silver imports
-
17 శాతం తగ్గిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022–23, ఏప్రిల్–అక్టోబర్) 17.38 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్ డాలర్లు. దేశీయంగా డిమాండ్ తగ్గడం దీనికి కారణం. ఒక్క అక్టోబర్ నెలను తీసుకున్నా, దిగుమతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ దాదాపు వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–అక్టోబర్ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతులు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది. వెండి దిగుమతులు అప్... ఇక వెండి దిగుమతులు అక్టోబర్లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021–22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్ అకౌంట్కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్ అకౌంట్’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది. -
అంతా తగ్గుదలే!
న్యూఢిల్లీ: జనవరిలో ఎగుమతి-దిగుమతుల రంగం మిశ్రమ ఫలితాలు చవిచూసింది. 2013లో ఇదే నెలతో పోలిస్తే ఎగుమతుల్లో 3.79 శాతం వృద్ధి మాత్రమే నమోదయింది. అయితే బంగారం, వెండి దిగుమతుల తగ్గడం వల్ల ఎగుమతులు-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం సానుకూల రీతిలో 9.92 బిలియన్ డాలర్లకు దిగింది. ఎగుమతుల్లో నిరాశ... జనవరిలో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగా ఉంది. 2013 అక్టోబర్ నుంచి ఎగుమతులు నిరాశాజనకంగా పడిపోతున్నాయి. అప్పట్లో ఎగుమతుల్లో 13.47 శాతం వృద్ధి నమోదుకాగా, నవంబర్లో 5.86 శాతం, డిసెంబర్లో 3.49 శాతం మాత్రమే వృద్ధి నమోదయింది. రత్నాలు- ఆభరణాలు, పెట్రోలియం వంటి ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గడం ఈ విభాగంపై ప్రభావం చూపినట్లు విదేశీ వాణిజ్య డెరైక్టర్ జనరల్ అనుప్ పూజారి చెప్పారు. ఈ రెండు విభాగాల నుంచి ఎగుమతులు 2013 జనవరితో పోలిస్తే అసలు వృద్ధి లేకపోగా వరుసగా 13.1 శాతం, 9.39 శాతం చొప్పున క్షీణతను నమోదుచేశాయి. తగ్గిన దిగుమతులు... బంగారం, వెండి దిగుమతులు 2013 జనవరితో పోలిస్తే 77 శాతం పడిపోయి 7.49 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు సైతం 10.1 శాతం క్షీణించి 13.18 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రభుత్వ నియంత్రణల వల్ల ఏప్రిల్-జనవరి మధ్య ఈ రెండు విలువైన మెటల్స్ దిగుమతులు 37.8 శాతం క్షీణించి 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అంటే 2012 ఏప్రిల్-2013 జనవరి మధ్య ఈ విలువ 46.7 బిలియన్ డాలర్లు. కరెంట్ ఖాతా లోటు కట్టడి... వాణిజ్యలోటు తగ్గడం కరెంట్ ఖాతా లోటుకు (క్యాడ్) సానుకూలాంశం. క్యాపిటల్ ఇన్ఫ్లోస్-విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ వాణిజ్య రుణాలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య ఉన్న వ్యత్యాసమే క్యాడ్. ఇదెంత ఎక్కువైతే ఆర్థిక వ్యవస్థకు అంత ప్రమాదం. రూపాయి విలువ కదలికలపై సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో ఈ రేటు 4.8 శాతం (88.2 బిలియన్ డాలర్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 3.7 శాతానికి అంటే దాదాపు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని తొలుత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఇది 50 బిలియన్ డాలర్ల లోపునకు తగ్గుతుందని (జీడీపీలో 3 శాతం వరకూ) భావిస్తోంది. -
ఎగుమతుల మందగమనం
డిసెంబర్: భారత ఎగుమతుల వృద్ధి వేగం తగ్గింది. డిసెంబర్లో ఈ రేటు కేవలం 3.49%గా నమోదయ్యింది. ఇది 6 నెలల కనిష్ట స్థాయి. విలువ పరంగా చూస్తే డిసెంబర్లో ఎగుమతులు విలువ 26.34 బిలియన్ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు పడిపోవడం మొత్తం వృద్ధి స్పీడ్ తగ్గడానికి కారణమని వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు తెలిపారు. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 25.45 బిలియన్ డాలర్లు. దిగుమతులు ఇలా.. ఇక డిసెంబర్ నెలలో దిగుమతులు 15.25% పడిపోయాయి. 2012 డిసెంబర్లో ఎగుమతుల విలువ 43.05 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ 2013 డిసెంబర్లో 36.48 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు మొత్తంగా ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసం వాణిజ్యలోటు డిసెంబర్లో 10.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2012 ఇదే నెలలో ఈ లోటు 17.6 బిలియన్ డాలర్లు. బంగారం, వెండి ఎఫెక్ట్ దిగుమతులు భారీగా తగ్గడం, దీనితో వాణిజ్యలోటు తగ్గడం వంటి అంశాలపై బంగారం, వెండి మెటల్స్ ప్రభావం పడింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడికి దిగుమతి సుంకాల పెంపుసహా ప్రభుత్వం కొనసాగిస్తున్న పలు కఠిన చర్యల నేపథ్యంలో బంగారం, వెండి దిగుమతులు డిసెంబర్లో కేవలం 1.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2012 ఇదే నెలలో ఈ విలువ 5.6 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఈ దిగుమతుల రేటు 69 శాతం పడిపోయిందన్నమాట. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలాన్ని చూస్తే బంగారం, వెండి దిగుమతుల విలువ 30 శాతానికి పైగా పడిపోయాయి. 2012 ఇదే కాలంలో ఈ విలువ 39.2 బిలియన్ డాలర్లయితే 2013 ఇదే నెలల్లో ఈ విలువ 27.3 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఇక చమురు దిగుమతులు 1.1 శాతం వృద్ధితో 13.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 9 నెలల్లో: కాగా ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో ఎగుమతులు 5.94 శాతం వృద్ధితో 217 బిలియన్ డాలర్ల నుంచి 230 డాలర్లకు పెరిగాయి. దిగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.55 శాతం క్షీణత(-)తో 364 బిలియన్ డాలర్ల నుంచి 340.37 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఈ కాలంలో వాణిజ్యలోటు 110 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. తొమ్మిది నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 2.6శాతం పెరుగుదలతో 124.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు రహిత వస్తువుల దిగుమతుల విలువ 11.1శాతం పడిపోయి 215.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం (2012-13) మొత్తంలో దేశం మొత్తం ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 491 బిలియన్ డాలర్లు. వాణిజ్యలోటు 190 బిలియన్ డాలర్లు. 2013-14లో భారత్ ఎగుమతుల లక్ష్యం 325 బిలియన్ డాలర్లు. -
ఎగుమతులు ఓకే..
న్యూఢిల్లీ: గతకొన్ని నెలలుగా కుంటుపడిన దేశ ఎగుమతులు అకస్మాత్తుగా వృద్ధిబాటలోకి వచ్చాయి. ఒకపక్క ఆర్థికవ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ... జూలైలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.64 శాతం ఎగబాకాయి. రెండేళ్లలో ఇదే అత్యధిక స్థాయి వృద్ధిరేటు కావడం గమనార్హం. మొత్తంమీద గత నెలలో 25.83 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2011 సెప్టెంబర్ నెలలో 35 శాతం ఎగుమతుల వృద్ధి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఏడాది మే(-1.1%), జూన్(-4.6%) నెలల్లో ఎగుమతులు తిరోగమనంలో కొనసాగడం తెలిసిందే. తగ్గిన దిగుమతులు...: ఇక జూలై నెలలో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.2 శాతం తగ్గి 38.1 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం(వాణిజ్య లోటు) జూన్లో మాదిరిగానే 12.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు శాంతించడంతో వాణిజ్యలోటు ఎగబాకకుండా అడ్డుకట్టపడేందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది జూలైలో 4.4 బిలియన్ డాలర్ల విలువైన పసిడి, వెండి దిగుమతికాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 34 శాతం తగ్గి 2.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే ఈ ఏడాది జూన్లో 2.4 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోలిస్తే జూలై పెరగడం గమనార్హం. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనకరంగా ఎగబాకుతున్న నేపథ్యంలో పుత్తడి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచగా... ఆర్బీఐ కూడా నియంత్రణ చర్యలను తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక కనిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బంగారం, ముడిచమురు దిగుమతుల జోరే దీనికి ప్రధానకారణంగా నిలిచింది. మరోపక్క, అధిక క్యాడ్, వాణిజ్యలోటు ప్రభావంతో డాలరుతో రూపాయి విలువ కూడా రోజుకో కొత్త కనిష్టాలకు పడిపోతోంది. తాజాగా 61.80 స్థాయిని తాకింది కూడా.ఏప్రిల్-జూలైలోనూ...: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై.. 4 నెలల వ్యవధిలోకూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1.72% పెరిగి 98.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 2.82 శాతం తగ్గాయి. 160.7 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. వాణిజ్యలోటు 62.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరింత పుంజుకుంటాయ్: రావు ఎగుమతుల పెంపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహకాలు త్వరలోనే ఫలితాలిస్తాయని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వడ్డీ సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలవల్ల రానున్న నెలల్లో ఎగుమతులు మరింత పుంజుకోనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాన్, దూర ప్రాచ్య దేశాలకు ఎగుమతులు మెరుగుపడుతుండటం దీనికి ఆసరాగా నిలవనుందన్నారు. గతేడాది 300.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వం ఈ ఏడాదిలో 10 శాతం ఎగుమతుల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.