Reason For Blackberry Failure: Blackberry Smart Phone Rise And Fall Reasons Story Telugu - Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీ.. ఒకప్పుడు ‘స్మార్ట్‌’ కింగ్‌.. మరి పతనానికి కారణాలు తెలుసా? ఇవే..

Published Wed, Jan 5 2022 2:27 PM | Last Updated on Wed, Jan 5 2022 3:29 PM

Blackberry Smart Phone Rise And Fall Reasons Story Telugu - Sakshi

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ రారాజు.  చేతిలో ఆ కంపెనీ ఫోన్‌ ఉంటే అదో దర్పం. ప్రొఫెషనల్స్‌కి అదొక అవసరం కూడా.  ఒకానొక సీజన్‌లో ఏకంగా ఒక 5 కోట్ల డివైజ్‌లు అమ్ముడు పోయిన చరిత్ర ఉంది. కానీ, అటుపై ఘోరమైన పతనాన్ని చవిచూసింది. అందుకు కారణం ఆలస్యమేనన్న విశ్లేషణ నడుస్తోంది ఇప్పుడు. 


‘ఆలస్యం అమృతం విషం’ అంటారు పెద్దలు. రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌(RIM) అలియాస్‌ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌ విషయంలో ఇదే జరిగింది. పోటీతత్వాన్ని తేలికగా తీసుకున్న బ్లాక్‌బెర్రీ.. రాంగ్‌ స్టెప్పులు వేసింది. నష్టాలను సైతం పట్టించుకోకుండా విలువల పేరుతో ఈ కెనెడియన్‌ టెలికాం కంపెనీ స్వీయ తప్పిదాలు చేసి పతనం వైపు అడుగు వేసింది. ఇంతకీ బ్లాక్‌బెర్రీ ది రైజ్‌ అండ్‌ ది ఫాల్‌ ఎలా సాగిందో చూద్దాం..

 

పేజర్లు, హ్యాండ్‌సెట్ల తయారీతో మొదలైన RIM(బ్లాక్‌బెర్రీ) ప్రస్థానం.. స్మార్ట్‌ఫోన్‌ రాకతో కొత్త పుంతలు తొక్కింది. పూర్తిగా ఐకానిక్‌ కీబోర్డుతో పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఒకానొక టైంలో బ్లాక్‌బెర్రీ.. అమెరికాలో 50 శాతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను, ప్రపంచం మొత్తం మీద 20 శాతం మార్కెట్‌ను శాసించింది. 2011, 2012లో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి హ్యాండ్‌సెట్ల అమ్మకాలతో సంచలనం సృష్టించిన బ్లాక్‌బెర్రీకి.. పోటీదారుల ఒరవళ్లతో గడ్డుకాలం మొదలైంది. 2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ.. తాజాగా సొంత ఓఎస్‌ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించింది. దీంతో కోట్ల ఫోన్లు మూగబోయాయి. ఇంతకీ ఏం జరిగింది?

బీజం..
1984లో  మైక్‌ లాజరడీస్‌,డౌగ్లస్‌ ఫ్రాగ్‌ అనే కెనెడియన్‌ ఇంజీనీర్లు RIMను ప్రారంభించారు.  మొదట్లో ఈ కంపెనీ ఐబీఎంకోసం ఎల్‌ఈడీ సిస్టమ్‌, మోడెమ్స్‌ తో పాటు పేజెస్ వంటి లోకల్‌ నెట్‌ వర‍్కింగ్‌ కనెక్టివిటీ టెక్నాలజీ డెవలప్‌ చేసింది. అలాగే ఫిల్మింగ్‌ ఎడిటింగ్‌ సిస్టమ్‌ను డిజైన్‌ చేసింది. అందుకు గాను 1998లో ఆస్కార్‌ అవార్డ్‌ను గెలుచుకుంది.  ఆ తర్వాత 1989లో కెనడియన్‌ ఫోన్‌ కంపెనీ అయిన రోజెర్స్‌ ఫోన్‌ మెసేజింగ్‌ కోసం స్పెషల్‌ గా డిజైన్‌ చేయబడిన తన మొబైల్‌ నెట్‌వర్క్‌లో పనిచేసేలా రిమ్‌(RIM)తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ఒప్పందం ద్వారా పేజర్ల తయారీ మొదలుపెట్టింది. 1996లో వాటర్లూ(ఒంటారియో) వేదికగా రిమ్‌ నుంచి పేజర్లు కలర్‌ ఫీచర్లతో రిలీజ్‌ అయ్యాయి.  

ఫోన్ల రాక.. 
బ్లాక్‌ బెర్రీ డివైజ్‌ 850 1999 నుంచి అధికారికంగా రిలీజ్‌ అయ్యింది.  2000 సంవత్సరంలో ఫిజికల్‌ బోర్డుతో కూడిన 957 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌ అయ్యింది.  2006లో ట్రాక్‌ బాల్‌ను అమర్చింది. బిజినెస్‌ ప్రొఫెషనల్స్‌ కోసం తీసుకొచ్చిన ఫోన్లు.. సాధారణ జనాలకు సైతం కిక్కు ఇచ్చింది. బ్లాక్‌ బెర్రీ అంటే.. ముందుగా వచ్చిన అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌ఫోన్‌ అనే ముద్ర పడింది. 2007లో కంపెనీ ఆదాయం అక్షరాల 3 బిలియన్‌ డాలర్లు దాటేసింది. బ్లాక్‌బెర్రీ సెల్ ఫోన్‌లు ఒకప్పుడు చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వాటిని "క్రాక్‌బెర్రీస్" అని పిలిచేవారు. కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్‌లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్‌.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి ఫోన్లు. అందులో నెట్‌ ఇన్‌కమ్‌ 631 మిలియన్‌ డాలర్లు. ఈ లోపు బ్లాక్‌బెర్రీ స్ఫూర్తితో యాపిల్‌ ఐఫోన్‌లను తీసుకొచ్చింది.  ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్‌ జాబ్స్‌ అంగీకరించడం విశేషం. పైగా ఇకపై బ్లాక్‌బెర్రీకి తాము గట్టి పోటీ ఇవ్వబోతున్నామంటూ ఆయన ప్రకటించాడు కూడా. కానీ, బ్లాక్‌బెర్రీ మాత్రం ఏనాడూ యాపిల్‌ను పోటీగా చూడలేదు. అదే కొంప ముంచింది. 



ఏడాదికో అప్‌డేట్‌ లేకపాయే!
2008లో రిలీజ్‌ అయిన  ఫ్లిప్‌ఫోన్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వెంటనే వచ్చిన టచ్‌ మోడల్‌ మాత్రం అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. అదే సమయంలో ఐఫోన్‌ అమ్మకాలు మొదలైనా ఖరీదు ఎక్కువ కావడంతో బ్లాక్‌బెర్రీ హవానే నడిచింది. అలా 2011 వరకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల డామినేషన్‌ కొనసాగింది.  అయితే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో వస్తున్న మార్పును పసిగట్టడంలో బ్లాక్‌బెర్రీ ఘోరంగా విఫలమైంది.  ఐఫోన్‌లో ప్రతీ ఏడాది ఓ అప్‌డేట్‌ రావడం, ఆపై మోటోరోలా అమ్మకాల సంచలనం కొనసాగడంతో బ్లాక్‌బెర్రీ పతనం చిన్నగా మొదలైంది. అదే సమయంలో టార్చ్‌, ప్లేబుక్‌ టాబ్లెట్‌ అంటూ ఇన్నోవేషన్లు చేసిందే తప్ప.. అప్‌డేట్‌కి ప్రయత్నించలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌ ఏవీ పెద్దగా అమ్ముడుపోలేదు. 


బోర్‌ కొట్టించాయి. 
సొంత యాప్‌ స్టోర్‌ బ్లాక్‌బెర్రీలో మరో ఫెయిల్యూర్‌ అంశం. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లా మ్యాజిక్‌ చేయలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. చిన్న చిన్న ఫీచర్లు తీసుకొచ్చేందుకు బోలెడంత సమయం తీసుకునేది. ఇదంతా యూజర్లకు విసుగు తెప్పించింది. తోటి పోటీదారులు  ఫ్రంట్‌ బ్యాక్‌ కెమెరాలంటూ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు తెస్తుంటే.. బ్లాక్‌బెర్రీ మాత్రం అక్కడే ఆగిపోయింది. దీంతో పతనం ఉధృతి పెరిగింది.  2009లో 20 శాతానికి పడిపోయిన బ్లాక్‌బెర్రీ మార్కెట్‌.. మూడేళ్లలో 5 శాతానికి పడిపోయింది. అయితే 2013లో టచ్‌ మోడల్స్‌ స్పెసిఫికేషన్స్‌ వచ్చినప్పటికీ.. అప్పటికే చాలా ఆలస్యమైంది. అదే ఏడాది రిమ్‌ అధికారికంగా బ్లాక్‌బెర్రీ అనే పేరును ప్రమోట్‌ చేసుకుంది. కానీ, ఆ వ్యూహం కూడా బెడిసి కొట్టింది.  కస్టమర్లు, యూజర్ల పట్ల నిజాయితీగా ఉందనుకునే తప్పా.. పతనాన్ని ఊహించలేదు. 2016 చివరి క్వార్టర్‌కు చేరుకునే సరికి.. 432 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లో అమ్ముడుపోయినవి కొన్నే. దీంతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ షేర్‌ సున్నాకు చేరింది.

చేతులు మారినా.. 
2015 నుంచి బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నిలిపివేసి.. సొంత ఓఎస్‌ ప్లేస్‌లో ఆండ్రాయిడ్‌ భాగస్వామిగా సాగుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ ఆవిష్కరణలో సంచలనాలకు నెలవైన బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌.. అనూహ్యంగా ఓనర్‌షిప్‌ నుంచి పక్కకు జరిగింది.   2016లో చైనీస్‌ కన్జూమర్‌ ఎలక్ట్రిక్ కంపెనీ టీసీఎల్‌.. బ్లాక్‌బెర్రీని కొనుగోలు చేసింది.  బ్లాక్‌బెర్రీ 10, బ్లాక్‌బెరర్రీ వోఎస్‌లతో పని చేసింది.  1999 నుంచి కెనెడియన్‌ కంపెనీ బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌ (RIM) ఆధ్వర్యంలో పని చేసి.. 2016 నుంచి బీబీ మెరాహ్‌ పుతిహ్‌(ఇండోనేషియా), ఒప్టిమస్‌ ఇన్‌ఫ్రాకమ్‌(ఇండియా), టీసీఎల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో నడిచింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీసీఎల్‌ కార్పొరేషన్‌ మాత్రమే  బ్లాక్‌బెర్రీ డెవలపర్‌గా ఉంది.  కస్టమైజ్డ్‌ ఆప్షన్స్‌, సెక్యూరిటీ ఫీచర్స్‌.. ఇలా ఎన్నో.. 2018లో రిలీజ్‌ అయ్యింది.

BlackBerry KeyOne అండ్ Key2 వంటి స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది టీసీఎల్‌. ఇక జనవరి 4, 2022 తేదీ నుంచి బ్లాక్‌బెర్రీ మోడల్స్‌ ఫోన్లలో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా నిలిపివేశాయి.  కానీ బ్లాక్‌బెర్రీ ఫోన్‌లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2021 నుంచి టెక్సాస్‌కు చెందిన స్టార్టప్‌ ఆన్‌వార్డ్‌మొబిలిటీ 5జీ బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ల లైసెన్స్‌ను చేజిక్కించుకుంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ నుంచి బ్లాక్‌బెర్రీ ఫోన్లు ఇంకా పూర్తిగా కనుమరుగు కాకపోయి ఉండొచ్చు.. కానీ, క్లాసిక్‌ టచ్‌తో వచ్చిన ఫోన్లు, ఫీచర్లు, సొంత సాఫ్ట్‌వేర్‌ మాత్రం ఇక కనిపించవు. బహుశా.. రాబోయే రోజుల్లో ఆ  పేరు కనుమరుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. బ్లాక్‌బెర్రీ నోస్టాల్జియా కేటగిరీలో చేరిపోవడం ఖాయం.

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement