ఎగుమతుల వాటా పెరుగుతున్నంత వరకూ దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ఎలాంటి వాణిజ్య అసమతుల్యత ఏర్పడడం లేదన్నారు. వాణిజ్యానికి, ఉత్పత్తుల రవాణాకు ప్రతిబంధకాలు సృష్టించే ధోరణులను ప్రపంచ దేశాలు నివారించాలని ఆయన పేర్కొన్నారు.
‘ప్రపంచమంతా 3–3.5 శాతం వృద్ధి చెందుతోంటే భారత ఎకానమీ 7 శాతం వృద్ధి సాధిస్తోంది. అలాంటప్పుడు భారత్‌లో వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దిగుమతులూ పెరుగుతాయి. అయితే, ఎగుమతుల్లో దిగుమతుల పాత్ర కూడా చాలా కీలకం. ఎగుమతుల్లో దిగుమతుల వాటాను (దిగుమతి చేసుకున్న వాటిని మరో రూపంలో ఎగుమతి చేయడం) మెరుగుపర్చుకుంటున్నంత వరకు మనం దిగుమతుల గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు‘ అని సునీల్ బరత్వాల్ చెప్పారు.
ఇదీ చదవండి: సినిమా చూసి భావోద్వేగానికి గురైన సింఘానియా
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఉత్పత్తుల ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 5.77 శాతం పెరిగి 416.93 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, సంపన్న దేశాల్లో వలసలు, మొబిలిటీ విషయంలో గందరగోళం నెలకొందని బరత్వాల్ తెలిపారు. భారతీయులు లేదా భారతీయ కంపెనీలు ఇతర దేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయా దేశాలకు ప్రొఫెషనల్స్ రాకపోకలు సాగించాల్సిన (మొబిలిటీ) అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరాటంకమైన మొబిలిటీకి వెసులుబాటు కల్పించాలని భారత్ అడుగుతోందే తప్ప వలసలను అనుమతించమని కోరడం లేదని బరత్వాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment