AP: వినూత్న విధానాలు.. విప్లవాత్మక ఫలితాలు | SCERT programs to improve students abilities | Sakshi
Sakshi News home page

AP: వినూత్న విధానాలు.. విప్లవాత్మక ఫలితాలు

Published Thu, Dec 22 2022 4:48 AM | Last Updated on Thu, Dec 22 2022 2:58 PM

SCERT programs to improve students abilities - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ద్వారా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో లెవల్‌–2 స్థాయికి చేరుకుని ఏపీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అంతకుముందు ప్రధాని ఆర్థిక సలహా మండలి రూపొందించిన నివేదికలోనూ ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొంది.

పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణం. గత సర్కారు హయాంలో నిస్తేజంగా మిగిలిన ఎస్సీఈఆర్టీ ముఖ్యమంత్రి చొరవతో పలు వినూత్న కార్యక్రమాలను రూపొందించి అమల్లోకి తెచ్చింది.  

విద్యార్థులకు మేలు చేసేలా.. 
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం పిల్లలు పేద వర్గాలకు చెందిన వారైనందున నాణ్యమైన విద్యతో అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. ఎస్సీఈఆర్టీ ఇందుకోసం విద్యా రంగంలో అగ్రశ్రేణి, ప్రసిద్ధ సంస్థలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీచర్లకు కంటెంట్, స్పోకెన్‌ ఇంగ్లీష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడం బోధనా సామర్థ్యాలను మెరుగుపరిచింది.  

ద్విభాషా పాఠ్య పుస్తకాల నుంచి.. 
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని దృష్టిలో ఉంచుకుని అటు విద్యార్ధులు, ఇటు టీచర్లకు ఉపయుక్తంగా ఉండేలా 1 నుంచి 8వ తరగతి వరకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మైనర్‌ మీడియంలో కూడా వీటిని రూపొందించడం విశేషం.  

► విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలను ఇళ్ల వద్ద అభ్యసించేందుకు తొలిసారిగా వర్కు బుక్స్‌ రూపొందించి ఉచితంగా అందించింది. 
► 1– 5 తరగతుల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద పిక్టోరియల్‌ (చిత్రాలతో కూడిన) నిఘంటువును పంపిణీ చేసింది. 
► 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులు ఇంటి వద్ద పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి టీవీ, రేడియో పాఠాలను విద్యా వారధి, విద్యామృతం, విద్యా కలశం పేర్లతో రూపొందించి ప్రసారం చేసింది. 

గిరిజన పిల్లలకు మాతృభాషలో 
గిరిజన ప్రాంతాల పిల్లలు సులభంగా నేర్చుకునేలా వారి మాతృభాషల్లోనే ఆయా పుస్తకాలను రూపొందించారు. అంగన్‌వాడీల కోసం ప్రీ–ప్రైమరీ పాఠ్యపుస్తకాలను  6 గిరిజన భాషల్లోకి అనువదించారు. ‘రూట్స్‌’ పేరుతో సవర, సుగాలి, ఆదివాసీ ఒరియా, కొండ, కువి, కోయ భాషల్లో వీటిని సిద్ధం చేశారు. 

కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ 
ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకు చెందిన విద్యావేత్తలతో చర్చించి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులు చేశారు. సెకండరీ విద్యార్ధులకు కెరీర్‌  గైడెన్స్‌  రిసోర్స్‌ పుస్తకాలను తెచ్చారు. పదో తరగతి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధమయ్యేలా సబ్జెక్ట్‌ నిపుణులతో వీడియో ప్రోగ్రామ్‌లను రూపొందించారు. యునిసెఫ్‌ సహకారంతో సెకండరీ పాఠశాలల్లో ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’లను బలోపేతం చేశారు. కరిక్యులమ్‌లో సంస్కరణలను క్యూఆర్‌ కోడ్‌ ద్వారా దీక్షా పోర్టల్‌లో పొందుపరిచారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వీటికి ప్రశంసలు లభించాయి. 
 
హెడ్మాస్టర్లలో కెపాసిటీ బిల్డింగ్‌ 
లెసన్‌ ప్లాన్ల రూపకల్పన పక్కాగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సీబీఎస్‌ఈ విధానాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో టీచర్లందరికీ వాటిపై శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. 1.32 లక్షల మంది ఉపాధ్యాయులు దీనివల్ల ప్రయోజనం పొందారు. ప్రపంచంలోనే మొదటిసారిగా టీచ్‌ టూల్‌ అబ్జర్వర్స్‌ ట్రైనింగ్‌ నిర్వహించింది. ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని విశ్లేషించి సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇది ఉపకరిస్తుంది. ’లీడర్‌షిప్‌ ఫర్‌ ఈక్విటీ’ సంస్థ సహకారంతో పాఠశాల విద్యా శాఖ దీన్ని అమలు చేస్తోంది.  
 
బేస్‌లైన్‌ టెస్ట్‌తో లోపాల సవరణ 
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేలా పునాది ప్రమాణాలను అంచనా వేసేందుకు బేస్‌లైన్‌ పరీక్షను ఎస్సీఈఆర్టీ నిర్వహించింది. గతంలో ఇలా ఎన్నడూ నిర్వహించలేదు. విద్యార్థుల వాస్తవ సామర్థ్యాలను గుర్తించి లోపాలను సవరించేందుకు ఇది ఉపకరించింది. ఇందుకు అనుగుణంగా 90 రోజులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవసరమైన మెటీరియల్‌ అందించారు. 
 
స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ప్రోగ్రామ్‌లు 
విద్యార్థులు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేలా స్పోకెన్‌ ఇంగ్లీషుపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. అనర్గళంగా అమెరికన్‌ యాసలో మాట్లాడేలా అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి ఐదుగురు చొప్పున ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. దేశ, విదేశీ నిపుణులను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్ధులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని అందించిన ప్రభుత్వం రోజుకో ఆంగ్ల పదాన్ని నేర్పిస్తోంది. స్టాండర్డైజ్డ్‌  టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీషు ప్రోగ్రామ్‌ కింద దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.  
 
ఇతర రాష్ట్రాల ఆసక్తి 
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. అసోం విద్యాశాఖ ఉన్నతాధికారుల బృందం ఇక్కడి డైట్‌లను, స్కూళ్లను సందర్శించింది. ఉత్తరప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ అధికారుల బృందం కూడా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లను సందర్శించి ఇక్కడి విధానాలను అనుసరించేందుకు సిద్ధమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement