Child Rights Protection Commission
-
బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి
18 ఏళ్ల వయస్సు నిండని నేరం ఆరోపింపబడ్డ ప్రతి బాలుడు, బాలిక 2015 నాటి ‘బాల నేరస్థుల పరిరక్షణ చట్టం’ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజే బోర్డు) ముందు విచారణ ఎదుర్కోవలసి ఉంటుంది. నేరం చేసిన తేదీ నాటి వయస్సు ప్రామాణికం అవుతుంది. అధికారిక జనన ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేనట్లయితే మెడికల్ బోర్డుచే ధ్రువీకరీంపబడ్డ వయస్సు ఆధారంగా కోర్టు విచారణ పరిధి నిర్ణయమవుతుంది. అరెస్టు చేసిన రోజు నుండి తుది తీర్పు దాకా జేజే బోర్డు విచారిస్తుంది. ఈ బోర్డులో మొదటి శ్రేణి జ్యుడీషియల్ న్యాయాధికారి, రాష్ట్ర ప్రభుత్వం చేత నియమింపబడే ఇరువురు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. ఇరువురిలో ఒకరు మహిళ, మరొకరు చైల్డ్ సైకాలజిస్ట్ ఉంటారు. బెయిలుపై విడుదలయ్యేంత వరకు లేదా తుది తీర్పు దాకా నిందితులను ప్రభుత్వ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలోని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచుతారు. నేరం రుజువయితే నిందితులకు కారాగార శిక్ష బదులుగా జేజే బోర్డు సభ్యులు మందలించి విడుదల చేయటం లేదా మూడు సంవత్సరాలు మించకుండా సంస్కరణ గృహానికి పంపించటం లేదా విడుదల చేసి కొన్నాళ్ల పాటు మంచి ప్రవర్తనకై జిల్లా ప్రొబేషనరీ అధికారి పర్యవేక్షణలో ఉంచటం లేదా సామాజిక సేవ చేసే ఉత్తర్వులు లేదా జరిమానా చెల్లింపుకు ఆదేశాలివ్వటం జరుగుతుంది. ఇందుకై జిల్లా ప్రొబేషనరీ అధికారి ఇచ్చే సామాజిక దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురు సభ్యుల తీర్పులో ఏకాభిప్రాయం రానట్లయితే జ్యుడీషియల్ అధికారి తీర్పు చలామణి అవుతుంది. నేరం రుజువు కాలేదని జేజే బోర్డు తీర్పిస్తే దానిపై అప్పీలు లేదు. 16 ఏళ్లు పైబడిన నిందితుల కేసుల్లో లేదా అతి హేయమైన నేరం చేసిన కేసుల్లో మాత్రమే అప్పీలు ఉంటుంది. విచారణ ప్రక్రియ మధ్యలో నిందితులు 18 ఏళ్ల వయస్సు దాటినా, జేజే బోర్డు మాత్రమే కేసు కొనసాగిస్తుంది. నేరం రుజువై ప్రభుత్వ సంస్కరణ గృహానికి పంపబడిన వారిని మంచి పౌరులుగా పరివర్తన తేవటానికి వృత్తి విద్య, కౌన్సెలింగ్ లాంటివి చేపడతారు. హత్య, మానభంగం, లైంగిక అత్యాచారం లాంటి అతి హేయమైన నేరం గురించి 16–18 ఏళ్ల వయసున్న నిందితుడు మానసికంగా, భౌతికంగా తను చేస్తున్న నేరం పరిణామాల గురించి అర్థం చేసుకునే పరిపక్వత ఉండీ నేరం చేసినాడని జేజే బోర్డు ప్రాథమిక అంచనాకు వస్తే ఆ కేసును బాలల కోర్టుకు నిందితుడిని పెద్ద వాడిగా భావించి ఇతర కేసుల్లాగే విచారణ జరిపే నిమిత్తం బదిలీ చేసే విచక్షణాధికారం ఉంది. ఇదిలా ఉండగా 16–18 ఏళ్ల వయసున్న నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై జేజే బోర్డు ఒక నిర్ణాయిక ప్రాథమిక అంచనాకు రావడానికి మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా ‘బరున్ చంద్ర ఠాకూర్ వర్సెస్ మాస్టర్ భోలు’ అనే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం 2022 జూలై 13న ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి అనుగుణంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి, తగిన సలహాలు, సూచనలు 2023 జనవరి 20 లోగా ఇవ్వాల్సిందిగా బహిరంగంగా ప్రజలను, నిపుణులను కోరింది. ఒకసారి మార్గదర్శకాలకు తుది రూపు వస్తే, అన్ని జేజే బోర్డులు నిందితులు చేసిన అతి హేయమైన నేరంపై ఏకరూప ప్రాథమిక అంచనా తీర్పు వెలువరించే అవకాశముంది. తద్వారా హత్య, లైంగిక దాడి లాంటి అతి హేయమైన కేసులకు పాల్పడిన16 ఏళ్లు నిండిన నిందితులను బాలల కోర్టులో విచారణ జరిపే అవకాశముంది. అయినా కూడా 18 సంవత్సరాల వయస్సులోపు వారికి మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించరాదని చట్టం చెప్తోంది. కొద్ది మాసాల క్రితం జూబ్లీహిల్స్ లోని అమ్నీసియా పబ్ వద్ద ఇన్నోవా వాహనంలో బాలికపై సామూహిక అత్యాచార ఆరోపణ కేసులో 16 ఏళ్లు నిండిన నలుగురు బాలురను మామూలు నిందితుల మాదిరే విచారణ జరపాలని జేజే బోర్డు పోక్సో కోర్టుకు పంపించటం మనందరికీ విదితమే. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ 2021 వార్షిక నివేదిక ప్రకారం మన దేశంలో బాలబాలికల మీద 2019లో 32,269 కేసులు, 2020లో 29,768 కేసులు, 2021లో 31,170 కేసులు నమోదైనాయి. దీన్ని బట్టి బాల బాలికల్లో హింసాత్మక, నేర ప్రవృత్తి స్థాయి మనకు అవగతమవుతుంది. దీనికి తల్లిదండ్రుల నిరాదరణ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొన్ని కారణాలు. వీటిని పరిహరించడం ద్వారానే రేపటి పౌరులను నేర ప్రపంచంలోకి వెళ్లకుండా ఆపగలం. (క్లిక్ చేయండి: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. అదే పెద్ద సమస్య!) - తడకమళ్ళ మురళీధర్ విశ్రాంత జిల్లా జడ్జి -
బాలల చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: బాలల రక్షణ చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే రాష్ట్రంలో వారికి మంచి భవిష్యత్తు అందించగలమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతీ రాథో డ్ అన్నారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కొత్తగా ఏర్పాటైన సందర్భంగా శుక్రవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవితాన్ని కోల్పోతున్న బాలల కోసం మనసు పెట్టి పనిచేయాలని సూచించారు.ఆలనా పాలనా కోసం ఎదురు చూస్తున్న వారిని చేరదీసి, వారికి చేయూత అందించాలన్నారు.రాష్ట్రంలో బాలలు, మహిళలకు ఎలాంటి లోటులేకుండా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటుతో పిల్లలకు కచ్చితంగా మేలు జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.రాష్ట్రంలో చాలామంది బాలలు విధివంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. ‘యూనిసెఫ్’తో సమన్వయం చేసుకుని బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు, సభ్యులు అంజన్ కుమార్, చిట్టిమల్ల రాగజ్యోతి, శోభారాణి, అపర్ణ, ఎడ్లపల్లి బృందాదర్ రావు, ఏ. దేవయ్య, మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, బాల నేరస్తులు, వీధి బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాలలకూ హక్కులున్నాయ్..
ఆధునిక ప్రపంచంలో నాగరికత వెర్రితలలు వేస్తున్న తరుణంలో ముక్కుపచ్చలారని పిల్లలు సమిధలౌతున్నారు. సగటు సమాజం తలదించుకునేలా బాలలపై భౌతిక, లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు పేట్రేగిపోతున్నాయి. ఇప్పుడు బాలల హక్కులపై అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసస్నమయ్యింది. హక్కుల కోసం ఉద్యమించే జనం బాలలకూ హక్కులున్నాయన్న విషయం గుర్తించి, వారి హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. సాక్షి, శృంగవరపుకోట (విజయనగరం): బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎనీసీపీసీఆర్ నేతృత్వంలో కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ (సీపీసీఆర్) చట్టం 2005లో సెక్షన్ 13(1) ఉద్దేశించింది. ఈ యాక్ట్ ప్రకారం పిల్లల హక్కుల ఉల్లంఘన, వారిపై జరుగుతున్న వేధింపులు, హత్యలు, ఇతరత్రా సమస్యలను కమిషన్ విచారించి, వారికి సత్వర న్యాయం అందించే వీలుంది. నేడు కమిషన్ సమక్షంలో విచారణ బాలల హక్కులపై విచారణ చేపట్టేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ధర్మాసనం ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో గురువారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ కమిషన్ సభ్యులు విచారణ చేపడతారు. పిల్లల హక్కుల ఉల్లంఘనపై పిల్లలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఎన్జీఓలు లేదా ఇతరులు ఎవ్వరైనా ఫిర్యాదు చేయవచ్చు. నేరాలుగా పరిగణించేవి ఇవే.. ► బాలలను గృహకార్మికులుగా ఉంచటం, ► బాల కార్మికులకు పరిహారం చెల్లించక పోవటం, ► బాలకార్మికులుగా తయారు చేయటం ► పిల్లలచే బలవంతంగా యాచన చేయించటం ► పిల్లల ఆత్మగౌరవాన్ని కించపరచటం, ► పోలీసులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పిల్లల్ని కొట్టటం, యాసిడ్దాడులు చేయటం ► శారీరక–లైంగిక వేదింపులు, భౌతిక దాడులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం ► వ్యక్తులు లేదా సంస్థల నిర్లక్ష్యం వల్ల శిశుమరణాలు, అక్రమ దత్తత, అపహరణ ► విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేకపోవటం ► వారిని అవమానించటం, నిర్బంధించటం ఇవే బాలల హక్కులు ► చిన్నారుల బాల్యాన్ని చిదిమేసే హక్కు ఎవ్వరికీ లేదు. ► సామర్థ్యానికి మించి పనులు చెప్పకూడదు. ► 1966 బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 17ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టకూడదు. ► రాజ్యాంగంలో 21ఎ అధికరణ ప్రకారం విద్యాహక్కుకు చట్టబద్ధత కల్పించారు. ► 14 ఏళ్లు నిండేదాకా ఉచిత విద్య అందివ్వాలి ► 14 ఏళ్లలోపువారిచే ఏవిధమైన పనులు చేయించకూడదు. ► ఫ్యాక్టరీలు, భూగర్బ ప్రదేశాల్లో పని చేయించకూడదు. ► దుకాణాలు, హోటళ్లు, షెడ్లలో పనులకు చేర్చకూడదు. ► 2010 బాలల నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి. బాలల హక్కుల పరిరక్షణ శిబిరం నేడు విజయనగరం ఫోర్ట్: జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించనున్న ఫిర్యాదులు, వినతుల స్వీకరణ శిబిరాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సహకరించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా కోరారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ శిబిరానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్.జి. ఆనంద్ ముఖ్యతిథిగా వస్తారని తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పాత్రికేయులతో మాట్లాడాక ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చే వారి కోసం టెంట్లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గంటా హైమావతి, జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్ రాజు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు, ఐసీడీఎస్ పీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లపై కేసులు పెట్టండి..
విద్యార్థులతో రోడ్లు ఊడిపించడంపై బాలల హక్కుల కమిషన్ సీరియస్ సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులతో రోడ్లు ఊడిపించిన ఘటనను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గిన్నిస్ బుక్ రికార్డు కోసం సికింద్రాబాద్‌లో బుధవారం 15 స్కూళ్లకు చెందిన 2,500 మంది విద్యార్థులు రోడ్లు ఊడ్చిన విషయం విదితమే. దీనిని బాలల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. కార్యక్రమాన్ని నిర్వహించిన జనని సంస్థ, స్థానిక కార్పొరేటర్‌పై విచారణ జరిపి కేసులు నమోదు చేరుుంచాలంది. ఘటనపై నవంబర్ 15కల్లా నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించింది.