టు చేసిన రోజు నుండి తుది తీర్పు దాకా జేజే బోర్డు విచారిస్తుంది. ఈ  బోర్డులో మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ న్యాయాధికారి, రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడే ఇరువురు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఇరువురిలో ఒకరు మహిళ, మరొకరు చైల్డ్‌ సైకాలజిస్ట్‌ ఉంటారు.

బెయిలుపై విడుదలయ్యేంత వరకు లేదా తుది తీర్పు దాకా నిందితులను ప్రభుత్వ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలోని అబ్జర్వేషన్‌ హోమ్‌లో ఉంచుతారు. నేరం రుజువయితే నిందితులకు కారాగార శిక్ష బదులుగా జేజే బోర్డు సభ్యులు మందలించి విడుదల చేయటం లేదా మూడు సంవత్సరాలు మించకుండా సంస్కరణ గృహానికి పంపించటం లేదా విడుదల చేసి కొన్నాళ్ల పాటు మంచి ప్రవర్తనకై జిల్లా ప్రొబేషనరీ అధికారి పర్యవేక్షణలో ఉంచటం లేదా  సామాజిక సేవ చేసే ఉత్తర్వులు లేదా జరిమానా చెల్లింపుకు ఆదేశాలివ్వటం జరుగుతుంది. ఇందుకై జిల్లా ప్రొబేషనరీ అధికారి ఇచ్చే సామాజిక దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురు సభ్యుల తీర్పులో ఏకాభిప్రాయం రానట్లయితే జ్యుడీషియల్‌ అధికారి తీర్పు చలామణి అవుతుంది. నేరం రుజువు కాలేదని జేజే బోర్డు తీర్పిస్తే దానిపై అప్పీలు లేదు. 16 ఏళ్లు పైబడిన నిందితుల కేసుల్లో లేదా అతి హేయమైన నేరం చేసిన కేసుల్లో మాత్రమే అప్పీలు ఉంటుంది.

విచారణ ప్రక్రియ మధ్యలో నిందితులు 18 ఏళ్ల వయస్సు దాటినా, జేజే బోర్డు మాత్రమే కేసు కొనసాగిస్తుంది. నేరం రుజువై ప్రభుత్వ సంస్కరణ గృహానికి  పంపబడిన వారిని మంచి పౌరులుగా పరివర్తన తేవటానికి వృత్తి విద్య, కౌన్సెలింగ్‌ లాంటివి చేపడతారు. హత్య, మానభంగం, లైంగిక అత్యాచారం లాంటి అతి హేయమైన నేరం గురించి 16–18 ఏళ్ల వయసున్న నిందితుడు మానసికంగా, భౌతికంగా తను చేస్తున్న నేరం పరిణామాల గురించి అర్థం చేసుకునే పరిపక్వత ఉండీ నేరం చేసినాడని జేజే బోర్డు ప్రాథమిక అంచనాకు వస్తే ఆ కేసును బాలల కోర్టుకు నిందితుడిని పెద్ద వాడిగా భావించి ఇతర కేసుల్లాగే విచారణ జరిపే నిమిత్తం బదిలీ చేసే విచక్షణాధికారం ఉంది.

ఇదిలా ఉండగా 16–18 ఏళ్ల వయసున్న నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై జేజే బోర్డు ఒక నిర్ణాయిక ప్రాథమిక అంచనాకు రావడానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ‘బరున్‌ చంద్ర ఠాకూర్‌ వర్సెస్‌ మాస్టర్‌ భోలు’ అనే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం 2022 జూలై 13న ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి, తగిన సలహాలు, సూచనలు 2023 జనవరి 20 లోగా ఇవ్వాల్సిందిగా బహిరంగంగా ప్రజలను, నిపుణులను కోరింది. 

ఒకసారి మార్గదర్శకాలకు తుది రూపు వస్తే, అన్ని జేజే బోర్డులు నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై ఏకరూప ప్రాథమిక అంచనా తీర్పు వెలువరించే అవకాశముంది. తద్వారా హత్య, లైంగిక దాడి లాంటి అతి హేయమైన కేసులకు పాల్పడిన16 ఏళ్లు నిండిన నిందితులను బాలల కోర్టులో విచారణ జరిపే అవకాశముంది. అయినా కూడా 18 సంవత్సరాల వయస్సులోపు వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించరాదని చట్టం చెప్తోంది. 

కొద్ది మాసాల క్రితం జూబ్లీహిల్స్‌ లోని అమ్నీసియా పబ్‌ వద్ద ఇన్నోవా వాహనంలో బాలికపై సామూహిక అత్యాచార ఆరోపణ కేసులో 16 ఏళ్లు నిండిన నలుగురు బాలురను మామూలు నిందితుల మాదిరే విచారణ జరపాలని జేజే బోర్డు పోక్సో కోర్టుకు పంపించటం మనందరికీ విదితమే. 

జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం మన దేశంలో బాలబాలికల మీద 2019లో 32,269 కేసులు,  2020లో 29,768 కేసులు, 2021లో 31,170 కేసులు నమోదైనాయి. దీన్ని బట్టి బాల బాలికల్లో హింసాత్మక, నేర ప్రవృత్తి స్థాయి మనకు అవగతమవుతుంది. దీనికి తల్లిదండ్రుల నిరాదరణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొన్ని కారణాలు. వీటిని పరిహరించడం ద్వారానే రేపటి పౌరులను నేర ప్రపంచంలోకి వెళ్లకుండా ఆపగలం. (క్లిక్ చేయండి: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. అదే పెద్ద సమస్య!


- తడకమళ్ళ మురళీధర్‌ 
విశ్రాంత జిల్లా జడ్జి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement