‘గర్భిణులకు మాంసాహారం వద్దు’
న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే గర్భిణులు మాంసాహారంతో పాటు శృంగారానికి దూరంగా ఉండాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఆథ్యాత్మిక భావాలతో గడపడంతో పాటు బెడ్‌రూమ్‌లో అందమైన వాల్‌పేపర్లు అంటించాలని తన బుక్‌లెట్‌లో సూచించింది. మహిళలు గర్భం దాల్చిన సమయంలో గొప్పగొప్ప మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని తెలిపింది.
‘తల్లి పిల్లల సంరక్షణ’ పేరుతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ యోగా అండ్ నేచురోపతి(సీసీఆర్‌వైఎన్) ఈ బుక్‌లెట్లను జారీ చేసింది. ఈ సిఫార్సులకు ఎలాంటి హేతుబద్ధత లేదని అలోపతి వైద్యులు తేల్చిచెప్పారు. అసాధారణ కేసుల్లో తప్పించి గర్భిణులు శృంగారానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ గైనకాలజీ ప్రొఫెసర్ నీర్జా భాటియా స్పష్టం చేశారు.