petroleum products
-
పెట్రోలియం దిగుమతులకు చెక్!
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్‌ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు. మెథనాల్‌తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు. 2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్‌తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం. -
జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..
న్యూఢిల్లీ: రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొవిజన్ ఇప్పటికే ఉందని బుధవారం వివరించారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ సభ్యులతో బడ్జెట్ అనంతర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం ముడి పెట్రోలియం, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనాలను తాత్కాలికంగా జీఎస్టీ నుంచి మినహాయించారు. వాటిని ఎప్పటి నుంచి ఈ పరిధిలోకి తేవాలనేది జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. 2023 ఫిబ్రవరి 18న జీఎస్టీ మండలి 49వ సమావేశం జరగనుంది. ఒకవేళ మొత్తం మండలి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏ రేటు వర్తింపచేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. రేటును నిర్ధారించి తనకు తెలియజేస్తే పెట్రోలియం ఉత్పత్తులను సత్వరం జీఎస్టీ పరిధిలోకి చేర్చగలమన్నారు. మరోవైపు, వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్రం గత మూడు–నాలుగేళ్లుగా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచుతూనే ఉందని మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు స్కీమును, విద్యుత్ తదితర రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోందన్నారు. (ఇదీ చదవండి: ఈవీ జోరుకు భారత్ రెడీ.. ప్లాంటు యోచనలో వోల్వో!) -
పెట్రో ప్రొడక్టులకు డిమాండ్
న్యూఢిల్లీ: ఈ క్యాలండర్ ఏడాది(2022)లో దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ కనిపించనున్నట్లు చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల(ఒపెక్) నెలవారీ నివేదిక పేర్కొంది. పెట్రోల్, డీజిల్ తదితరాల డిమాండులో 7.73 శాతం వృద్ధి కనిపించనున్నట్లు అంచనా వేసింది. వెరసి 2021లో నమోదైన రోజుకి 4.77 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ) నుంచి 5.14 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)కు డిమాండు పుంజుకోనున్నట్లు తెలియజేసింది. ఇది అంతర్జాతీయంగా రికార్డ్‌కాగా.. చైనా డిమాండుతో పోలిస్తే 1.23 శాతం, యూఎస్‌కంటే 3.39 శాతం, యూరప్కంటే 4.62 శాతం అధికమని నివేదిక తెలియజేసింది. అయితే 2023లో దేశీ డిమాండు 4.67 శాతం వృద్ధితో 5.38 శాతానికి చేరనున్నట్లు అంచనా వేసింది. ఇది చైనా అంచనా వృద్ధి 4.86 శాతంతో పోలిస్తే తక్కువకావడం గమనార్హం! ప్రపంచంలోనే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకోవడంతోపాటు.. వినియోగిస్తున్న దేశాల జాబితాలో అమెరికా, చైనా తదుపరి ఇండియా మూడో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వృద్ధి అండ పటిష్ట వృద్ధి(7.1 శాతం)ని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థ దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టుల డిమాండుకు దన్నునివ్వనున్నట్లు ఒపెక్ నివేదిక పేర్కొంది. కా గా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో రుతుపవనాల కారణంగా చమురుకు డిమాండ్ మందగించే వీలున్నదని, అయినప్పటికీ తదుపరి పండుగల సీజన్‌తో ఊపందుకోనున్నట్లు వివరించింది. ఇటీవల పరిస్థితులు (ట్రెండ్) ఆధారంగా ఈ ఏడాది ద్వితీయార్థం డిమాండులో డీజిల్, జెట్ కిరోసిన్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. కోవిడ్–19 ప్రభావంతో వీటికి గత కొంతకాలంగా డిమాండు క్షీణించిన విషయం విదితమే. -
పెట్రోల్ ‘ట్యాంక్’ ఖాళీ అవుతోంది!.. క్రూడాయిల్ లెక్కలివీ..
పెట్రోల్.. డీజిల్.. ఇవి లేనిదే బండి కదలదు.. మనుషుల బతుకూ కదలదు.. రేటు పెరిగిందంటే కలకలమే. పొద్దున ఇంటికొచ్చే పాల ప్యాకెట్ నుంచి విమాన ప్రయాణం దాకా అన్నీ ఖరీదవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికైతే బిల్లు గుండె గుభేలుమనిపిస్తుంటుంది. ఇటీవలే మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడం, కేంద్రం కాస్త తగ్గించాక ఉపశమనం ఫీలవడం అందరికీ తెలిసిందే. మరోవైపు ప్రపంచంలో చమురు నిక్షేపాలు అడుగంటుతూ ఆందోళన రేపుతున్నాయి. అసలు పెట్రోల్, డీజిల్ ఎలా వస్తుంది? ఎక్కడ ఎక్కువగా నిల్వలున్నాయి? అసలు ధర ఎంత? మనకు చేరేది ఎంతకనే వివరాలు తెలుసుకుందాం.. లక్షల ఏళ్ల కింద సముద్రం అడుగున కూరుకుపోయిన జంతు, వృక్ష అవశేషాలు.. విపరీతమైన ఉష్ణోగ్రత, ఒత్తిడి కారణంగా ముడి చమురుగా మారాయి. శిలాజాల నుంచి వచ్చే ఇంధనం కాబట్టి శిలాజ ఇంధనమని పిలుస్తారు. కొన్నిచోట్ల నేచురల్ గ్యాస్ రూపంలోనూ ఉంటాయి. విచ్చలవిడిగా తోడేస్తుండటంతో ముడి చమురు వనరులు తగ్గిపోతున్నాయి. ఇలాగే కొన సాగితే మరో 47 ఏళ్లలో భూమ్మీ ద పెట్రోలియం నిల్వలు ఖాళీ అయిపోతాయని అంచనా. వేల ఏళ్ల నుంచీ వినియోగం యూరప్, అమెరికా, మధ్యాసి యా, చైనా తదితర దేశాల్లో వేల ఏళ్ల కిందటి నుంచీ చమురు విని యోగం ఉంది. భూమి పొరల్లో పగుళ్ల నుంచి పైకి ఉబికి వచ్చే చమురును వివిధ అవసరాలకు వాడేవారు. 1850 సంవత్సరంలో ముడి చమురు నుంచి కిరోసిన్, పెట్రోల్ వంటి ఇంధనాలు, కందెన (లూబ్రికెంట్)ను వేరు చేసే పద్ధతులను కనిపెట్టడంతో.. వినియోగం పెరిగిపోయింది. కిరోసిన్, పె ట్రోల్‌తో నడిచే వాహనాలు వచ్చాయి. వీధి లైట్లు వెలిగించడం, పరిశ్రమల్లో వినియోగించడం మొదలైంది. తర్వాత అసలు పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మానవ మనుగడే ముందుకు కదలనంత గా మారిపోయింది. అంతర్జాతీయంగా ఏదైనా స మస్య ఏర్పడినా,దేశాల మధ్య యుద్ధం వచ్చినా చమురు ధరలకు రెక్కలు రావడం.. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైనే ఆధారపడిన ఇండియా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రూడాయిల్ లెక్కలివీ.. ►ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన చమురు నిక్షేపాలు: 1,65,058 కోట్ల బ్యారెళ్లు ►వెనెజువెలా 18.2శాతం నిక్షేపాలతో టాప్‌లో ఉండగా.. సౌదీ (16.2%), కెనడా (10.4%), ఇరాన్ (9.5%), ఇరాక్ (8.7%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ►ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ఉత్పత్తి జరుగుతున్న దేశాలు: 127 ►మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో ఒక్క అమెరికా వాటా: 20.3% ►టాప్–10 దేశాలు వాడేస్తున్న క్రూడాయిల్: 60 శాతం ►ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలిపి 50 వేలకుపైగా చమురు బావులు ఉన్నా యి. అందులో 2–3 వేల బావుల్లోనే 95%పైగా చమురు నిక్షేపాలు ఉన్నాయి. ముడి చమురు ధరల లెక్క ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎడారులు, తీర ప్రాంతాల్లో, తీరానికి కాస్త దూరంగా సముద్రతలం దిగువన (డీప్ వాటర్) ముడి చమురు నిక్షేపాలను గుర్తించారు. ఇందులోనూ నేరుగా భారీగా ఉండే చమురు రిజర్వాయర్లు కొన్నికాగా.. రాతిపొరల మధ్య ఉండే (షేల్) నిక్షేపాలు మరికొన్ని. సౌదీ వంటి దేశాల్లో ఎడారుల్లో భారీ నిక్షేపాలు ఉన్నాయి. దానితో ఉత్పత్తి ధర తక్కువ. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, యూరప్ దేశాల్లో తీరప్రాంతాలకు కాస్త దూరంగా సముద్రతలం దిగువన నిక్షేపాలు ఉన్నాయి. వాటిని వెలికితీయడం కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఇక షేల్ నిక్షేపాల నుంచి చమురు తీయడానికి మరింత వ్యయం అవుతుంది. ఉత్పత్తి ఖర్చు ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ను బట్టి ముడి చమురు ధరలు ఆధారపడి ఉంటాయి. ►సగటున చూస్తే సౌదీలో ఒక్కో బ్యారెల్ ముడి చమురు ఉత్పత్తికి కేవలం 3డాలర్లు (సుమారు రూ.230) ఖర్చయితే.. గల్ఫ్ దేశాలు, రష్యా, పలు ఆఫ్రికా దేశాల్లో సగటున 15డాలర్ల (రూ.1,160) వరకు, అమెరికా–యూరప్ దేశాల్లో 50–60 డాలర్ల (రూ. 3,800–రూ.4,600) వరకు ఖర్చవుతుంది. ►ప్రస్తుతం మార్కెట్లో బ్యారెల్ ధర సుమారు 113 డాలర్ల (రూ.8,773) వద్ద ఉంది. ►చమురును శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులకు వేర్వేరు ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. ►క్రూడాయిల్‌ను భారీగా ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలు చాలా వరకు సొంతంగా వినియోగించుకుంటున్నాయి. అదే కేవలం ఎగుమతులను బట్టి చూస్తే.. ప్రపంచంలో సౌదీ అరేబియా టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో రష్యా, ఇరాక్, కెనడా, అమెరికా, నైజీరియా, కువైట్, బ్రెజిల్, కజకిస్థాన్, నార్వే ఉన్నాయి. దేశంలో సగానికిపైగా పన్నులే.. మన దేశంలో పెట్రోల్, డీజిల్‌ల రీటైల్ ధరల్లో సగానికిపైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే కావడం గమనార్హం. కేంద్ర పన్ను దేశవ్యాప్తంగా ఒకేలా ఉండగా, ఆయా రాష్ట్రాల్లో పన్నులు వేర్వేరుగా ఉన్నాయి. కొద్దిరోజులుగా క్రూడాయిల్ ధరలను బట్టి చూస్తే పెట్రోల్, డీజిల్‌ల మూల ధర సగటున సుమారు రూ.49–రూ.52 మాత్రమే. కానీ కేంద్ర, రాష్ట్రాల పన్నులు కలిపి పెట్రోల్ ధర రూ.96 నుంచి రూ.112 మధ్య.. డీజిల్ ధర రూ.87 నుంచి రూ.99 మధ్య ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర, పన్నులు ►లీటర్ పెట్రోల్ మూల ధర: రూ.49.2 ►కేంద్ర పన్నులు: రూ.28 ►డీలర్ల కమీషన్: రూ.5.45 ►రాష్ట్ర పన్నులు: రూ.26.95 ►మొత్తంగా రీటైల్ ధర: రూ.109.7 ( మే 25 నుంచి జూన్ 3 వరకు సగటు ధరల ఆధారంగా లెక్కించారు. రవాణా వ్యయం, ఇతర అంశాల ఆధారంగా స్థానికంగా ధర మారుతుంది.) ఇండియా ఎక్కడ? ►ఇప్పటివరకు గుర్తించిన మొత్తం చమురు నిల్వలు: 472.9 కోట్ల బ్యారెళ్లు ►ప్రపంచ క్రూడాయిల్ నిల్వల్లో శాతం: 0.29 ►ఉత్పత్తిలో ర్యాంకు: 20 ►దేశంలో రోజువారీ ఉత్పత్తి: 10.16 లక్షల బ్యారెళ్లు ►రోజువారీ వినియోగం: 44.43 లక్షల బ్యారెళ్లు ►దిగుమతి చేసుకోకుండా ఇండియాలోని చమురు వనరులను మొత్తం వాడేస్తే.. కేవలం మూడేళ్లలో ఖాళీ అయిపోతాయని అంచనా. చరిత్ర ఇదీ ► ప్రపంచంలో మొదటగా చైనీయులు పెట్రోలియంను ఇంధనంగా ఉపయోగించారు. ► క్రీస్తుశకం 347వ సంవత్సరంలోనే చైనాలో చమురు బావులు తవ్వినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. ►ప్రపంచంలో వాణిజ్యపరంగా 1837లో తొలి క్రూడాయిల్ రిఫైనరీని అజర్బైజాన్లో ప్రారంభించారు. అక్కడే 1846లో తొలి చమురు బావిని తవ్వారు. ►అమెరికాలో 1859లో తొలి అధునాతన ఆయిల్ బోర్వెల్ను తవ్వారు. ముడి చమురు నుంచి ఏమేం వస్తాయి? క్రూడాయిల్‌ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారె ల్ అంటే దాదాపు 159 లీటర్లు (42 గ్యాలన్లు). దీని నుంచి 73 లీటర్ల పెట్రోల్, 35 లీటర్ల వరకు డీజిల్, 15.5 లీటర్ల మేర జెట్ ఫ్యూయల్, ఒక లీటర్ కిరోసిన్ వస్తాయి. మరో 42 లీటర్ల మేర హెవీ ఫ్యూయల్ ఆయిల్స్, లూబ్రికెంట్స్, స్టిల్ గ్యాస్, ఆస్ఫాల్ట్, కోక్ వంటి ఇతర ఉత్పత్తులు వెలువడతాయి. ►ప్రస్తుతం మన కరెన్సీలో ఒక లీటర్ క్రూడాయిల్ ధర సుమారు రూ.78కాగా.. శుద్ధి చేసిన అనంతరం వెలువడే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.49, డీజిల్ ధర రూ.52 వరకు ఉంటుంది. ►పెట్రోల్, డీజిల్ రెండూ నీళ్లలా పారదర్శకంగా ఉంటాయి. వాటిని సరిగా గుర్తించేందుకు రంగులు కలుపుతారు. ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌లో నీలం–ఆకుపచ్చ కలిసిన రంగును.. డీజిల్‌లో నారింజ రంగును కలుపుతాయి. హైపవర్, ప్రీమియం వంటి పెట్రోల్‌కు పసుపు రంగును కలుపుతుంటారు. ఖాళీ అయితే ఎలా? ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా మన జీవితాన్ని ఊహించలేం. ఇంట్లో వంట చేసుకునే ఎల్పీజీ నుంచి.. బైకులు, కార్లు, బస్సులు, నౌకలు, విమానాలకు ఇంధనం దాకా.. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ వంటి ఎన్నో ఉత్పత్తులకు చమురే ఆధారం. మరి భూమిపై చమురు నిక్షేపాలన్నీ ఉన్నట్టుండి ఖాళీ అయితే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవడానికే భయం గొలుపుతుంది. అందుకే శా స్త్రవేత్తలు సౌర, పవన, ఇతర ప్రత్యా మ్నాయ విద్యుదుత్పత్తిపై, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై దృష్టిపెట్టారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ వసూళ్లు 48 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 48 శాతం ఎగిసింది. ఏప్రిల్–జులై మధ్య కాలంలో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ. 1 లక్ష కోట్లు పైగా వసూలయ్యాయి. గత ఆరి్థక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైనది రూ. 67,895 కోట్లు. తొలి నాలుగు నెలల్లో అదనంగా వచి్చన రూ. 32,492 కోట్లు .. పూర్తి ఆరి్థక సంవత్సరంలో చమురు బాండ్లకు ప్రభుత్వం కట్టాల్సిన రూ. 10,000 కోట్ల కన్నా మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సింహ భాగం వసూళ్లు పెట్రోల్, డీజిల్‌పై సుంకాల ద్వారానే నమోదయ్యాయి. ఎకానమీ కోలుకునే కొద్దీ అమ్మకాలు మరింత పెరిగితే గత ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే ఈసారి వసూళ్లు అదనంగా రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సబ్సిడీ ధరపై వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ మొదలైనవి విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు వచి్చన నష్టాలను భర్తీ చేసేందుకు గత యూపీఏ ప్రభుత్వం వాటికి రూ. 1.34 లక్షల కోట్ల విలువ చేసే బాండ్లను జారీ చేసింది. ఆరి్థక శాఖ వర్గాల ప్రకారం వీటికి సంబంధించి ఈ ఆరి్థక సంవత్సరం రూ. 10,000 కోట్లు కట్టాల్సి ఉంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువుపై మాత్రమే ఎక్సైజ్ సుంకం విధిస్తున్న సంగతి తెలిసిందే. -
పెట్రో ఆదాయం 3.35 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రానికి రూ.3,35,746 కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ లోక్‌సభకు తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ లీటరుపై రూ.19.98 నుంచి రూ.32.90, డీజిల్‌పై రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచడంతో ఒక్క ఏడాదిలోనే 88 శాతం ఆదాయం పెరిగినట్లు పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈమేరకుసమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2019 ఏప్రిల్ 1వ తేదీన పెట్రోల్ రూ.77.26, డీజిల్ రూ.71.81, ఎల్పీజీ రూ.762 ఉండగా, ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి పెట్రోల్ రూ.102.69, డీజిల్ రూ.97.20, ఎల్పీజీ రూ.887కు చేరుకున్నాయని తెలిపారు. -
ధరలకు ఇంధన సెగ!
న్యూఢిల్లీ: అటు టోకుగా ఇటు రిటైల్‌గా భారత్‌లో సామాన్యునిపై ధరా భారం తీవ్రంగా ఉంది. మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 12.94 శాతంగా నమోదయ్యింది (2020 మే నెల ధరతో పోల్చితే) లో బేస్‌కు తోడు తాజాగా ఇంధన, తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత ఇందుకు ప్రధాన కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలలో, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో టోకున అసలు ధరలు పెరక్కపోగా ప్రతి ద్రవ్యోల్బణం (–3.37%) నమోదయ్యింది. 2021 ఏప్రిల్ నెలతో పోల్చినా (10.49%) టోకు ద్రవ్యోల్బణం మరింత పెరగడం గమనార్హం. ఇంధనం, విద్యుత్ ధరలు 37.61% పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు 20.94 శాతం. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు మేలో 10.83 శాతం పెరిగిగే, ఏప్రిల్‌లో 9.01 శాతం ఎగశాయి. అయితే ఆహార ధరల తీవ్రత 4.31%గా ఉంది. ట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తేవాలి ద్రవ్యోల్బణంపై ప్రధానంగా అధిక ఇందన ధరల ప్రభావం పడుతోంది. ఇది సామాన్యుని నుంచి పరిశ్రమ వరకూ ధరా భారం మోపుతోంది. దేశీయ ఉత్పత్తులకు భారత్‌తోపాటు అటు అంతర్జాతీయంగానూ పోటీ పరంగా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంధన ధర ల్లో హేతుబద్దత తీసుకువచ్చు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోనికి తీసుకుని రావడానికి పెట్రోలి యం ప్రొడక్టులను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోనికి తీసుకుని రావాలి. ఈ విషయాన్ని పరిశీలించమని కేంద్రాన్ని కోరుతున్నాం. – సంజయ్ అగర్వాల్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ చదవండి: పుకార్లు షికార్లు,అదానీ ‘ఫండ్స్’ కలకలం! -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
ఎగుమతులు రివర్స్‌గేర్
న్యూఢిల్లీ: భారత్ ఆరి్థక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి–దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాశాలను చూస్తే... ► ఆగస్టులో ఎగుమతుల విలువ 26.13 బిలియన్ డాలర్లు. 2018 ఆగస్టుతో పోలి్చతే విలువ పెరక్కపోగా 6 శాతం క్షీణించింది. పెట్రోలియం, ఇంజనీరింగ్, తోలు, రత్నాలు, ఆభరణాల విభాగంలో అసలు వృద్ధిలేదు. ఎగుమతులకు సంబంధించి మొత్తం 30 కీలక రంగాలను చూస్తే, 22 ప్రతికూలతనే నమోదుచేసుకున్నాయి. రత్నాలు ఆభరణాల విభాగంలో –3.5% క్షీణత, ఇంజనీరింగ్ గూడ్స్ విషయంలో 9.35% క్షీణత, పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో 10.73% క్షీణత నమోదయ్యింది. కాగా సానుకూలత నమోదు చేసిన రంగాల్లో ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, సుగంధ ద్రవ్యాలు, మెరైన్ ప్రొడక్టులు ఉన్నాయి. ► దిగుమతుల విలువలో కూడా (2018 ఆగస్టుతో పోలి్చతే) అసలు పెరుగుదల లేకపోగా 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ 39.58 బిలియన్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో ఇంత స్థాయి క్షీణత 2016 ఆగస్టు తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో ఈ క్షీణ రేటు మైసస్ 14 శాతంగా ఉంది. ► దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 13.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఆగస్టులో వాణిజ్యలోటు 17.92 బిలియన్ డాలర్లు. ► ఆగస్టులో చమురు దిగుమతులు 8.9 శాతం పడిపోయి 10.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు కూడా 15 శాతం క్షీణించి, 28.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక ప్రత్యేకించి పసిడి దిగుమతులు చూస్తే, భారీగా 62.49 శాతం పడిపోయి 1.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఏడాదంతా నిరుత్సాహమే... భారత్ ఎగుమతుల విభాగం ఈ ఏడాది ఇప్పటి వరకూ నిరుత్సాహంగానే నిలిచింది. ఆరి్థక వ్యవస్థ మందగమనం ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఆరి్థక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తయారీ రంగం మందగమనంతో జూలైలో తయారీ రంగం వృద్ధి కూడా 4.3 శాతానికి పరిమితం అయ్యింది. కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ చూసుకుంటే, భారత్ ఎగుమతులు 1.53 శాతం క్షీణించి, 133.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు కూడా 5.68 శాతం పడిపోయి 206.39 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 72.85 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఇంధన ధరల్లో ప్రభుత్వ జోక్యం లేదు
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో వాటి ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా రేట్లు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా విలేకరులకు ఆయన చెప్పారు. ఇటీవలే పెట్రోల్, డీజిల్‌పై రూ.1.50 మేర ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. లీటరుకు మరో రూ.1 మేర తగ్గించాలంటూ పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలను ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధాన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల విధానంలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని, రోజువారీ ప్రాతిపదికన రేట్లపై నిర్ణయాధికారం పూర్తిగా ఆయిల్ కంపెనీలకే ఉంటుందని ప్రధాన్ చెప్పారు. చమురు మార్కెట్లో స్థిరత్వం మా కృషి ఫలితమే: ఒపెక్ చమురు రేట్ల విషయంలో భారత్ సహా ఇంధనాన్ని అత్యధికంగా వినియోగించే ఏ దేశం కూడా ఇబ్బంది పడేలా తాము వ్యవహరించలేదని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ పేర్కొంది. చమురు మార్కెట్ మళ్లీ స్థిరపడేందుకు ప్రయత్నించామని తెలిపింది. అయితే, పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు, వడ్డీ రేట్ల పెరుగుదల తదితర అంశాలు ఈ స్థిరత్వానికి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) సెక్రటరి జనరల్ సానుసి బర్కిందో ఈ విషయాలు తెలిపారు. అధిక చమురు రేట్లతో ప్రపంచ ఎకానమీ వృద్ధికి విఘాతం కలుగుతుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో బర్కిందో తాజా వివరణనిచ్చారు. వినియోగ దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తాము నిర్ణయాలు తీసుకుంటామని, చమురు మార్కెట్లో స్థిరత్వం వినియోగ దేశాలు సరైన ప్రణాళికలను అమలు చేయలేవని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 97.2 మిలియన్ బ్యారెళ్లు (ఎంబీ/డీ)గా ఉన్న ప్రపంచ ఆయిల్ డిమాండ్ 2040 నాటికి 111.7 ఎంబీ/డీకి చేరుతుందని ఈ పెరుగుదలలో దాదాపు 40 శాతం (5.8 ఎంబీ/డీ) భారత్‌దే ఉంటుందని బర్కిందో తెలిపారు. -
పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రం రూ.2.5 మేర తగ్గించిందని సంతోషించేలోపే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు మళ్లీ షాకిచ్చాయి. ఆదివారం లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచు తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.87.29కి చేరుకోగా, డీజిల్ రూ.77.06కు పెరిగింది. దీంతో పెట్రోల్ ధరలు మళ్లీ మూడువారాల గరిష్టానికి చేరుకున్నట్లయింది. పెట్రోలియం ఉత్పత్తులపై రూ.2.5ను తగ్గిస్తూ అక్టోబర్ 4న కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 18 పైసలు, డీజిల్‌పై 29 పైసలను పెంచా యి. తాజా నిర్ణయంతో 2014 నుంచి ఇప్పటివ రకూ పెట్రోల్‌పై రూ.11.77, డీజిల్‌పై రూ.13.47ను ప్రభుత్వం పెంచినట్లయింది. కాగా, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేంద్రం రూ.2.5 మేర ధరల్ని తగ్గించిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
పెట్రోలియంపై జీఎస్టీ కౌన్సిల్‌దే తుది నిర్ణయం
న్యూఢిల్లీ: రాజ్యాంగపరంగా పెట్రోలియం ఉత్పత్తులు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోనే ఉన్నాయని కేంద్రం బుధవారం పార్లమెంటుకు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి ఎప్పటి నుంచి తీసుకురావాలన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాజ్యాంగపరంగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయని పేర్కొంది. ఇటీవల చమురు ధరలు పెరగడంపై రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ.. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 279ఏ(5) ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులపై వస్తుసేవల పన్నును ఎప్పటి నుంచి విధించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేస్తుంది. కాబట్టి రాజ్యాంగపరంగా పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయి’ అని చెప్పారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో లీటర్‌కు రూ.2 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపారు. -
భారత్‌తో సంబంధాలు కీలకం: ఓలీ
-
బలమైన బంధం పునరుద్ధరణకు!
న్యూఢిల్లీ: నేపాల్ సర్వతోముఖాభివృద్ధిలో భారత్ మొదట్నుంచీ అండగా నిలబడుతూ వస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్–నేపాల్ మధ్య సహకారం పెరగటం ద్వారా నేపాల్‌లో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందన్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా భారత్‌తో విశ్వాసం పెంచుకునేలా సత్సంబంధాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. భారత్–నేపాల్ మధ్య గతంలో ఉన్న బలమైన సత్సంబంధాలను పునరుద్ధరించేదిశగా మోదీ, ఓలీ మధ్య శనివారం ఢిల్లీలో విస్తృతమైన చర్చలు జరిగాయి. చర్చలు అత్యంత సంతృప్తికరంగా సాగాయని భారత విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. రక్షణ, భద్రత, వ్యవసాయం, వాణిజ్యం, రైల్వేల అనుసంధానత తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. అనంతరం ఇరుదేశాల సరిహద్దుల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వీరిద్దరూ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. భారత్‌తో సంబంధాలు కీలకం: ‘21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మిషన్‌తోనే ఈసారి భారత పర్యటనకు వచ్చాను. రెండు సన్నిహిత పొరుగుదేశాల మధ్య బలమైన సంబంధాలను నెలకొల్పటమే మా (భారత్–నేపాల్) ఉద్దేశం. ఇతర దేశాలతో పోలిస్తే పొరుగున ఉన్నదేశాలతో సంబంధాలు కీలకం’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా ప్రకటనలో ఓలీ అన్నారు. కేపీ ఓలీ నేతృత్వంలో వామపక్ష పార్టీ నేపాల్‌లో అధికార పగ్గాలు చేపట్టాక భారత్‌తో సంబంధాలు బలహీనమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం పెరిగిపోతోందంటూ 2016లో ఓలీ బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే. ‘తాజా ఎన్నికల తర్వాత నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం వచ్చింది. దీంతో సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రస్తుతం దృష్టిపెట్టాం’ అని కోలీ తెలిపారు. కాగా, నేపాల్‌లో పర్యటించాలంటూ మోదీని ఓలీ ఆహ్వానించారు. ఈ ఏడాది మోదీ నేపాల్‌లో పర్యటించే అవకాశముంది. వాణిజ్యలోటుపై ఓలీ ఆందోళన నేపాల్‌లో వాణిజ్యలోటు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఓలీ.. దేశ ఎగుమతులు వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నేపాల్ అభివృద్ధికి అవసరమైన సాయం చేసేందుకు మోదీ సంసిద్ధత తెలిపారు. ఓలీ ‘నేపాల్ శ్రేయస్సు. నేపాల్ అభివృద్ధి’ నినాదం, తమ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతో దగ్గరగా ఉందన్నారు. భారతభూభాగంలోని రాక్సౌల్ నుంచి కఠ్మాండుకు.. భారత ఆర్థిక సహకారంతో విద్యుత్ రైల్వేలైను వ్యవస్థను నిర్మించేందుకు మోదీ అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతానికి కార్గోలు ప్రయాణించేలా జలమార్గాలను వృద్ధి చేసుకోవాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. -
ఎగుమతులు రయ్..
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్లో ఎగుమతులు 12.36 శాతం మేర వృద్ధి చెందాయి. విలువపరంగా 27.03 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, ముడిచమురు, పసిడి దిగుమతులు భారీగా పెరగడంతో ఇంపోర్ట్ బిల్లు సైతం 21.12 శాతం ఎగిసి రూ. 41.91 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన చూస్తే డిసెంబర్లో 41 శాతం ఎగిసి 14.88 బిలియన్ డాలర్లకు చేరింది. ‘గతేడాది అక్టోబర్‌లో 1.1 శాతం తగ్గుదల మినహా.. 2016 ఆగస్టు నుంచి 2017 డిసెంబర్ దాకా ఎగుమతుల ధోరణి సానుకూలంగానే నమోదవుతూ వస్తోంది‘ అని కేంద్రం పేర్కొంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్లో పేర్కొన్నారు. ఎగుమతులు.. గతేడాది నవంబర్‌లో 26.19 బిలియన్ డాలర్లు కాగా, 2016 డిసెంబర్లో 24.05 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 300 బిలియన్ డాలర్ల మైలురాయి దాటతాం: ఎఫ్ఐఈవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలోనే 224 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేశ్‌కుమార్ గుప్తా తెలిపారు. 2018లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి మెరుగ్గా ఉండనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం 300 బిలియన్ డాలర్ల మైలురాయిని సులభంగా దాటేయగలమని ధీమా వ్యక్తం చేశారు. 2015–16లో మొత్తం ఎగుమతులు 262 బిలియన్ డాలర్లు కాగా, 2016–17లో 275 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. దిగుమతులు దేశీయంగా ఉత్పత్తికి తోడ్పడేవేనా లేక సవాలుగా మారే అవకాశముందా అన్న అంశాన్ని పరిశీలించాలని గుప్తా పేర్కొన్నారు. మరోవైపు, పన్ను విభాగం అధికారుల మొండివైఖరి, అవగాహన లేమి కారణంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ పొందటంలో ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక వివిధ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. ♦ మొత్తం 30 ప్రధాన ఉత్పత్తుల్లో 21 ఉత్పత్తుల ఎగుమతులు వృద్ధి నమోదు చేశాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, సేంద్రియ.. నిరింద్రియ రసాయనాలు, వజ్రాభరణాలు, ఔషధాలు వీటిలో ఉన్నాయి. ♦ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి 25 శాతం. ♦రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 8 శాతం క్షీణించి 1.33 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. ♦పసిడి దిగుమతులు 71.5 శాతం ఎగిసి 3.39 బిలియన్ డాలర్లుగా నమోదు. 2016 డిసెంబర్లో ఈ పరిమాణం 1.97 బిలియన్ డాలర్లే. ♦పెట్రోలియం ఉత్పత్తులు, ముడిచమురు దిగుమతులు 35% పెరిగి 7.66 బిలియన్ డాలర్ల నుంచి 10.34 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ఏప్రిల్–డిసెంబర్ మధ్య తొమ్మిది నెలలకాలంలో ఎగుమతులు 12 శాతం వృద్ధి చెంది 223.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సుమారు 22 శాతం పెరిగి 338.37 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 114.85 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఇక ఆ వెబ్సైట్లోనూ పెట్రోల్ దొరుకుతుంది
ఇక త్వరలోనే ప్రతి పెట్రోలియం ఉత్పత్తులు ఈ-కామర్స్ వెబ్సైట్లలోనూ లభ్యం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అనుమతులు లభించాయని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను ఈ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చినప్పుడు అందరూ తనని అనుమానస్పదంగా చూశారని, కానీ ప్రస్తుతం ఇది అమల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. న్యూఢిల్లీలో నేటి నుంచి ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ ఆలోచనను ఏప్రిల్ 21నే శ్రీనగర్‌లో జరిగిన పార్లమెంట్ సభ్యుల సంప్రదింపుల సంఘంలో ప్రధాన్ మొదటిసారి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలను పెంచడానికి ఇంధనాన్ని హోమ్ డెలివరీ కూడా చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చూస్తోంది. హోమ్ డెలివరీతో బంకుల వద్ద భారీ ఎత్తున్న క్యూలను నిర్మూలించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నెలల్లో డీజిల్‌ను ఇంటి వద్దకే డెలివరీ చేయడాన్ని లాంచ్ చేస్తామని గత నెలలో ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పింది. ప్రస్తుతం పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆమోదం పొందాల్సి ఉంది. రోజువారీ దేశవ్యాప్తంగా లక్ష రిటైల్ అవుట్లెట్లకు 40 మిలియన్ వినియోగదారులు వస్తున్నారు. -
పెట్రోలియంపైనా జీఎస్టీ!
శ్రీనగర్: పెట్రోలియం ఉత్పత్తుల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందేనని ఆర్థిక రంగ నిపుణులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. మూడ్రోజుల క్రితం శ్రీనగర్‌లో జరిగిన జీఎస్టీ మండలి భేటీలో 1200 వస్తువులు, 500 సేవలపై పన్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన పెట్రోలియం ఉత్పత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటి కొన్నేళ్లు పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధి నుంచి మినహాయించి ఎప్పటిలానే ఎక్సైజ్ పన్ను, వ్యాట్ వసూలు చేయాలని ప్రతిపాదించారు. పెట్రోలియం ఉత్పత్తులైన క్రూడాయిల్, సహాజవాయువు, ఏవియేషన్ ఇంధనం, డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించగా.. కిరోసిన్, నాఫ్తా, ఎల్పీజీపై జీఎస్టీనే అమలు చేయనున్నారు. ఈ ప్రతిపాదనను జమ్మూ కశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ డ్రబు తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ఐదింటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. అలా జరగకుంటే స్వాతంత్య్రం అనంతరం మొదటిసారిగా అమలు చేస్తున్న భారీ పన్ను సంస్కరణతో ప్రయోజనమేంటని ప్రశ్నించారు. ‘ఎందుకు వ్యవస్థను బలహీనం చేస్తారు. మీరు ముందడుగు వేసి విధానాన్ని రూపొందిం చినప్పుడు.. ఇలాంటి తెలివితక్కువ పనులతో ఎందుకు గందరగోళం సృష్టిస్తారు’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాసులు కురిపించేవి ఆ ఐదు పెట్రోలియం ఉత్పత్తులేనని, వాటిని జీఎస్టీ పరిధి నుంచి తప్పిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముందని డ్రబు అభిప్రాయపడ్డారు. జూలై 1 నుంచే పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని పలువురు ఆర్థిక, పన్ను రంగ నిపుణులు ఇప్పటికే సూచించారు. -
రిలయన్స్ భేష్!
అంచనాలను మించిన ఫలితాలు.. క్యూ1లో లాభం రూ.7,113 కోట్లు; 18 శాతం జంప్ ♦ రిఫైనింగ్ మార్జిన్ల జోరు ప్రభావం.. ♦ జూన్ క్వార్టర్లో జీఆర్ఎం 11.5 డాలర్లు ♦ ఆదాయం మాత్రం 13.4 శాతం డౌన్; రూ.71,451 కోట్లు ♦ క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల క్షీణత కారణం న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... అంచనాలను మించిన లాభాలతో అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18.1 శాతం దూసుకెళ్లి రూ.7,113 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,024 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా పటిష్టమైన ముడిచమురు రిఫైనింగ్ మార్జిన్లు లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 13.4 శాతం దిగజారి రూ.71,451 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పతనం కావడం ఆదాయాల క్షీణతకు దారితీసింది. కాగా, జూన్ క్వార్టర్లో మార్కెట్ విశ్లేషకులు రూ.6,515 కోట్ల లాభాన్ని అంచనా వేశారు. జీఆర్ఎం దూకుడు... క్యూ1లో స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 11.5 డాలర్లకు ఎగబాకింది. ఇది ఎనిమిదేళ్ల గరిష్టస్థాయి కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.4 డాలర్లుకాగా, గడిచిన త్రైమాసికం(క్యూ4)లో ఇది 10.8 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా శుద్ధి చేయడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. క్రూడ్ రిఫైనింగ్‌కు సంబంధించి ప్రామాణికంగా పరిగణించే సింగపూర్ బెంచ్‌మార్క్ జీఆర్ఎం క్యూ1లో 5 డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. క్యూ1లో రిలయన్స్ జీఆర్ఎం 9.8 డాలర్లుగా ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇతర ముఖ్యాంశాలు.. ♦ క్యూ1లో స్థూల లాభం 26% దూసుకెళ్లి రూ.6,593 కోట్లకు ఎగసింది. ఈ విభాగంలో ఆదాయం 17.7% క్షీణించి రూ.68,729 కోట్ల నుంచి రూ.56,568 కోట్లకు తగ్గింది. ♦ జూన్ క్వార్టర్లో ఆర్ఐఎల్ జామ్ నగర్ జంట రిఫైనరీలు 16.8 మిలియన్ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయి. ♦ పెట్రోకెమికల్స్ వ్యాపారంలో స్థూల లాభం 20.5 శాతం వృద్ధి చెంది రూ.2,806 కోట్లకు చేరింది. ఆదాయం స్వల్పంగా 0.7 శాతం తగ్గుదలతో రూ.20,858 కోట్ల నుంచి రూ.20,718 కోట్లకు తగ్గింది. ♦ చమురు, గ్యాస్ వ్యాపారంలో స్థూల నష్టం రూ.199 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెరిగింది. ఈ రంగంలో ఆదాయం రూ.1,340 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 2,054 కోట్లతో పోలిస్తే ఏకంగా 34.8 శాతం క్షీణించింది. ♦ కేజీ-డీ6 క్షేత్రాల్లో క్రూడ్ ఉత్పత్తి 35% దిగజారి 0.28 మిలియన్ బ్యారళ్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి 23% క్షీణించి 28.05 బిలియన్ ఘనపుటడుగులకు తగ్గింది. ♦ ఇతర ఆదాయం గతేడాది క్యూ1లో రూ.1,584 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్లో ఏకంగా రూ.2,378 కోట్లకు దూసుకెళ్లింది. ప్రధానంగా కొన్ని ఆస్తుల విక్రయం, వడ్డీ రూపంలో ఆదాయం పెరగడం దోహదం చేసింది. ♦ రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ1లో రూ. 45.8% ఎగసి రూ.6,666 కోట్లకు చేరింది. స్థూల లాభం రూ.198 కోట్ల నుంచి రూ.240 కోట్లకు పెరిగింది. జూన్ చివరికి 679 నగరాల్లో మొత్తం 3,383 స్టోర్లను నిర్వహిస్తోంది. ♦ కంపెనీ మొత్త రుణ భారం ఈ ఏడాది జూన్ చివరినాటికి రూ.1,86,692 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది జూన్ చివరికి రుణ భారం రూ.1,80,388 కోట్లు. ♦ కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు స్వల్ప పెరుగుదలతో రూ.80,966 కోట్ల నుంచి రూ.90,812 కోట్లకు చేరాయి. ♦ శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు ధర 0.61 శాతం లాభంతో రూ.1,013 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మేం లాభాల జోరును కొనసాగిస్తున్నాం. రిఫైనింగ్ వ్యాపారం మరోసారి రికార్డుస్థాయి పనితీరును నమోదు చేసింది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోనూ వృద్ధి జోరందుకుంది. రిలయన్స్ జియో 4జీ టెలికం సేవలకు మొత్తం వ్యవస్థ సిద్ధమైంది. దేశంలో ప్రతి ఒక్కరికీ అధునాతన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ విప్లవానికి తెరతీయనున్నాం’. - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ జియో వాణిజ్య సేవలు ఎప్పటినుంచో? దేశీ టెలికం రంగంలో ఉత్కంఠ రేపుతున్న రిలయన్స్ జియో 4జీ సేవలకు సంబంధించి వాణిజ్యపరమైన కార్యకలాపాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయనేది కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో 15 లక్షల మందికి పైగా టెస్ట్ యూజర్లు ఉన్నట్లు అంచనా. కాగా, రానున్న నెలల్లో ఈ ప్రయోగాత్మక సేవలను పూర్తిస్థాయి వాణిజ్య సేవల్లోకి అప్‌గ్రేడ్ చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టింగ్ సందర్భంగా యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 26 జీబీగా ఉన్నట్లు తెలిపింది. ఇక సగటు నెలవారీ వాయిస్ వినియోగం 355 నిమిషాలుగా నమోదైనట్లు వెల్లడించింది. -
ఎగుమతులు 11 వ‘సారీ’..
అక్టోబర్‌లో 17.5 శాతం క్షీణత * 11 నెలల నుంచీ ఇదే ధోరణి * దిగుమతులూ తగ్గుముఖం... * ఎనిమిది నెలల కనిష్టానికి వాణిజ్యలోటు న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణ ధోరణి వరుసగా 11వ నెలా కొనసాగింది. వాణిజ్య మంత్రిత్వశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం 2014 అక్టోబర్ ఎగుమతుల విలువతో పోల్చితే 2015 అక్టోబర్‌లో ఎగుమతులు అసలు పెరక్కపోగా 17.5 శాతం క్షీణించాయి. విలువలో 25.89 బిలియన్ డాలర్ల నుంచి 21.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా డిమాండ్ మందగమనం దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఇక ప్రధానంగా కమోడిటీ ధరల కనిష్ట స్థాయి, అలాగే దేశీయ మందగమన పరిస్థితులను దిగుమతులు ప్రతిబింబిస్తున్నాయి. ఈ రేటు 21 శాతం పడిపోయింది. విలువ 39.46 బిలియన్ డాలర్ల నుంచి 31.12 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అక్టోబర్ నెలలో చమురు దిగుమతులు 45.31 శాతం పడ్డాయి. విలువలో 6.84 బిలియన్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 10 శాతం క్షీణతతో 24.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు 8 నెలల కనిష్టం...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇంత తక్కువ స్థాయి వాణిజ్యలోటు ఫిబ్రవరి తరువాత ఇదే తొలిసారి. ముఖ్య రంగాలు చూస్తే... పెట్రోలియం ప్రొడక్టులు (-57 శాతం), ముడి ఇనుము (-85.5 శాతం), ఇంజనీరింగ్ (-11.65 శాతం) రత్నాలు, ఆభరణాలు (-12.84 శాతం) విభాగాల ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బంగారం దిగుమతులూ తగ్గాయ్.. దేశ దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించే పసిడి దిగుమతులూ అక్టోబర్‌లో పడిపోయాయి. 59.5 శాతం క్షీణించాయి. విలువ 4.20 బిలియన్ డాలర్ల నుంచి 1.70 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి దోహదపడే అంశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దిగుమతుల విలువ భారీగా తగ్గడానికి పసిడి విలువ గణనీయంగా పడిపోవడం కారణం. ఏడు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన ఏడు నెలల కాలంలో (ఏప్రిల్-అక్టోబర్) ఎగుమతులు 18% క్షీణించాయి. విలువ 154 బిలియన్ డాలర్లు. దిగుమతులు సైతం 15% తగ్గి 232 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్య లోటు 77 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడు నెలల కాలంలో చమురు దిగుమతుల విలువ 42% పడిపోయి 95 బిలియన్ డాలర్ల నుంచి 55 బిలియన్ డాలర్లకు పడిపోయింది. లక్ష్యం కష్టమే... గతేడాది దేశం 310 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. అయితే ఈ ఏడాది 300 బిలియన్ డాలర్లనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ధోరణుల వల్ల ఈ లక్ష్య సాధన కూడా కష్టమేనని ఎగుమతుల సంస్థ... ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ ఎస్సీ రెల్హాన్ అన్నారు. -
భారత్‌లో ‘వినియోగం’బూస్ట్!
ముంబై: రానున్న కొద్ది నెలల్లో భారత్‌లో ‘వినియోగం’ వ్యయాలు గణనీయంగా పెరగనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిలించ్ (బీఓఏ-ఎంఎల్) ఒక నివేదికలో తెలిపింది. కారణాలు చూస్తే... - రుణ రేటు కోతలకు వీలుండడం. - ప్రభుత్వం వేతనాలు పెంచే అవకాశాలు. - తక్కువ స్థాయిలో ఉన్న పెట్రో ప్రొడక్టుల కొనుగోళ్ల విషయంలో ఒనగూరే గృహ పొదుపులు. - దీనంతటికీ తోడు మద్దతు ధరలు పెంచడం వల్ల గ్రామీణ డిమాండ్ పెరిగే అవకాశం. - స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు ఒక శాతానికి సమానంగా వినియోగం రికవరీ సాధిస్తుందన్నది తమ అంచనా అని తెలిపింది. -
ఏడవ నెలా ఎగుమతులు డౌన్
జూన్‌లో 16 శాతం క్షీణత - అంతర్జాతీయ మాంద్యం, క్రూడ్ ఆయిల్ తక్కువ ధరలు కారణం - దిగుమతులదీ క్షీణబాటే - వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతుల క్షీణబాట వరుసగా ఏడవనెల 2015 జూన్‌లోనూ కొనసాగింది. 2014 ఇదే నెలతో పోల్చిచూస్తే... ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 16 శాతం క్షీణించింది. 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయంగా నెలకొన్న మాంద్యం పరిస్థితులు, క్రూడ్ ధరలు తక్కువ స్థాయి వల్ల ఈ విభాగంలో పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల విలువలు పడిపోవడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఇక దిగుమతులు కూడా క్షీణ ధోరణినే కొనసాగిస్తున్నాయి. ఈ విలువ 2014 జూన్‌తో పోల్చితే 2015 జూన్‌లో ఈ విలువ 14 శాతం పడిపోయి 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో నెలకొన్న డిమాండ్ రాహిత్య పరిస్థితి దీనికి కారణం. దీనితో ఎగుమతి-దిగుమతుల వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్య లోటు 11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు... - ఎగుమతులు పడిపోయిన ప్రధాన రంగాల్లో పెట్రోలియం ప్రొడక్టులు (53 శాతం), ఇంజనీరింగ్ (5.5 శాతం), తోలు, తోలు ఉత్పత్తులు (5 శాతం), రసాయనాలు (1 శాతం) ఉన్నాయి. - చమురు దిగుమతులు 35 శాతం పడి, 8.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 2 శాతం పడి 24.44 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. - బంగారం దిగుమతులు జూన్‌లో 37 శాతం పడిపోయాయి. - 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మూడు నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (2015-16, ఏప్రిల్-జూన్) ఎగుమతులు గత ఏడాది ఇదే కాలం విలువతో పోల్చితే 17% పడిపోయి 67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13% క్షీణించి 99 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్య లోటు మొదటి క్వార్టర్లో 32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యం నెరవేరలేదు. 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యమయితే, 311 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఈ స్థాయిలోనైనా ఎగుమతులు జరిగేనా... అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2019-20 నాటికి 900 బిలియన్ డాలర్ల ఎగుమతుల మార్కు సాధించాలన్నది లక్ష్యం. ఈ లక్ష్య సాధన బాటలో కేంద్రం వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు ట్రేడ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (టీఎఫ్సీ)ను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. కేంద్రం జోక్యం అవసరం: ఎఫ్ఐఈఓ కాగా ఎగుమతుల క్షీణత కొనసాగుతున్న పరిస్థితుల పట్ల భారత ఎగుమతి సంఘాల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎస్సీ రల్హాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులకు సంబంధించి ఇదే పరిస్థితి కొనసాగితే... ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. తక్షణం ఈ పరిస్థితి కట్టడికి తీసుకోవలసిన చర్యలపై కేంద్రం సంబంధిత వర్గాల అభిప్రాయాలను సమీకరించాలని కోరారు. -
ఎగుమతులు... మళ్లీ నిరాశే!
⇒ ఏప్రిల్‌లో 14 శాతం క్షీణతతో 22 బిలియన్ డాలర్లగా నమోదు ⇒ వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో నిరాశపర్చాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చిచూస్తే, 2015 ఏప్రిల్‌లో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14% క్షీణించాయి. 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. 2014 ఏప్రిల్‌లో ఈ పరిమాణం 26 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన చూస్తే- ఎగుమతులు క్షీణ దశలో ఉండడం ఇది వరుసగా 5వ నెల. దిగుమతులూ తగ్గాయ్.. ⇒ ఇక ఇదే నెలలో దిగుమతులు కూడా 7 శాతం పైగా క్షీణించాయి. ఈ విలువ 36 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు దిగింది. వాణిజ్యలోటు ఇదీ...: ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2014 ఏప్రిల్ ఈ పరిమాణం 10 బిలియన్ డాలర్లు కాగా 2015 మార్చిలో 12 బిలియన్ డాలర్లు. మరిన్ని అంశాలు... ⇒ అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం. ⇒ పెట్రోలియం ప్రొడక్టులు, రత్నాలు-ఆభరణాలు వంటి ప్రధాన ఎగుమతి విభాగాలు ప్రతికూల ఫలితాలు నమోదుచేసుకున్నాయి. ⇒ చమురు దిగుమతులు 43 శాతం తగ్గి, 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ⇒ చమురుయేతర దిగుమతులు 13 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు చేరాయి. ⇒ గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో దేశం 340 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 2013-14 కన్నా (314 బిలియన్ డాలర్లు) తక్కువగా 310.5 బిలియన్ డాలర్లుగా ఎగుమతులు నమోదయ్యాయి. పసిడి మెరుపు... కాగా ఏప్రిల్‌లో ఒక్క బంగారం దిగుమతుల విలువ చూస్తే 78 శాతం పెరిగి 3.13 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం విలువ తగ్గడం, నియంత్రణల సడలింపు వంటి అంశాలు దీనికి కారణం. 2014 ఏప్రిల్‌లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు 2015 ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు చేరడానికి బంగారం దిగుమతులు పెరగడమూ ఒక కారణం. -
31న పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం డీలర్లు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా 31న చమురు సంస్థల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు చేయకుండా నిరసన పాటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ నేత వినయ్ కుమార్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కమీషన్ 5 శాతం ఇవ్వాలని, పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన మరుగు దొడ్ల నిర్వహణ బాధ్యతలను చమురు సంస్థల ద్వారా థర్డ్‌పార్టీకి అప్పగించాలని, దేశవ్యాప్తంగా ఒకే ధరలను అమలు చేయాలని, ధరల హెచ్చు తగ్గులతో జరిగిన నష్టాన్ని చమురు సంస్థలు భరించి డీలర్లకు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, కొత్త ఔట్లెట్ ప్రారంభంలో సమీప బంకులపై ప్రభావం చూపకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని, స్టాక్ ఉన్నంత వరకు అమ్మకాలు జరుపుతామని, ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు. -
డీజిల్ నష్టాలకు ఇక చెల్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంవత్సరాల తరబడి పలు పెట్రో ఉత్పత్తులను నష్టాలకు విక్రయిస్తున్న దేశీ పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు, సబ్సిడీ భారాన్ని మోస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమేపీ దిగిరావడం, మరోవైపు రూపాయి మారకపు విలువ పుంజుకోవడంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీలకు ఈ సోమవారంతో ఇక డీజిల్ నష్టాలు నష్టాలకు బ్రేక్‌పడినట్లే. గతేడాది లీటరు డీజిల్ అమ్మకం ద్వారా రూ. 14 వరకూ ఈ కంపెనీలకు నష్టాలు పెరిగిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 8వరకూ తగ్గిన నష్టం తాజాగా పెట్రోలియం శాఖ గణాంకాల ప్రకారం గత శుక్రవారానికి (5 సెప్టెంబర్) 8 పైసలకు పడిపోయింది. ఆ రోజున ఇండియన్ బాస్కెట్ క్రూడ్ బ్యారల్ విలువ 99.66 డాలర్లకు తగ్గడం, డాలరుతో రూపాయి మారకపు విలువ 60.44కు పెరగడంతో రూపాయిల్లో ఈ బాస్కెట్ క్రూడ్ 6023.45కు తగ్గింది. ఈ సోమవారం ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర మరో 1 శాతంపైగా తగ్గడం, రూపాయి విలువ ఇంకో 15పైసలు పెరగడ ంతో ఇండియన్ బాస్కెట్ క్రూడ్ రూ. 5,950 స్థాయికి దిగివస్తుంది. తద్వారా డీజిల్ అమ్మకాలపై కంపెనీలకు నష్టం బదులు దశాబ్దం తర్వాత తొలిసారి లాభం వస్తుంది. అంతర్జాతీయంగా లభించే మూడు రకాల క్రూడ్స్ మనం దిగుమతి చేసుకుంటున్నందున, ఈ మూడింటినీ కలిపి ఇండియన్ క్రూడ్ బాస్కెట్‌గా వ్యవహరిస్తారు. ఈ మూడింటి 15 రోజుల సగటు విలువ ఆధారంగా పెట్రో ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభనష్టాలను గణిస్తారు. లాభం వినియోగదారులకు అందాలంటే మరికొంత సమయం.... డీజిల్ నష్టాలు పూడేందుకు ప్రపంచ ధరలు తగ్గడం, రూపాయి పెరగడం మాత్రమే కారణం కాాదు. 2013 జనవరి నుంచి 19 దఫాలు లీటరుకు 50 పైసల చొప్పున మొత్తం రూ. 11.81 మేర పెంచడం ప్రధాన కారణం. ఇప్పటివరకూ పెంపు భరించిన వినియోగదారులు క్రూడ్ ధరల తగ్గుదల లబ్దిని పొందాలంటే మరికొంత సమయం పట్టొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు మార్కెట్‌తో అనుసంధానించి వున్నందున ప్రపంచ మార్కెట్లో ధర పెరిగితే ఇక్కడ పెంచడం, పడితే దేశీయంగా ధరను దించడం చేస్తున్నారు. అయితే డీజిల్ ధరల్ని ఇంకా మార్కెట్‌తో అనుసంధానించాల్సివుంది. డీజిల్ ధరలపై నియంత్రణలు ఎత్తివేసేందుకు కేబినెట్ నోట్‌ను పెట్రోలియం మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్నది. ఇక నుంచి కూడా ఇండియన్ బాస్కెట్ క్రూడ్ 100 డాలర్లకులోపు కొనసాగుతూ, రూపాయి విలువ మరింత పెరుగుతూ వుంటే కొద్ది వారాల్లో వినియోగదారులు డీజిల్ ధర తగ్గింపు శుభవార్త వినవచ్చు. -
ట్రాక్‌లోకి ఎగుమతులు
మే నెలలో 12.4 శాతం పెరుగుదల; 28 బిలియన్ డాలర్లు - గత 7 నెలల్లో తొలిసారి రెండంకెల వృద్ధి - ఇంజనీరింగ్, పెట్రో ఉత్పత్తులు, గార్మెంట్స్ ఎగుమతుల్లో మెరుగుదల ప్రభావం - 11.4 శాతం తగ్గిన దిగుమతులు; 39.23 బిలియన్ డాలర్లు - బంగారం దిగుమతులపై ఆంక్షల సడలింపునకు మార్గం సుగమం - దిగొచ్చిన వాణిజ్య లోటు; అయినా 10 నెలల గరిష్టం..11.23 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా డిమాండ్ మెరుగుపడుతుండటంతో దేశీ ఎగుమతులకు జోష్ లభిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు 12.4 శాతం వృద్ధితో 28 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల విలువ 24.9 బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 7 నెలల్లో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకోవడం, రెండంకెల వృద్ధి ఇదే తొలిసారి. ప్రధానంగా ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, గార్మెంట్స్ తదితర రంగాల ఎగుమతులు మెరుగైన వృద్ధిని నమోదుచేయడం ఇందుకు దోహదం చేసింది. కాగా, మే నెలలో దిగుమతులు 11.4% తగ్గి... 39.23 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు కాస్త కుదుటపడింది. దీంతో పసిడి దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సడలించేందుకు మార్గం సుగమం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య లోటు ఊరట... ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతులు తగ్గుముఖం పట్టడంతో వాణిజ్య లోటు కూడా దిగొచ్చింది. క్రితం ఏడాది మే నెలలో 19.24 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు(ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది మేలో 11.23 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 10.1 బిలియన్ డాలర్ల కంటే అధికంగానే ఉండటంతోపాటు గడిచిన 10 నెలల్లో గరిష్టస్థాయికి చేరడం గమనార్హం. గతేడాది జూలైలో నమోదైన 12.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటే ఇప్పటిదాకా అత్యధిక స్థాయిగా ఉంది. గణాంకాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... - పస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో(ఏప్రిల్-మే) ఎగుమతులు 8.87 శాతం ఎగబాకి 53.63 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 13.16 శాతం దిగొచ్చి 74.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో ఈ రెండు నెలల్లో వాణిజ్య లోటు 21.3 బిలియన్ డాలర్లుగా లెక్కతేలింది. - ఇక మే నెలలో చమురు దిగుమతులు 2.5 శాతం పెరిగి 14.46 బిలియన్ డాలర్లకు చేరాయి. - చమురేతర దిగుమతులు మే నెలలో 17.9 శాతం తగ్గుదలతో 24.76 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. - ఇక మే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు 22.09%, పెట్రోలియం ఉత్పత్తులు 28.7%, రెడీమేడ్ దుస్తులు(గార్మెంట్స్) 24.94%, ఫార్మా 10%, రసాయనాలు 13.8%చొప్పున వృద్ధి చెందాయి. ఇనుప ఖనిజం ఎగుమతులు 18.95 శాతం దిగజారి 72 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. - బంగారం దిగుమతులపై నియంత్రణల నేపథ్యంలో రత్నాభరణాల ఎగుమతులు నామమాత్రంగా 1.36%పెరిగి మే నెలలో 3.43 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రోత్సాహకర సంకేతమిది: ఖేర్ ‘గత 7 నెలల్లో మళ్లీ మొదటిసారిగా ఎగుమతుల్లో రెండంకెల వృద్ధిని సాధించగలిగాం. ఇదే ధోరణి గనుక కొనసాగితే మళ్లీ పూర్తిస్థాయిలో పునరుత్తేజం దిశగా పయనించే అవకాశం ఉంది. ఇది చాలా ప్రోత్సాహకర సంకేతమే’ అని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు.