టిమ్ కుక్ వర్సస్ సుందర్ పిచాయ్.. గెలుపెవరిదో?
టిమ్ కుక్ వర్సస్ సుందర్ పిచాయ్.. గెలుపెవరిదో?
Published Wed, Oct 26 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ను అధిగమించి, భారత్ మార్కెట్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆపిల్ ఓ వైపు ప్రయత్నిస్తుండగా.. సొంత ఆండ్రాయిడ్ డివైజ్లతో మార్కెట్లను ఏలాలని గూగుల్ రంగంలోకి దిగింది. చైనా తర్వాత ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఎక్కువగా దృష్టిసారించిన భారత్ మార్కెట్లో.. ఆ కంపెనీకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గట్టిపోటీని ఇస్తున్నారు. ఆపిల్ ఇటీవలే తన కొత్త ఐఫోన్లను భారత్ లో లాంచ్ చేయగా...గూగుల్ తన సొంత బ్రాండులోని కొత్త ఫిక్సెల్ స్మార్ట్ఫోన్లను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్ ప్రపంచంలోకి గూగుల్ లేట్గా ఎంట్రీ ఇచ్చినా .. ముందస్తుగానే ఆండ్రాయిడ్ మార్కెట్ అంతటిన్నీ తన సొంతం చేసుకుంది.
భారత్లో 94 శాతం స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఆండ్రాయిడ్ ఓఎస్ డివైజ్లే ఏలుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు అత్యాధునికమైన డివైజ్లుగా ఆపిల్కు ఎంతో పేరుంది. ఆపిల్కు పోటీగా హై ఎండ్ డివైజ్లను తాము తీసుకొచ్చామంటూ గూగుల్ సీఈవో ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రకటించిన ఆపిల్ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో ఆపిల్ విక్రయాలు గ్లోబల్గా దెబ్బతిన్నప్పటికీ, భారత్ మార్కెట్లో మెరుగైన ఫలితాలనే సాధించింది. భారత్లో ఐఫోన్ విక్రయాలను 50 శాతం పెంచుకున్నట్టు ప్రకటించింది. అయితే గూగుల్ కంపెనీ నుంచి తమకు గట్టి పోటీ వాతావరణం నెలకొందని పేర్కొంది. కానీ ఆండ్రాయిడ్ డివైజ్ ల ఆధిపత్యాన్ని తాము ఎలాగైనా కొల్లగొడతామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గట్టిగా నొక్కి చెప్పారు.
చైనా తర్వాత తాము ఎక్కువగా ఇండియా మార్కెట్పైనే దృష్టిసారించామని టిమ్ కుక్ తెలిపారు. రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్ సహకారంతో గూగుల్, శాంసంగ్లను తాము అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఒక్కసారి ఆండ్రాయిడ్ కస్టమర్లు ఐఫోన్ల వైపు మరిలితే, వారు ఇతర ఓఎస్లను కనెత్తి కూడా చూడరని విశ్లేషకులంటున్నారు. గూగుల్, తన ఆండ్రాయిడ్ కస్టమర్లను వదులుకుంటే, మళ్లీ వారిని తనవైపు మరలుచుకోవడం కొంత కష్టతరమేనంటున్నారు విశ్లేషకులు. అంతేకాక పాతుకుపోయిన ఆండ్రాయిడ్ డివైజ్లను మార్కెట్ నుంచి తొలగించడం ఆపిల్కూ ఓ పెద్ద సవాలేనట. ధర పరంగా కూడా ఆపిల్ కొత్త ఐఫోన్7, గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్ లు గట్టి పోటీ ఇంచుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భారత్ మార్కెట్ ఇటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్కు, అటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. రానున్న మార్కెట్లో గెలుపెవరిదో వేచిచూడాల్సిందే. ఎవరి వ్యూహాలు ఎలా ఫలిస్తాయో.
Advertisement