న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం ప్రాంతంలో అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను జనవరిలో భారత్ వస్తు ఎగుమతులు అధిగమించాయి. 2023 జనవరిలో పోలి్చతే 2024 జనవరిలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. విలువలో 36.92 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక రెండు నెలల క్షీణత అనంతరం జనవరిలో వస్తు దిగుమతులు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 17.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన తొమ్మిది నెలల్లో ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎర్ర సముద్రం సంక్షోభం ఎగుమతిదారులపై ప్రభావం చూపుతోంది. వారు తమ వస్తువులను యూరప్– ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు రవాణా చేయడానికి – ఆఫ్రికాను చుడుతూ కేప్ ఆఫ్ గాడ్ హోప్ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. దీనితో రవాణా వ్యయం తడిసి మోపెడవుతోంది. సరకు రవాణాలో 14 రోజుల ఆలస్యంతోపాటు బీమా వ్యయాలు కూడా పెరిగాయి. యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడుల కారణంగా ఎర్ర సముద్రం– మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రానికి కలిపే కీలకమైన షిప్పింగ్ మార్గం బాబ్–ఎల్–మండేబ్ జలసంధి చుట్టూ పరిస్థితి తీవ్రరూపం దాలి్చంది.
ముఖ్యాంశాలు...
► సమీక్షా నెల జనవరిలో క్రూడ్ ఆయిల్ దిగుమతులు 4.33 శాతం పెరిగి 16.56 బిలియన్ డాలర్లకు ఎగశాయి.
► పసిడి దిగుమతులు ఏకంగా 174 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
10 నెలల్లో క్షీణత
కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 10 నెలల కాలంలో ఎగుమతుల విలువ 4.89% క్షీణించి 353.92 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులు కూడా 6.71% పడిపోయి 561.12 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 207.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల విలువలో క్రూడ్ ఆయిల్ విలువ 15.91% పడిపోయి 146.75 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పసిడి దిగుమతులు 301.7% పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరాయి.
సేవలు..ఓకే
ఇదిలాఉండగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం జనవరిలో 32.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిపింది. 2023లో ఈ విలువ 28 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి జనవరి మధ్య ఈ విలువ 267.5 బిలియన్ డాలర్ల నుంచి 284.45 బిలియన్ డాలర్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment