వరుసగా మూడో నెలా క్షీణత నుంచి వృద్ధికి... | India exports rise 4. 82percent to 35. 45 billion dollers in September | Sakshi
Sakshi News home page

వరుసగా మూడో నెలా క్షీణత నుంచి వృద్ధికి...

Oct 15 2022 6:03 AM | Updated on Oct 15 2022 6:03 AM

India exports rise 4. 82percent to 35. 45 billion dollers in September - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వస్తు ఎగుమతుల తొలి, తుది లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో భారత్‌ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్‌ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దిగుమతులు 8.66 శాతం పెరిగి 61.61 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 26.16 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య క్షీణత
ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య భారత్‌ ఎగుమతులు వృద్ధిలేకపోగా 16.96 బిలియన్‌ డాలర్లు క్షీణించి 231.88 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 38.55 శాతం పెరిగి 380.34 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 148.46 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ విలువ 76.25 బిలియన్‌ డాలర్లు.  

కీలక రంగాలు నిరాశ
► ఇంజనీరింగ్‌ వస్తు ఎగుమతులు 10.85 శాతం క్షీణించి 8.4 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతులు కూడా 18 శాతం క్షీణించి బిలియన్‌ డాలర్లకు తగాయి.  
► ప్లాస్టిక్స్‌ కూడా ఇదే పరిస్థితి. 12.2 శాతం క్షీణతతో 660.66 మిలియన్‌ డాలర్లకు చేరాయి.  
► అయితే రత్నాలు–ఆభరణాలు, పెట్రోలియం ప్రొడక్టులు, తోలు, ఫార్మా, కెమికల్స్, బియ్యం ఎగుమతులు పెరిగాయి.  

 

దిగుమతులు ఇలా...
► ఆయిల్‌ దిగుమతులు 5.38 శాతం తగ్గి 15.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► పసిడి దిగుమతులు 24.62 శాతం పడిపోయి 3.9 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్‌ దిగుమతులు 60.82 శాతం పెరిగి 3.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  


సేవల రంగం ఎగుమతులు 19 శాతం అప్‌
ఇదిలావుండగా, సేవల రంగం ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 18.72 శాతం పెరిగి 25.65 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దిగుమతుల విలువ 20 శాతం పెరిగి 15.10 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య సేవల ఎగుమతులు 27.88 శాతం వృద్ధితో 150.43 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  

జూలై, ఆగస్లుల్లో సవరణలు ఇలా...
జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్‌ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్‌ డాలర్లు) తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది.  ఇక జూలైలో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్‌ డాలర్లుగా నమోదయినట్లు  మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి.

అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయని, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్‌ డాలర్ల దిగువకు పడిపోయాయని తొలి గణాంకాలు వెలువడ్డాయి. తాజా గణాంకాలు పరిస్థితిని ఆశాజనకంగా మార్చాయి. వరుసగా 22 నెలలూ ఎగుమతులు వృద్ధి బాటన నడిచినట్లయ్యింది.  

లక్ష్యం కష్టమేనా...
2021–22లో 400 బిలియన్‌ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం సాధన కష్టమేనన్న విశ్లేషణ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతాయన్న విశ్లేషణలే దీనికి కారణం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement