న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు రెండేళ్ల తర్వాత అక్టోబర్‌లో క్షీణతను చవిచూశాయి. సమీక్షా నెల్లో అసలు వృద్ధిలేకపోగా 17 శాతం పడిపోయి (2021 ఇదే నెలతో పోల్చి) 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గ్లోబల్ డిమాండ్ పడిపోవడం దీనికి నేపథ్యం. ద్రవ్యోల్బణం,, కరెన్సీ విలువల్లో విపరీతమైన ఒడిదుడుకులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలూ భారత్ ఎగుమతులకు ప్రతికూలంగా నిలిచా యి.
ఇక ఇదే నెల్లో దిగుమతులు 6 శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం–వాణిజ్యలోటు 26.91 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..
►రత్నాలు–ఆభరణాలు (21.56%), ఇంజనీరింగ్ (21.26%), పెట్రోలియం ఉత్పత్తులు (11.28%), రెడీమేడ్ వస్త్రాలు–టెక్స్‌టైల్స్ ((21.16%), రసాయనాలు (16.44%), ఫార్మా (9.24%), సముద్ర ఉత్పత్తులు (10.83%), తోలు (5.84%) సహా కీలక ఎగుమతి రంగాలు అక్టోబర్‌లో ప్రతికూల
వృద్ధిని నమోదు చేశాయి.
►అయితే ఆయిల్ సీడ్స్, ఆయిల్‌మీల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, పొగాకు, టీ, బియ్యం ఎగుమతుల సానుకూల వృద్ధిని నమోదుచేశాయి.
►ఆర్థిక వృద్ధి, దేశీయ వినియోగం పెరగడం కూడా దిగుమతుల పురోగతికి దోహదపడుతోంది.
►మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లు 29.1 శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
►పసిడి దిగుమతుల విలువ 27.47 శాతం తగ్గి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది.
ఏప్రిల్–అక్టోబర్ మధ్య వృద్ధి 12.55 శాతం
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలూ (ఏప్రిల్–అక్టోబర్) మధ్య ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే కాలంలో 33.12 శాతం పెరిగి 436.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 173.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో వాణిజ్యలోటు 94.16 బిలియన్ డాలర్లు.
గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ లక్ష్యం 450 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సాధన కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment