ఎగుమతుల మందగమనం
డిసెంబర్: భారత ఎగుమతుల వృద్ధి వేగం తగ్గింది. డిసెంబర్‌లో ఈ రేటు కేవలం 3.49%గా నమోదయ్యింది. ఇది 6 నెలల కనిష్ట స్థాయి. విలువ పరంగా చూస్తే డిసెంబర్‌లో ఎగుమతులు విలువ 26.34 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు పడిపోవడం మొత్తం వృద్ధి స్పీడ్ తగ్గడానికి కారణమని వాణిజ్య కార్యదర్శి ఎస్‌ఆర్ రావు తెలిపారు. 2012 డిసెంబర్‌లో ఎగుమతుల విలువ 25.45 బిలియన్ డాలర్లు.
దిగుమతులు ఇలా..
ఇక డిసెంబర్ నెలలో దిగుమతులు 15.25% పడిపోయాయి. 2012 డిసెంబర్‌లో ఎగుమతుల విలువ 43.05 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ 2013 డిసెంబర్‌లో 36.48 బిలియన్ డాలర్లు.
వాణిజ్యలోటు
మొత్తంగా ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు డిసెంబర్‌లో 10.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2012 ఇదే నెలలో ఈ లోటు 17.6 బిలియన్ డాలర్లు.
బంగారం, వెండి ఎఫెక్ట్
దిగుమతులు భారీగా తగ్గడం, దీనితో వాణిజ్యలోటు తగ్గడం వంటి అంశాలపై బంగారం, వెండి మెటల్స్ ప్రభావం పడింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి దిగుమతి సుంకాల పెంపుసహా ప్రభుత్వం కొనసాగిస్తున్న పలు కఠిన చర్యల నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులు డిసెంబర్‌లో కేవలం 1.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2012 ఇదే నెలలో ఈ విలువ 5.6 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఈ దిగుమతుల రేటు 69 శాతం పడిపోయిందన్నమాట. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలాన్ని చూస్తే బంగారం, వెండి దిగుమతుల విలువ 30 శాతానికి పైగా పడిపోయాయి. 2012 ఇదే కాలంలో ఈ విలువ 39.2 బిలియన్ డాలర్లయితే 2013 ఇదే నెలల్లో ఈ విలువ 27.3 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఇక చమురు దిగుమతులు 1.1 శాతం వృద్ధితో 13.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
9 నెలల్లో: కాగా ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎగుమతులు 5.94 శాతం వృద్ధితో 217
బిలియన్ డాలర్ల నుంచి 230 డాలర్లకు పెరిగాయి. దిగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.55 శాతం క్షీణత(-)తో 364 బిలియన్ డాలర్ల నుంచి 340.37 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొమ్మిది నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 2.6శాతం పెరుగుదలతో 124.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు రహిత వస్తువుల దిగుమతుల విలువ 11.1శాతం పడిపోయి 215.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం (2012-13) మొత్తంలో దేశం మొత్తం ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 491 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190 బిలియన్ డాలర్లు. 2013-14లో భారత్ ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు.