ఎగుమతులు ఓకే..
ఎగుమతులు ఓకే..
Published Tue, Aug 13 2013 1:16 AM | Last Updated on Thu, Aug 2 2018 4:31 PM
న్యూఢిల్లీ: గతకొన్ని నెలలుగా కుంటుపడిన దేశ ఎగుమతులు అకస్మాత్తుగా వృద్ధిబాటలోకి వచ్చాయి. ఒకపక్క ఆర్థికవ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ... జూలైలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.64 శాతం ఎగబాకాయి. రెండేళ్లలో ఇదే అత్యధిక స్థాయి వృద్ధిరేటు కావడం గమనార్హం. మొత్తంమీద గత నెలలో 25.83 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2011 సెప్టెంబర్ నెలలో 35 శాతం ఎగుమతుల వృద్ధి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఏడాది మే(-1.1%), జూన్(-4.6%) నెలల్లో ఎగుమతులు తిరోగమనంలో కొనసాగడం తెలిసిందే.
తగ్గిన దిగుమతులు...: ఇక జూలై నెలలో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.2 శాతం తగ్గి 38.1 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి.
ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం(వాణిజ్య లోటు) జూన్‌లో మాదిరిగానే 12.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా బంగారం, వెండి దిగుమతులు శాంతించడంతో వాణిజ్యలోటు ఎగబాకకుండా అడ్డుకట్టపడేందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది జూలైలో 4.4 బిలియన్ డాలర్ల విలువైన పసిడి, వెండి దిగుమతికాగా.. ఈ ఏడాది ఇదే నెలలో 34 శాతం తగ్గి 2.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే ఈ ఏడాది జూన్‌లో 2.4 బిలియన్ డాలర్ల దిగుమతులతో పోలిస్తే జూలై పెరగడం గమనార్హం. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనకరంగా ఎగబాకుతున్న నేపథ్యంలో పుత్తడి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచగా... ఆర్‌బీఐ కూడా నియంత్రణ చర్యలను తీసుకున్న సంగతి తెలిసిందే.
గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక కనిష్టానికి(4.8%) ఎగబాకడం విదితమే. బంగారం, ముడిచమురు దిగుమతుల జోరే దీనికి ప్రధానకారణంగా నిలిచింది. మరోపక్క, అధిక క్యాడ్, వాణిజ్యలోటు ప్రభావంతో డాలరుతో రూపాయి విలువ కూడా రోజుకో కొత్త కనిష్టాలకు పడిపోతోంది. తాజాగా 61.80 స్థాయిని తాకింది కూడా.ఏప్రిల్-జూలైలోనూ...: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై.. 4 నెలల వ్యవధిలోకూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1.72% పెరిగి 98.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక దిగుమతులు 2.82 శాతం తగ్గాయి. 160.7 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. వాణిజ్యలోటు 62.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
మరింత పుంజుకుంటాయ్: రావు
ఎగుమతుల పెంపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రోత్సాహకాలు త్వరలోనే ఫలితాలిస్తాయని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వడ్డీ సబ్సిడీ పెంపు వంటి నిర్ణయాలవల్ల రానున్న నెలల్లో ఎగుమతులు మరింత పుంజుకోనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాన్, దూర ప్రాచ్య దేశాలకు ఎగుమతులు మెరుగుపడుతుండటం దీనికి ఆసరాగా నిలవనుందన్నారు. గతేడాది 300.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతులు కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వం ఈ ఏడాదిలో 10 శాతం ఎగుమతుల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
Advertisement
Advertisement