సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పలువురిని మేథోబలహీనత వేధిస్తోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు, ఇతర సమస్యల కారణంగా పుట్టినప్పటి నుంచి సరైన పౌష్టికాహారం లేకపోవడం, జన్యుపరమైన లోపాల వల్ల వీరిని ఈ సమస్య వెంటాడుతోంది. ఇటీవల ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి విద్యార్థుల్లోని ‘డౌన్‌సిండ్రోమ్’ (మేథోబలహీనత, శారీరక అసాధారణ పరిస్థితి)పై పరిశీలన నిర్వహించారు. మొత్తంగా 4,719 మందిని పరిశీలించగా 1,040 మంది డౌన్‌సిండ్రోమ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. ఈ రుగ్మతల వల్ల వారి విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుతున్న ప్రభుత్వం పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఆశించిన మేర పౌష్టికత ఉండడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ పథకం అమలవుతోంది.
ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తున్నాయి. దీనికింద హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హోమ్‌సైన్సు కాలేజీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సూచనల మేరకు స్థానిక వనరులతో పౌష్టికాహార మెనూను నిర్దేశించారు. అన్నం, పప్పు, కూరగాయలు, సాంబారు, పులిహోరతో పాటు వారానికి అయిదు గుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత మార్గదర్శకాలు విడుదల చేస్తున్నా ఆ మేరకు పథకం అమలు కావడం లేదు. కోడిగుడ్లు, ఆయిల్, పప్పుల సరఫరా టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా విద్యార్థులకు సరైన ప్రమాణాల్లో పౌష్టికాహారం అందడం లేదు. పైగా మురిగిపోయిన కోడిగుడ్లు, నాణ్యతలేని కందిపప్పు, సమయం దాటిన ఆయిళ్లు పంపిణీ చేస్తుండడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే పేర్కొంటున్నారు. అటు నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇంటివద్ద పౌష్టికాహారం లేకపోగా ఇటు పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం ద్వారా కూడా అందడం లేదు. ఫలితంగా విద్యార్థుల్లో మేథోపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
క్రోమోజోమ్‌ల లోపంతోనే ఈ సమస్య
పుట్టుకతో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల విద్యార్థులు మేథోబలహీనతతో పాటు ఇతర శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. పిల్లల పుట్టుకకు 23 జతల క్రోమోజోమ్‌లు కారణభూతంగా ఉంటాయి. వీటిలో 21వ జత క్రోమోజోమ్‌లో అదనపు క్రోమోజోమ్ ఎక్కువగా జతవ్వడం వల్ల పుట్టిన పిల్లలు అసాధారణ శారీరక మార్పులకు గురవుతుంటారు. వీరిలో మెదడు పెరుగుదల ఆశించినంతగా ఉండదు. ఎముకలు గుల్లబారడం, పేగుల్లో సమస్యలు తలెత్తడం వంటివి ఎదురవుతుంటాయి. వీటివల్ల ఈ పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతుంటారు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే తల్లికి సరైన పౌష్టికాహారం వంటివి అందించాల్సి ఉంటుంది. గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ తగిన జాగ్రత్తలు చేపట్టాలి. పిల్లలు పుట్టిన దగ్గర నుంచీ కూడా సరైన పౌష్టికాహారం అందించాలి.
– డాక్టర్ జి.శ్రీనివాస్, చిన్నపిల్లల వైద్యనిపుణుడు, వైఎస్సార్ జిల్లా
పౌష్టికత లోపం వల్లనే ఈ సమస్యలు
పౌష్టికత లోపం వల్లనే ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు, ప్రసవం తరువాత తల్లికి సరైన పౌష్టికాహారం అందేలా తొలినుంచి చర్యలు తీసుకోవాలి. పేద కుటుంబాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్వడం వల్లనే ఈ సమస్య ఎక్కువవుతోంది. పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కూడా సరైన ఆహారం అందడం లేదు. ఐసీడీఎస్ పథకం పూర్తిగా నీరుగారిపోయింది. ఇక పాఠశాలల్లో చేరాక పిల్లలకు మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్ఠికాహారం అందించాల్సి ఉన్నా అది కాస్తా అక్రమాలమయంగా మారింది. పిల్లలకు గుడ్లు, అరటి పండ్లు అందడం లేదు. ఆహార పదార్థాల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలుస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 60 శాతానికి పైగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి.
– విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment