న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదయ్యింది. అక్టోబర్‌లో అసలు వృద్ధిలేకపోగా –1.11 క్షీణరేటు నమోదయ్యింది. అంటే 2018 అక్టోబర్‌తో పోల్చిన 2019 అక్టోబర్‌లో ఎగుమతుల విలువ –1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం (–14.6 శాతం), తివాచీ (–17 శాతం), తోలు ఉత్పత్తులు (–7.6 శాతం), బియ్యం (–29.5 శాతం), తేయాకు (–6.16 శాతం)వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 18 క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. భారత్ ఎగుమతులు ఆగస్టులో –6 శాతం క్షీణతను నమోదుచేసుకుంటే, సెపె్టంబర్‌లో ఈ క్షీణ రేటు –6.57 శాతంగా ఉంది.
దిగుమతులూ మైనస్...
దిగుమతులు కూడా 16.31 శాతం పడిపోయాయి. విలువ రూపంలో 37.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ పరిమాణం 18 బిలియన్ డాలర్లు. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
- పసిడి దిగుమతులు 5 శాతం పడిపోయి 1.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- చమురు దిగుమతులు అక్టోబర్‌లో –31.74 శాతం క్షీణించి 9.63 బిలియన్ డాలర్లుగా నమోదయితే, చమురేతర దిగుమతులు –9.18 శాతం పడిపోయి 27.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఏడు నెలల్లోనూ నిరాశే...
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ చూస్తే, ఎగుమతులు 2.21 శాతం తగ్గి 185.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు – 8.37 శాతం క్షీణించి 280.67 బిలియన్ డాలర్లకు జారాయి. వెరసి వాణిజ్యలోటు 94.72 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ 116.15 బిలియన్ డాలర్లు.
సేవల రంగం ఇలా...
ఇక సేవల రంగానికి సంబంధించి అక్టోబర్ నెల గణాంకాలను కూడా ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసింది. సేవల ఎగుమతుల విలువ 17.22 బిలియన్ డాలర్లు ఉంటే, దిగుమతుల విలువ 10.92 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు గణాంకాలు తెలిపాయి.
తక్షణ వాణిజ్య విధానం అవసరం
జారుడుబల్లపై ఉన్న ఎగుమతుల పరిస్థితిని నిలువరించడానికి తక్షణం ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించాలని ఎగుమతిదారులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మందగమనానికి, డిమాండ్‌లో బలహీనతకు గణాంకాలు అద్దం పడుతున్నాయని భారత వాణిజ్యాభివృద్ధి మండలి చైర్మన్ మోహిత్ సింగ్లా పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య చీఫ్ శరద్ కుమార్ సరాఫ్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు, రక్షణాత్మక వాణిజ్య విధానాల ప్రభావం భారత్ ఎగుమతులపై కనబడుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment