చదివేస్తే ఉన్న మతి పోయిందని నానుడి. బాంబే ఐఐటీ పాలకవర్గం నిర్వాకం వల్ల తిండి చుట్టూ మన సమాజంలో అల్లుకొని ఉన్న వివక్ష ఆ ఉన్నత శ్రేణి విద్యాసంస్థను కూడా తాకింది. బాంబే ఐఐటీ హాస్టళ్లలో మూణ్ణెల్ల క్రితం శాకాహారులకు విడిగా టేబుల్స్ కేటాయించాలన్న డిమాండ్ బయల్దేరింది. మాంసాహారుల పక్కన కూర్చుంటే ఆ ఆహారం నుంచి వచ్చే వాసనల కారణంగా తమలో వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆ డిమాండు చేస్తున్నవారి ఫిర్యాదు. ఎప్పుడో 1958లో స్థాపించిన ఆ విద్యాసంస్థలో ఇప్పుడే ఈ డిమాండ్ ఎందుకు తలెత్తిందన్న సంగతలా వుంచితే... దాన్ని అంగీకరిస్తే మాంసాహారం అపవిత్రం లేదా మలినం అని సమాజంలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న అభిప్రాయానికి ఆమోదముద్ర వేసినట్టవుతుందన్న సందేహం బాంబే ఐఐటీ పాలకవర్గానికి కలగలేదు.
ప్రాంగణంలోని మూడు హాస్టళ్లలో విడిగా ఆరు టేబుళ్లను ‘వెజిటేరియన్ ఓన్లీ’ బోర్డులతో అలంకరించింది. అంతటితో ఊరుకోలేదు. దీనిపై నిరసన వ్యక్తం చేసిన విద్యార్థికి రూ. 10,000 జరిమానా విధించింది. ఈ నిరసన ఘర్షణకు దారితీస్తుందనీ, క్రమశిక్షణ ఉల్లంఘన కిందికొస్తుందనీ డీన్ అంటున్నారు. ఇలాంటి డిమాండ్ తలెత్తినప్పుడు దానిపై అందరి అభిప్రాయాలూ తీసుకోవటం, ఒక కమిటీని నియమించటం, దాని సాధ్యాసాధ్యాలు, పర్యవసానాలపై చర్చించటం ప్రజాస్వామిక పద్ధతి. అలాంటి విధానమే అమలైవుంటే శాకాహార విద్యార్థులు అంతిమంగా తమ డిమాండ్‌ను వదులుకునేవారో, మాంసాహార ప్రియులు వారి సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించేవారో తెలిసేది. ఈ ప్రక్రియ అమలైందా లేదా... అందులో వచ్చిన అనుకూల, ప్రతికూల అభిప్రాయాలేమిటన్నది ఎవరికీ తెలియదు.
బాంబే ఐఐటీలోని అంబేడ్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ (ఏపీపీఎస్సీ) విద్యార్థుల ప్రకారం పాలకవర్గం ఈ మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచింది. కనుక సహజంగానే నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘మేం ఏం చేసినా శిరసావహించాల్సిందే, లేకుంటే కొరడా ఝళిపిస్తాం’ అన్నట్టు వ్యవహరించటం, ప్రశ్నించటమే నేరమన్నట్టు పరిగణించటం ఉన్నత శ్రేణి విద్యాసంస్థకు శోభస్కరం కాదు. వికారాలున్నవారిని దూరంగా పోయి తినమని చెప్పక గోటితో పోయేదానికి గొడ్డలి అందుకున్నట్టు ఇంత రాద్ధాంతం దేనికో అర్థం కాదు. పాశ్చాత్య దేశాల్లో కూడా శాకాహారం, మాంసాహారం విభజన వుంది. డెయిరీ ఉత్పత్తులు సైతం సమ్మతం కాదనే వెగానిజం కూడా అక్కడుంది. అమెరికన్లలో గత మూడు నాలుగేళ్లలో దాదాపు 15 శాతం మంది శాకాహారులుగా మారారని ఈమధ్య ఒక సర్వే వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 2020లో 1,400 కోట్ల డాలర్లుగా ఉన్న వెగాన్ మార్కెట్, ఆ మరుసటి ఏడాదికి 1,577 కోట్ల డాలర్లకు పెరిగిందని మరో సర్వే అంటున్నది. అయితే మన దేశంలో వలే అక్కడ తినే ఆహారం కులాలతో ముడిపడి లేదు. ఇక్కడ శాకాహారులు చాలా ఉన్నతులనీ, మాంసాహారులు తక్కువనీ అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అందుకు మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా దోహదపడుతున్నాయి. ఆహారపుటలవాట్లలో కులాన్ని వెతకటం పాక్షిక దృష్టి అంటున్నవారు కొన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కశ్మీర్ వంటిచోట్ల బ్రాహ్మణులు మాంసాహారులుగా ఉండటాన్ని ఉదహరిస్తున్నారు. కానీ ఇవి చెబుతున్నవారు మన దేశంలో చాలాచోట్ల అట్టడుగు కులాలవారికి అద్దెకు ఇల్లు ఇవ్వకుండా ఉండటానికి ‘వెజిటేరియన్లకు మాత్రమే’ అనే బోర్డులు పెడుతున్న ధోరణిని మరిచిపోకూడదు.
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒంటిస్తంభం మేడలో ఉంచి చదువు చెప్పించాలనుకోకుండా... ప్రాథమిక విద్య మొదలుకొని అన్ని దశల్లోనూ విద్యాసంస్థలకు పంపటంలో ఒక అంతరార్థం ఉంటుంది. వివిధ వర్గాల పిల్లలతో కలిసిమెలిసి పెరగటం, సామాజిక అవగాహన పెంపొందించుకోవటం అనే లక్ష్యాలు కూడా అంతర్లీనంగా ఇమిడివుంటాయి. తెలియనిది తెలుసుకోవటం, భిన్నత్వాన్ని గౌరవించటం, అవసరమైతే ప్రశ్నించటం, ఈ క్రమంలో తనను తాను మార్చుకోవటం కూడా విద్యాసముపార్జనలో భాగమే. బాధ్యతాయుతమైన రేపటి పౌరులుగా రూపొందటానికి ఇవన్నీ అవసరం. బాంబే ఐఐటీలో చదువుతున్నవారు పరిశోధనల కోసమో, ఉన్నతోద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు తోటి మనిషి ఆహారాన్ని చూసి వికారాలు తెచ్చుకోవటం అక్కడికి కూడా మోసుకుపోతే క్షణకాలమైనా మనుగడ సాగించగలరా? ఈ ఆలోచన వాళ్లకు రాకపోతే పోయింది... సంస్థ నిర్వాహకులకేమైంది?
ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో మొన్న జూలైలో కేంద్రం తెలిపింది. ఈ ఉదంతాల్లో వ్యక్తిగత కారణాలను వెదకటం తప్ప సంస్థాగతంగా ఎలాంటి దిద్దుబాటు చర్యలు అవసరమన్న విచికిత్సలోకి పోవటం లేదు. తినే తిండి మొదలుకొని ఎన్నిటినో ఎత్తి చూపి న్యూనత పరిచే ధోరణి ఉండటాన్ని ఈ సంస్థల పాలకవర్గాలు గుర్తించటం లేదు. బాంబే ఐఐటీ మరో అడుగు ముందుకేసి అలాంటి ధోరణులను బలపర్చే నిర్ణయాన్ని తీసుకోవటం ఆందోళన కలిగించే అంశం. ఈ జాడ్యం హైదరాబాద్ ఐఐటీకి కూడా వ్యాపించిందంటున్నారు. ఏకంగా శాకాహారుల కోసం అది ప్రత్యేక హాల్ కేటాయించబోతున్నదన్న వార్తలొస్తున్నాయి. తమ సంస్థల్ని ప్రపంచ శ్రేణి విద్యా కేంద్రాలుగా రూపుదిద్దటం ఎలాగన్న ఆలోచనలు మాని, క్షీణ విలువలను తలకెత్తుకోవటం ఏ మేరకు సమంజసమో నిర్వాహకులు ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment