సాంకేతికత.. డిజిటల్‌ బాట | Tabs for Andhra Pradesh Government School Students | Sakshi
Sakshi News home page

సాంకేతికత.. డిజిటల్‌ బాట

Published Thu, Dec 21 2023 4:43 AM | Last Updated on Thu, Dec 21 2023 2:43 PM

Tabs for Andhra Pradesh Government School Students - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇప్పటికే మనబడి–నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్‌కు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. దీంతోపాటు పేద పిల్లలకు సాంకేతిక విద్యను చేరువ చేసేలా గతేడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసి బైజూస్‌ కంటెంట్‌తో పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

అలాగే డిజిటల్‌ తరగతులను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ టీవీ, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ద్వారా బోధన, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌లు, పెర్‌ఫెక్టివ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ ట్యాబ్‌లు ఇలా ఒక్కొక్కటిగా సాంకేతికతను చొప్పిస్తూ ప్రభుత్వ విద్యను శిఖరాలకు తీసుకువెళుతోంది. దీంతో విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి.  

గతేడాది నుంచి..  
విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి గతేడాది శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రెండో ఏడాది కూడా అందించాలని నిర్ణయించింది. ఏలూరు జిల్లాలో 398 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 17,410 మందిని ఈ ఏడాది అర్హులుగా గుర్తించారు. గతేడాది 18,370 మంది విద్యార్థులకు, 2,613 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 276 పాఠశాలల్లో 13,790 మంది విద్యార్థులకు ఈ ఏడాది ట్యాబ్‌లు అందించనున్నారు. గతేడాది 14,353 మంది విద్యార్థులకు, 2373 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందజేశారు. గతేడాది ట్యాబ్‌లు అందుకున్న విద్యార్థులు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది (10వ తరగతి పూర్తి చేసే) వరకూ ట్యాబ్‌లు వారి వద్దనే ఉంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.    

సామర్థ్యం పెంచి.. 
విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచారు. 8.7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్టీ కార్డు సామర్థ్యం గల ట్యాబ్‌లు అందించనున్నారు. ట్యాబ్‌ల కోసం గతేడాది ప్రభుత్వం రూ.101.64 కోట్లు వెచ్చించగా ఈ ఏడాది రూ.99.84 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ట్యాబ్‌ల పర్యవేక్షణకు ప్రభుత్వం పర్యవేక్షక బృందాన్ని నియమించింది.

మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులకు ట్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్యలపై జిల్లా నోడల్‌ పర్సన్‌తో శిక్షణ ఇప్పించింది. విద్యార్థి అభ్యసనకు సంబంధించి వైఫై మేనేజర్, బైజూస్‌ కంటెంట్, డిక్షనరీ మాత్రమే ట్యాబ్‌లో అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తారు. ఇతర ఎటువంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసినా, ఇన్‌స్టాల్‌ చేసినా సంబంధిత ఉపాధ్యాయుడికి ఓటీపీ వచ్చేలా ట్యాబ్‌ల రూపకల్పన జరిగింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement