న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19 బిలియన్ డాలర్లకు ఎగశాయి. భారత్ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయి విలువను నమోదుచేయడం ఇదే తొలిసారి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.
భారీ వాణిజ్యలోటు...
ఇక సమీక్షా నెల్లో దిగుమతుల విలువ కూడా 26.55 శాతం ఎగసి 58.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 20.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ లోటు 15.29 బిలియన్ డాలర్లు. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► పెట్రోలియం ప్రొడక్టులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల రంగాల ఎగుమతులు మంచి పురోగతిని సాధించాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 15.38 శాతం ఎగసి 9.2 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం ప్రొడక్టుల విలువ భారీగా 113.21 శాతం పెరిగి 7.73 బిలియన్ డాలర్లకు చేరడం సానుకూల అంశం.
► కాగా, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2.11 శాతం క్షీణించి 3.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
► ఇక మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లును చూస్తే 81.21% పెరిగి 19.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 2021 ఏప్రిల్‌లో 2 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ తాజా సమీక్షా నెల్లో ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు ఎగసింది.
► అయితే పసిడి దిగుమతులు మాత్రం భారీగా 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
మరింత ఊపందుకుంటాయ్...
ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్‌ఐ స్కీమ్ సానుకూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి.
– ఏ శక్తివేల్, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్
ఎగుమతులు ‘రికార్డు’ శుభారంభం
Published Wed, May 4 2022 5:45 AM | Last Updated on Wed, May 4 2022 5:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment