ఆధునిక ప్రపంచంలో నాగరికత వెర్రితలలు వేస్తున్న తరుణంలో ముక్కుపచ్చలారని పిల్లలు సమిధలౌతున్నారు. సగటు సమాజం తలదించుకునేలా బాలలపై భౌతిక, లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు పేట్రేగిపోతున్నాయి. ఇప్పుడు బాలల హక్కులపై అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసస్నమయ్యింది. హక్కుల కోసం ఉద్యమించే జనం బాలలకూ హక్కులున్నాయన్న విషయం గుర్తించి, వారి హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది.
సాక్షి, శృంగవరపుకోట (విజయనగరం): బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎనీసీపీసీఆర్ నేతృత్వంలో కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ (సీపీసీఆర్) చట్టం 2005లో సెక్షన్ 13(1) ఉద్దేశించింది. ఈ యాక్ట్ ప్రకారం పిల్లల హక్కుల ఉల్లంఘన, వారిపై జరుగుతున్న వేధింపులు, హత్యలు, ఇతరత్రా సమస్యలను కమిషన్ విచారించి, వారికి సత్వర న్యాయం అందించే వీలుంది.
నేడు కమిషన్ సమక్షంలో విచారణ
బాలల హక్కులపై విచారణ చేపట్టేందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ధర్మాసనం ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో గురువారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ కమిషన్ సభ్యులు విచారణ చేపడతారు. పిల్లల హక్కుల ఉల్లంఘనపై పిల్లలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఎన్జీఓలు లేదా ఇతరులు ఎవ్వరైనా ఫిర్యాదు చేయవచ్చు.
నేరాలుగా పరిగణించేవి ఇవే..
► బాలలను గృహకార్మికులుగా ఉంచటం,
► బాల కార్మికులకు పరిహారం చెల్లించక పోవటం,
► బాలకార్మికులుగా తయారు చేయటం
► పిల్లలచే బలవంతంగా యాచన చేయించటం
► పిల్లల ఆత్మగౌరవాన్ని కించపరచటం,
► పోలీసులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పిల్లల్ని కొట్టటం, యాసిడ్‌దాడులు చేయటం
► శారీరక–లైంగిక వేదింపులు, భౌతిక దాడులు, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం
► వ్యక్తులు లేదా సంస్థల నిర్లక్ష్యం వల్ల శిశుమరణాలు, అక్రమ దత్తత, అపహరణ
► విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు లేకపోవటం
► వారిని అవమానించటం, నిర్బంధించటం
ఇవే బాలల హక్కులు
► చిన్నారుల బాల్యాన్ని చిదిమేసే హక్కు ఎవ్వరికీ లేదు.
► సామర్థ్యానికి మించి పనులు చెప్పకూడదు.
► 1966 బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 17ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టకూడదు.
► రాజ్యాంగంలో 21ఎ అధికరణ ప్రకారం విద్యాహక్కుకు చట్టబద్ధత కల్పించారు.
► 14 ఏళ్లు నిండేదాకా ఉచిత విద్య అందివ్వాలి
► 14 ఏళ్లలోపువారిచే ఏవిధమైన పనులు చేయించకూడదు.
► ఫ్యాక్టరీలు, భూగర్బ ప్రదేశాల్లో పని చేయించకూడదు.
► దుకాణాలు, హోటళ్లు, షెడ్‌లలో పనులకు చేర్చకూడదు.
► 2010 బాలల నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూళ్లలో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి.
బాలల హక్కుల పరిరక్షణ శిబిరం నేడు
విజయనగరం ఫోర్ట్: జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించనున్న ఫిర్యాదులు, వినతుల స్వీకరణ శిబిరాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సహకరించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ శిబిరానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ ఆర్.జి. ఆనంద్ ముఖ్యతిథిగా వస్తారని తెలిపారు. ఉదయం 9:30 గంటలకు పాత్రికేయులతో మాట్లాడాక ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తారని తెలిపారు. శిబిరానికి వచ్చే వారి కోసం టెంట్లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గంటా హైమావతి, జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఇన్‌చార్జి జేసీ–2 సాల్మన్ రాజు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు, ఐసీడీఎస్ పీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment