ఎగుమతులు 11 వ‘సారీ’..
అక్టోబర్‌లో 17.5 శాతం క్షీణత
* 11 నెలల నుంచీ ఇదే ధోరణి
* దిగుమతులూ తగ్గుముఖం...
* ఎనిమిది నెలల కనిష్టానికి వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణ ధోరణి వరుసగా 11వ నెలా కొనసాగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2014 అక్టోబర్ ఎగుమతుల విలువతో పోల్చితే 2015 అక్టోబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 17.5 శాతం క్షీణించాయి.
విలువలో 25.89 బిలియన్ డాలర్ల నుంచి 21.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం దీనికి ప్రధాన కారణం.
దిగుమతులు చూస్తే...
ఇక ప్రధానంగా కమోడిటీ ధరల కనిష్ట స్థాయి, అలాగే దేశీయ మందగమన పరిస్థితులను దిగుమతులు ప్రతిబింబిస్తున్నాయి. ఈ రేటు 21 శాతం పడిపోయింది. విలువ 39.46 బిలియన్ డాలర్ల నుంచి 31.12 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ నెలలో చమురు దిగుమతులు 45.31 శాతం పడ్డాయి. విలువలో 6.84 బిలియన్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 10 శాతం క్షీణతతో 24.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాణిజ్యలోటు 8 నెలల కనిష్టం...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఫిబ్రవరి తరువాత ఇదే తొలిసారి.
ముఖ్య రంగాలు చూస్తే...
పెట్రోలియం ప్రొడక్టులు (-57 శాతం), ముడి ఇనుము (-85.5 శాతం), ఇంజనీరింగ్ (-11.65 శాతం) రత్నాలు, ఆభరణాలు (-12.84 శాతం) విభాగాల ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది.
బంగారం దిగుమతులూ తగ్గాయ్..
దేశ దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించే పసిడి దిగుమతులూ అక్టోబర్‌లో పడిపోయాయి. 59.5 శాతం క్షీణించాయి. విలువ 4.20 బిలియన్ డాలర్ల నుంచి 1.70 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి దోహదపడే అంశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దిగుమతుల విలువ భారీగా తగ్గడానికి పసిడి విలువ గణనీయంగా పడిపోవడం కారణం.
ఏడు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) ఎగుమతులు 18% క్షీణించాయి. విలువ 154 బిలియన్ డాలర్లు. దిగుమతులు సైతం 15% తగ్గి 232 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్య లోటు 77 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడు నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 42% పడిపోయి 95 బిలియన్ డాలర్ల నుంచి 55 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
లక్ష్యం కష్టమే...
గతేడాది దేశం 310 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అయితే ఈ ఏడాది 300 బిలియన్ డాలర్లనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ధోరణుల వల్ల ఈ లక్ష్య సాధన కూడా కష్టమేనని ఎగుమతుల సంస్థ... ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్ ఎస్‌సీ రెల్హాన్ అన్నారు.