అంతా తగ్గుదలే! | Trade deficit halves on dipping gold, silver imports | Sakshi
Sakshi News home page

అంతా తగ్గుదలే!

Published Wed, Feb 12 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

అంతా తగ్గుదలే!

అంతా తగ్గుదలే!

న్యూఢిల్లీ: జనవరిలో ఎగుమతి-దిగుమతుల రంగం మిశ్రమ ఫలితాలు చవిచూసింది. 2013లో ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో 3.79 శాతం వృద్ధి మాత్రమే నమోదయింది. అయితే బంగారం, వెండి దిగుమతుల తగ్గడం వల్ల ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం సానుకూల రీతిలో 9.92 బిలియన్ డాలర్లకు దిగింది.

 ఎగుమతుల్లో నిరాశ...
  జనవరిలో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగా ఉంది. 2013 అక్టోబర్ నుంచి ఎగుమతులు నిరాశాజనకంగా పడిపోతున్నాయి. అప్పట్లో ఎగుమతుల్లో 13.47 శాతం వృద్ధి నమోదుకాగా, నవంబర్‌లో 5.86 శాతం, డిసెంబర్‌లో 3.49 శాతం మాత్రమే వృద్ధి నమోదయింది. రత్నాలు- ఆభరణాలు, పెట్రోలియం వంటి ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం ఈ విభాగంపై ప్రభావం చూపినట్లు విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ అనుప్ పూజారి చెప్పారు. ఈ రెండు విభాగాల నుంచి ఎగుమతులు 2013 జనవరితో పోలిస్తే అసలు వృద్ధి లేకపోగా వరుసగా 13.1 శాతం, 9.39 శాతం చొప్పున క్షీణతను నమోదుచేశాయి.

 తగ్గిన దిగుమతులు...
 బంగారం, వెండి దిగుమతులు 2013 జనవరితో పోలిస్తే 77 శాతం పడిపోయి 7.49 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు సైతం 10.1 శాతం క్షీణించి 13.18 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ నియంత్రణల వల్ల ఏప్రిల్-జనవరి మధ్య ఈ రెండు విలువైన మెటల్స్ దిగుమతులు 37.8 శాతం క్షీణించి 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అంటే 2012 ఏప్రిల్-2013 జనవరి మధ్య ఈ విలువ 46.7 బిలియన్ డాలర్లు.

 కరెంట్ ఖాతా లోటు కట్టడి...
 వాణిజ్యలోటు తగ్గడం కరెంట్ ఖాతా లోటుకు (క్యాడ్) సానుకూలాంశం.  క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్-విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ వాణిజ్య రుణాలు  మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్. ఇదెంత ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకు అంత ప్రమాదం. రూపాయి విలువ కదలికలపై సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 50 బిలియన్ డాలర్ల లోపునకు తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement